– కొద్దిపాటి వర్షానికే భద్రాద్రిలో భయం భయం..
– వర్షాకాలంలో నిరంతరం నీళ్లలోనే పట్టణం
– ప్రజల బాగోగులు పట్టని బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ : సీపీఐ(ఎం) ఎమ్మెల్యేల ఏలుబడిలోనే కరకట్ట నిర్మాణం
కమ్యూనిస్టుల ఏలుబడిలో కరకట్టల నిర్మాణం.. సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలు గెలిచిన సమయంలోనే గోదారి ముంపు బాధల నుంచి భద్రాద్రికి విముక్తి.. కుంజా బొజ్జి, సున్నం రాజయ్య 30 ఏండ్లకు పైగా ఎమ్మెల్యేలు ఉన్న సమయంలో కళకళలాడిన గోదావరి(గౌతమీ) తీరం నేడు కొద్దిపాటి వర్షానికే విలవిలాడుతోంది. నేటి పాలకుల నిర్లక్ష్యానికి తోడు పోలవరం ఎత్తు పెంచడంతో బ్యాక్‌వాటర్ ప్రభావం.. భద్రాద్రి నిత్యం వరద బురదలోనే కొట్టుమిట్టాడుతోంది.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
శ్రీరాముడంటే తమకే దేవుడని.. రామభక్తి అంటే తమదేననే రీతిలో బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్ వ్యవహారశైలి ఉంటుందని తెలిసిందే. మరి రాముడంటే అయోధ్యకే పరిమితమా? శ్రీరాముడు జానకీ సమేతంగా నడయాడిన భద్రాచలం బాగోగులు మోడీ అండ్ కోకు పట్టవా? ఒకవేళ పడితే పోలవరం ఎత్తుతో గోదారి ముంపులో భద్రాద్రి కొట్టుకుపోతున్నా ఎందుకు స్పందిం చరూ..! కేసీఆర్ హామీలే తప్ప ఆచరణ ఉండదా? రూ.వెయ్యి కోట్ల వాగ్దానం ఏమై నట్టు? పోలవరం ఎత్తుపెం చినా ఎందుకు స్పందిం చరూ? స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా ప్రశ్నిం చరే.. కమ్యూనిస్టులు చట్ట సభల్లో ఉన్నన్ని రోజుల్లో భద్రాద్రికి ఏనాడైనా ఇలాంటి దుస్థితి పట్టలేదే..! కుంజా బొజ్జి, సున్నం రాజయ్య లాంటి ఎమ్మెల్యేలు మళ్లీ కావాలంటే సీపీఐ(ఎం) అభ్యర్థి గెలుపుతోనే సాధ్యమనే మాట స్థానికంగా వినిపిస్తోంది.
వర్షాకాలం వస్తే ముంపు భయం..?
కేేంద్ర, రాష్ట్రాలు గోదావరి ముంపుపై ఓ నిర్ణయాన్ని తీసుకోవడంలో తాత్సారం చేస్తుండటం పరివాహక వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. నదికి ఓవైపునున్న భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, మరోవైపున ఉన్న బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాలు వర్షాకాలం వస్తే విలవిలలాడుతున్నాయి. పోలవరం తిరుగు జలాల ప్రభావమే దీనికి కారణమని స్థానికులంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరంతో తెలంగాణలో ముంపు లేదని వాదిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ముంపు ఆధారాలను అందజేసినా కేంద్రం మాత్రం పట్టనట్టే ఉంటోంది. మరోవైపు ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రభుత్వాలు సైతం తెలంగాణకు ఈ విషయంలో మద్దతు ఇస్తున్నా.. కేంద్రం వైపు నుంచి సానుకూలత లేదు. గతేడాది వరదలకు భద్రాచలంలోని దాదాపు అన్ని కాలనీలు నీటిమయం అయ్యాయి. రామాలయ పరిసరాల్లో రోజుల తరబడి నీరు నిల్వ ఉండటంతో తెప్పలపై ప్రయాణం చేసిన దృశ్యాలు కండ్లముందే కదలాడుతున్నాయి. వేలాది ఎకరాల్లో పంట చేలు నీటమునిగాయి. ఇండ్లు నేలమట్ట మయ్యాయి. జనజీవనం నెలల తరబడి స్తంభిం చింది. అయినా ప్రభుత్వాల వైపు నుంచి పైసా సహాయ సహకారం అందలేదు. భద్రాద్రి ఆలయ భవిష్యత్తుకు కూడా పోలవరం ఎత్తుతో ముప్పు తప్పదంటున్నా.. రామభక్తులమని చెప్పుకునే పార్టీలకు పట్టడం లేదనే విమర్శలున్నాయి.
సంయుక్త సర్వేపై నిర్లక్ష్యం..
పోలవరం ఎత్తుతో గోదావరి ముంపులో భద్రాచలం, దాని పరిసరాలు నామరూపాలు లేకుండా పోతాయని.. గతేడాది వరదలే దానికి ప్రత్యక్ష నిదర్శనంగా ఉన్నా కేంద్రం మాత్రం వివక్ష చూపుతోంది. పోలవరం ఎత్తు.. భద్రాద్రి ఏజెన్సీ ప్రాంతం ముంపుపై తెలంగాణ, అటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరోసారి సంయుక్త సర్వే చేపట్టాలని కేంద్ర జలసంఘం నిర్ణయించింది. కానీ అది ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
సీపీఐ(ఎం) గెలుపే పరిష్కారం..
రెండు తెలుగు ప్రభుత్వాలను సమన్వయం చేసి ఈ సమస్యను పరిష్కరించాల్సిన కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న ఐదు పంచాయతీలనైనా తెలంగాణకు ఇస్తే కొంత వరకు సమస్య పరిష్కారం అవుతుంది. దీనిపై ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన కేంద్రం పట్టించుకోవడం లేదు. సంయుక్త సర్వే అంశాన్నీ సీడబ్ల్యూసీ నిర్లక్ష్యం చేస్తోంది. ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థి కారం పులయ్యను గెలిపిస్తే అసెంబ్లీలో పోరాడి ఈ సమస్యకు పరిష్కారం చూపుతారు.
– మచ్చా వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు