జ్యుడీషియల్‌ పే కమిషన్‌ సిఫారసులు అమలు చేయరేం?

– 16 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సమన్లు
న్యూఢిల్లీ: ‘రెండో నేషనల్‌ జ్యుడిషియల్‌ పే కమిషన్‌’ (ఎస్‌ఎన్‌జేపీసీ) సిఫారసులను అమలు చేయని 16 రాష్ట్రాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆర్థికశాఖ కార్యదర్శులు ఆగస్టు 23న స్వయంగా కోర్టుకు హాజరుకావాలని సమన్లు ఇచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ జెబి పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ కేసుపై తదుపరి విచారణ చేపట్టింది. కోర్టు సహాయకునిగా (అమికస్‌ క్యూరీ) వ్యవహరిస్తున్న న్యాయవాది కె.పరమేశ్వర్‌ ఇచ్చిన నివేదికను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, ఒడిశా, కేరళ, రాజస్థాన్‌, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు సర్వోన్నత న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.పదవీవిరమణ పొందిన జ్యుడిషియల్‌ అధికారులకు పే కమిషన్‌ సిఫారసుల మేరకు పింఛను బకాయిలు, ఇతర ప్రయోజనాలు కల్పించడంలో ఈ రాష్ట్రాల అలసత్వం తదితర అంశాలపై అసహనం వ్యక్తంచేసింది. ఎస్‌ఎన్‌జేపీసీ సిఫారసుల అమలుకు ఏడుసార్లు అవకాశాలిచ్చి నా పూర్తిస్థాయిలో అమలు చేయడంలో అనేక రాష్ట్రాలు విఫలమయ్యాయని, ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక కార్యదర్శులు వ్యక్తిగతంగా హాజరు కాకపోతే ధిక్కరణ చర్యలు చేపట్టాల్సి ఉంటుందని సీజేఐ ధర్మాసనం హెచ్చరించింది.