నాకు అత్యంత బాధేసిన ఘటన ఏదైనా ఉందంటే మణిపూర్‌లో కొంత మంది స్త్రీలను వివస్త్రలను చేసి ఊరేగించడం. లైంగికదాడి చేసి హత్యలు చేయడం. దేశంలోని తాజా పరిణామాలను చూస్తుంటే ఆనాడు నాజీలు చేసిన దుర్మార్గాల్లాగే ఉన్నాయి. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో బైరాన్‌పల్లిలో రజాకార్లు స్త్రీలను బట్టలు విప్పించి బతుకమ్మ ఆడించిన ఘటనను గుర్తుచేశాయి. నేడు ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల దుశ్చర్యలను మణిపూర్‌లాంటి దారుణాలు తలదన్నుతున్నాయి. బాధిత మహిళను కాపాడేండుకు అడ్డువచ్చిన వారి సోదరుడిని, తండ్రిని చంపడం, గ్యాంగ్‌రేప్ చేయడం, భారతీయ ఏ సంస్కృతి, సాంప్రదాయాలు అనిపించుకుంటాయి? అలా చేసిన నింది తులకు నాయకులైన బీజేపీ- ఆర్‌ఎస్‌ఎస్‌కు ఈ చర్య అత్యంత పాశవికమైన చర్యగా, భారతీయ సంస్కృతికి మాయని మచ్చగా అనిపించడం లేదా? ఇతర మతాల వారి మీద దాడులు చేయడం, చంపడం వారి స్త్రీలను మానభంగం చేయడం, వారి ఆస్తులను తగలబెట్టడం, హిందూ ధర్మం మూల సూత్రాలకు వేద విజ్ఞానానికి ఉపనిషత్తుల సారానికి పూర్తి వ్యతిరేకం. సనతన ధర్మమని చెప్పే వారికి అందరిలో ఆత్మ ఒక్కటేననే ప్రాథమిక విషయం పట్ల అవగాహన అవసరం. మతాలన్నీ మంచిని బోధిస్తాయి మానవత్వాన్ని చాటుతాయి. సాధనా పద్ధతులు చూపుతాయి. కానీ వాటిని రాజకీయాలకు వాడుకోవడం, ప్రజల్ని బలిపశువుల్ని చేయడం అత్యంత శోచనీయం.
ఏ మతం వారికి ఆ మతాన్ని అవలించే స్వేచ్ఛను మన రాజ్యాంగం అందించింది. భిన్నమైన కులాలు, మతాచారాలు ఉన్న విషయాన్ని మన రాజ్యాంగ నిర్మాతలు నాడే గుర్తించి అందరికీ సమాన అవకాశాలిచ్చారు. కుల, మత, జాతి, ప్రాంతీయ భేదం లేకుండా అందరికీ సమన్యాయం దొరికే హక్కులు కల్పించారు. నేరస్తులు ఏ కులం వారైనా, ఏ మతం వారైనా ఒకే రకమైన శిక్షకు అర్హులు. కానీ బీజేపీ ప్రభుత్వం వీటన్నింటినీ మార్చే ప్రయత్నమే చేస్తోంది. వాటి స్థానంలో మనువాదం తెచ్చే పనిలో నిమగమైంది. వారికి రాజ్యాంగం అవసరం లేదు. ప్రజాస్వామ్యంపై పట్టింపు లేదు. ఉన్నదంతా ఒక్కటే దేశాన్ని హిందూత్వగా మార్చడం! వీటిని అమలు చేసే పనిలో ఉంటే మణిపూర్‌లాంటి ఘటనలు వారికేం కనిపిస్తాయి? పైగా నేరస్తులకు, నిందితులకు అండగా ఉండేందుకే వారు ఎన్నికల్లో గెలిచినట్టుగా ఉన్నారు! బీజేపీ ఈతొమ్మిదేండ్ల కాలంలో చాలా బాధాకరమైన ఘటనల్ని చూశాం. బిల్కిస్‌బానో కేసులో నిందితులకు శిక్షకాలం పూర్తి కాకుండానే వదిలివేసింది. బాధితురాలు గర్భిణిీగా ఉన్న ఒక అబలను రేప్ చేసిన నిందితులు జైలునుండి బయటకు వచ్చాక హిందూమత చాందసులు వారికి సన్మానం చేశారు. అటువంటి వారికి సన్మానం చేశారంటే దేశానికి ఏం సందేశం ఇచ్చినట్టు? దీన్ని మనమెలా అర్థం చేసుకోవాలి.
ఢిల్లీలో మహిళా రెజ్లర్లు ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడైన బ్రిజ్‌భూషణ్ రెజ్లర్ల పట్ల లైంగికదాడులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేస్తే ఆ కేసు నమోదు చేయలేదు. వారి కన్నీళ్లను పట్టించుకున్న నాథుడు లేడు. పార్లమెంట్ ఎదుటే రోదించినా వారిది అరణ్యరోదనే అయింది. బ్రిజ్‌భూషణ్ బీజేపీ నాయకుడైనంత మాత్రాన, పార్లమెంట్ సభ్యునిగా ఉన్నా అతడు చేసిన నేరాలపై వెంటనే కేసు రిజిస్టర్ చేయకపోవడం బీజేపీ నాయకత్వానికి మహిళల పట్ల ఉన్న వైఖరిని తెలియజేస్తున్నది. నేరస్తులు, పాలకులు ఒక్కటైతే సమాజం ఎలా పురోగమిస్తుంది? ఉగ్రవాదులు, మతోన్మాదులు ఏ మతం వారైనా, ఏ కులానికి చెందినా నేరస్తులే. ఏ మతం, ఏ కులం వారు అత్యాచారాలు, హత్యలు చేసినా పౌరులందరూ ఖండించాల్సిందే. హిందూముస్లింలు ఐక్యంగా ఉండాలని మతసామరస్యాన్ని బోధించినందుకే ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో ప్రభావితుడైన గాడ్సే మహాత్మాగాంధీని కాల్చిచంపాడు. అందుకే మతోన్మాదనేది అత్యంత ప్రమాదకరం, అభివద్ధికి ఆటంకం. ఇటీవల చూసినట్లయితే హిందూమతం నుంచి కొందరు మరోమతంలోకి మారుతున్నారంటే కారణమేంటని ఆలోచించాలి. హిందూమతంలోని కొందరు పాటిస్తున్న ఈ కుల వివక్షత కారణం కాదా! దళితులను కొందరు మందిరాల్లోకి అనుమతించడం లేదు. దేవాలయాల్లోని సహాపంక్తి భోజనాల్లో కూర్చొనివ్వడం లేదు. అలా సాటి మనుషులను మనుషులుగా చూడనప్పుడు మరోచోట వారికి సమానత్వం కనబడినప్పుడు వారు మరోమతాన్ని ఎంచుకుంటారు.
భారతదేశం అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు అవసరం. కులమత ఘర్షణల వల్ల భారత ప్రతిష్ట దెబ్బతింటుంది. ప్రజాస్వామ్య లౌకికవాదదేశమని మనం చెప్పుకోలేం. మత ద్వేషాలను పెంచి పోషిస్తే తాత్కాలికంగా ఎన్నికల్లో మెజారిటీ మతస్తుల ఓట్లు వేయించుకొని లాభపడవచ్చు కానీ మతోన్మాదం, మత విద్వేషాల వలన శాశ్వతంగా ఎదుటివారి మనోభావాలు దెబ్బతింటాయి. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఈనాడు కలిసిమెలిసి ఉన్నట్లు రేపటి రోజు ఐక్యంగా ఉండటం, పనిచేయడం కష్టమవుతుంది. ఒకరి మీద ఒకరికి విశ్వాసం సన్నగిల్లుతుంది. కులమత విభేదాలు, ప్రాంతీయ అసమానతలు మనదేశాన్ని బలహీనపరుస్తాయి. భవిష్యత్తులో ప్రాణాలు అరచేతిలో పెట్టు కొని బయటకు వెళ్లే పరిస్థితి రావచ్చు. నేడు మణిపూర్‌లో ఉన్న పరిస్థితి దేశమంతటా రావచ్చు. అందుచే విశాల దృక్పథంతో ఆలోచించాలి. విశాలమైన భావాలను వ్యాపింప చేయాలి. మతసామరస్యాన్ని బోధిóంచాలి.విభేదాలను పోగొట్టాలి.
జస్టిస్ బి. చంద్రకుమార్ 8978385151