అత్తింటి వేధింపులే కారణమంటూ…

– హైదరాబాద్‌లో పిల్లలతో కలిసి భవనం పైనుంచి దూకి తల్లి ఆత్మహత్య
– బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి
నవతెలంగాణ- అడిక్‌మెట్‌ / బేగంపేట
భర్త, అత్తింటి వేధింపులు తాళలేక ఓ మహిళ తన ఇద్దరు కవల పిల్లలతో కలిసి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌ గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బన్సిలాల్‌ పేటలో సోమవారం జరిగింది. సీఐ మోహన్‌ కుమార్‌ తెలిపిన వివరాలు ప్రకారం..
బన్సీలాల్‌పేట జీవైఆర్‌ బస్తీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లల్లో 8వ అంతస్తులో నివసించే దుర్గమ్మ కూతురు సౌందర్య(26)కు బోడుప్పల్‌కు చెందిన గణేష్‌తో మూడున్నరేండ్ల కిందట వివాహం జరిగింది. దంపతులకు బాబు, పాప కవల పిల్లలు(ఏడాదిన్నర) సంతానం. ఇదిలా ఉండగా సౌంద ర్యను భర్త గణేష్‌, అత్త కొన్ని రోజులుగా అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. వారి తాళలేక సౌందర్య పిల్లలను తీసుకుని తల్లిగారింటికి వచ్చింది. ఈ క్రమంలో సోమవారం సౌందర్య ఇద్దరు పిల్లలను డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల భవనం 8వ అంతస్తు పై నుంచి కిందకు వేసి.. అనంతరం తానూ దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఆత్మహత్య విషయం తెలు సుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. గాంధీనగర్‌ సీఐ మోహన్‌ రావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతురాలి తల్లి దండ్రులు దుర్గ, వేమనను మంత్రి పరామర్శించారు. భర్త వేధింపులు భరించలేకనే తన బిడ్డ ఆత్మహత్య చేసుకుందని వారు మంత్రి ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. సౌందర్య భర్త గణేష్‌కు కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.