– ఇండియా ఫోరం నేతల వర్చువల్ భేటీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రతిపక్షాల ‘ఇండియా’ ఫోరం చైర్మెన్‌గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఎంపికైనట్లు తెలిసింది. ఈ మేరకు శనివారం వర్చువల్‌గా జరిగిన ‘ఇండియా’ ఫోరం సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కెసి వేణుగోపాల్ (కాంగ్రెస్), ఎంకె స్టాలిన్, కనిమొళి (డీఎంకే), సీతారాం ఏచూరి (సీపీఐ(ఎం), నితీశ్ కుమార్, లలన్ సింగ్ (జేడీయూ), అరవింద్ కేజ్రీవాల్, రాఘవ్ చడ్డా (ఆప్), లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ (ఆర్జేడీ), శరద్ పవార్ (ఎన్సీపీ), డి. రాజా (సీపీఐ), ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్) తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీలో పలు అంశాలపై కూటమి నేతలు చర్చించారు. ప్రధానంగా త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపిణీ, బీజేపీని ఓడించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. సమగ్ర చర్చల అనంతరం మల్లికార్జున్ ఖర్గేను ఇండియా ఫోరం చైర్‌పర్సన్‌గా ఎంపిక చేసినట్టు జాతీయ మీడియా పేర్కొంది. అయితే, ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇండియా ఫోరానికి నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే శనివారం జరిగిన భేటీలో నితీశ్ ఆ పదవిని చేపట్టేందుకు ఆసక్తి చూపలేదు. నితీష్ కుమార్ కన్వీనర్‌గా ఉండాలని సమావేశం డిమాండ్ చేసినప్పటికీ, ఆ పదవిని చేపట్టేందుకు ఆసక్తి లేదని ఆయన తన వైఖరికి కట్టుబడి ఉన్నారు. దీంతో ప్రతిపక్ష పార్టీల వేదికకు నాయకత్వం వహించేందుకు ఖర్గేనే నియమించాలని సమావేశం నిర్ణయించింది. అయితే లోక్‌సభ ఎన్నికల చర్చలు చురుగ్గా సాగుతున్న వేళ ‘ఇండియా’ గ్రూపు నేతలు శనివారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, శివసేన నేత ఉద్దవ్ ఠాక్రే హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో మల్లికార్జున్ ఖర్గే స్పందిస్తూ.. వారి అభిప్రాయం తెలుసుకున్న తర్వాతే నాయకత్వ బాధ్యతలపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కన్వీనర్‌గా ఎవరు ఉండాలనే దానిపై తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. చైర్మెన్ తరువాత ప్రతిపక్ష ఫోరానికి కన్వీనర్ పదవి కీలకం. సమావేశానంతరం మల్లికార్జున్ ఖర్గే సోషల్ మీడియా ‘ఎక్స్’లో స్పం దిస్తూ ”సీట్ల పంపకాల చర్చలు సానుకూలంగా సాగడంపై అందరూ సంతో షం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా ఫోరం నేతలు శనివారం సమావేశమై పొత్తుపై చర్చలు జరిపారు. సీట్ల పంపకాల చర్చలు సంతృప్తికరంగా సాగుతున్నాయని అన్ని పార్టీలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇండియా ఫోరం పార్టీలు సంయుక్తంగా నిర్వహించే కార్యక్రమాల గురించి కూడా చర్చలు జరిగాయి. రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ‘భారత్ జోడో న్యారు యాత్ర’లో అన్ని ఇండియా ఫోరం పార్టీలను వారి సౌలభ్యం మేరకు పాల్గొనాలని కోరాను. దేశంలోని సామాన్య ప్రజలను పీడిస్తున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యలను లేవనెత్తడానికి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆహ్వానించాను” అని మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు.