కంటికి రెప్పలా ఎర్రజెండాను కాపాడుకోవాలి

– కార్మిక చట్టాల హక్కులను కాలరాస్తున్న వారిని ఓడించండి
– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్ బాబు
నవతెలంగాణ – వీర్నపల్లి
ఎర్రజెండా కష్టజీవులకు అండగ ఉంటుంది ఎర్ర జెండాను కంటికి రెప్పలా కాపాడుకోవాలనీ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటి సభ్యులు స్కైలాబ్ బాబు అన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలో బుధవారం మే డే సందర్భంగా మండలం లోని అన్ని రంగాల కార్మికులు మేడే ను ఘనంగా నిర్వహించారు. సీఐటీయూ జెండాను హమాలీ కార్మిక సంఘం అధ్యక్షులు అన్నారం రాజేశం, సీపీఐ(ఎం) జెండా ను కార్మిక సంఘం సీనియర్ నాయకులు మల్లారపు దేవయ్య ఎగరావేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు టీ. స్కైలాబ్ బాబు హాజరై ఏర్పాటు చేసిన సభలో టీ. స్కైలబ్ బాబు మాట్లాడుతూ 1886 మే 1న అమెరికా చికాగో నగరంలో కార్మికుల రక్తంతో తడిసి ఎత్తిపట్టిన ఎర్రజెండా ప్రపంచ శ్రామిక వర్గ విముక్తి బావుటగా నిలిచిందని నాటి స్ఫూర్తితో మతోన్మాద కార్పోరేట్ శక్తులను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని కంటికి రెప్పలా ఎర్రజెండాను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కష్టజీవులందరికీ మేడే పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నేటి 8 పనిగంటల విధానం రావడానికి కార్మికులు తమ రక్తంతో తడిసిన జెండాను ఎత్తి పట్టడమే మూల కారణమన్నారు. ప్రపంచ కార్మిక వర్గమే తమ విముక్తికి ఎర్రజెండా మార్గమని గుర్తించారన్నారు. కష్టజీవులే సృష్టించుకున్న జెండా ఎర్రజెండా అని కొనియాడారు. నాటి నుంచి నేటి వరకు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్ర బిజేపి ప్రభుత్వం సర్కార్ రద్దు చేసిందన్నారు.నాలుగు లేబర్ కోడ్ లు తెచ్చి కార్మికుల శ్రమను కార్పొరేట్లకు దోచి పెట్టిందన్నారు. దీంతో కార్మికుల పొట్టలు కొడుతుందని విమర్శించారు. పవర్లూమ్ పరిశ్రమ పైన జిఎస్టి వేయొద్దంటూ కార్మిక వర్గం మొరపెట్టుకున్న బీజేపీ సర్కార్ కక్ష సాధింపుతో కార్మిక వర్గంపై జీఎస్టీ పెనుబారం మోపిందన్నారు. పవర్లూమ్ కార్మికుల ఆత్మహత్యలకు కేంద్ర బిజెపి సర్కార్ విధానాలే కారణమైందన్నారు.
కార్మిక వర్గం కుల మతాలకతీతంగా ఐక్యంగా ఉద్యమించడం ద్వారా తమ హక్కులు సాధించుకోవాలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్న మతోన్మాద బీజేపీని ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. బీజేపీ విధానాలు నియంతృత్వం వైపు అడుగులేస్తున్నాయని మూడోసారి అధికారంలోకి వస్తే కార్మిక జీవితాలు మరింత దుర్భరం కానున్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగం రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేసే ప్రమాదం ఉందని చెప్పారు. ఎన్నటికైనా ఎర్రజెండానే కార్మికుల విముక్తి బావుటా అని చెప్పారు. ఎర్రజెండాను కంటికి రెప్పలా ఇంటి ఆడబిడ్డలా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. వీర్నపల్లి మండల వ్యాప్తంగా ఎర్రజెండా అనేక పోరాటాలు నిర్వహించిందని అన్నారు. ఈ ప్రాంతంలో పోడు రైతులు సాగు చేసుకున్న పోడు భూముల పోరాటంలో ఎర్రజెండాదే కీలకపాత్ర, అక్రమ కేసులు బనాయించిన ఎదురించి పోరాడిన ఘనత ఎర్రజెండా నాయకత్వానికి దక్కుతుందన్నారు. మండలంలో అనేక పోరాటాలు కొనసాగిస్తూ కార్మికుల పక్షాన ఎర్రజెండా నిలబడ్డదని గుర్తు చేశారు. హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, గ్రామపంచాయతీ కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించాలని, మరణించిన కార్మిక కుటుంబాలకు కార్మిక భీమా పథకం అమలు చేసి పది లక్షల రూపాయలు కార్మిక కుటుంబాలకు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పిటిసి కళావతి, ఎంపీపీ భూల, సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మల్లారపు అరుణ్ కుమార్, బంజార సంఘం జిల్లా అధ్యక్షులు సురేష్ నాయక్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లరపు ప్రశాంత్, జిల్లా నాయకులు మనోజ్ , ఐద్వా జిల్లా కార్యదర్శి విమల ,రైతు సంఘం జిల్లా కార్యదర్శి జంగం అంజయ్య, బిఆర్ఎస్ మండల మహిళ అధ్యక్షురాలు గుగులోత్ కళ, సీఐటీయూ జిల్లా నాయకులు నరేందర్, నర్సయ్య, రాజు,గ్రామ పంచాయితీ కార్మిక సంఘం, హమాలీ కార్మిక సంఘం, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.