మిగిలింది హైదరాబాదే..

Hyderabad is left..– మిగతా ఎంపీ సీట్లకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన
– సికింద్రాబాద్‌కు పద్మారావు గౌడ్‌
– నల్లగొండ కంచర్ల కృష్ణారెడ్డి
– భువనగిరికి క్యామ మల్లేశ్‌
– ఖరారు చేసిన అధినేత కేసీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ ఒక్క హైదరాబాద్‌ స్థానం మినహా మిగతా 16 సీట్లకు తన అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా మరో మూడు స్థానాలకు ఆ పార్టీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. సికింద్రాబాద్‌ స్థానానికి మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్‌ను, నల్లగొండకు సీనియర్‌ నేత కంచర్ల కృష్ణారెడ్డిని, భువనగిరికి బీసీ సామాజిక వర్గానికి చెందిన క్యామ మల్లేశ్‌ పేర్లను బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. శనివారం సాయంత్రం తొలుత పద్మారావును, ఆ తర్వాత కొద్ది సేపటికి కృష్ణారెడ్డి, మల్లేశ్‌ పేర్లను ఆయన అధికారికంగా ప్రకటించారు. దీంతో హైదరాబాద్‌ స్థానం మినహా మిగతా అన్ని ఎంపీ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్టయింది.
సికింద్రాబాద్‌ అభ్యర్థి ఖరారు విషయంలో కొంత హైడ్రామా చోటు చేసుకుంది. తొలుత ఈ సీటు నుంచి మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్‌ కుమారుడు సాయి కిరణ్‌ను బరిలోకి దింపాలని కేసీఆర్‌ భావించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా అక్కడి నుంచే పోటీ చేసిన సాయి కిరణ్‌… కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఆయనే మరోసారి పోటీ చేస్తారని అందరూ భావించారు. కానీ మారిన రాజకీయ పరిస్థితులు, బీఆర్‌ఎస్‌ ప్రతిపక్షానికే పరిమితం కావటం, సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌, బీజేపీ పోటాపోటీగా ఉండటంతో తలసాని తన తనయుడిని రంగంలోకి దింపేందుకు జంకినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని ఆయన కేసీఆర్‌కు వివరించినట్టు సమాచారం. ఇప్పటికే ఒకసారి ఓడిపోయాం, మరోసారి ఓడిపోతే తన కొడుకు రాజకీయ భవితవ్యం ప్రమాదంలో పడుతుందని భావించిన తలసాని, సాయి కిరణ్‌ పోటీలో ఉండబోడంటూ కేసీఆర్‌కు విన్నవించారు. ఈ క్రమంలో మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న దానం నాగేందర్‌కు ధీటుగా… గౌడ సామాజిక వర్గానికి చెందిన పద్మారావును రంగంలోకి దింపాలని గులాబీ బాస్‌ భావించారు. ఆ మేరకు ఆయనతో చర్చలు, సంప్రదింపులు జరిపారు. కానీ ఎంపీగా పోటీ చేయటానికి పద్మారావు నిరాకరించారు. దీంతో ఆయన్ను ఒప్పించే బాధ్యతను ఢిల్లీలో ఉన్న (కవిత కేసుకు సంబంధించి వెళ్లారు) కేటీఆర్‌, హరీశ్‌రావుకు కేసీఆర్‌ అప్పగించారు. దీంతో పద్మారావును హస్తినకు పిలిపించిన వారు ఆయనకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా మెత్తబడకపోవటంతో తిరిగి కేసీఆరే స్వయంగా పద్మారావుకు ఫోన్‌ చేసి, పిలిపించుకుని బుజ్జగించారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎంపీగా పోటీ చేసేందుకు ఆయన ఒప్పుకున్నారు. మరోవైపు భువనగిరి విషయంలో కూడా చివరిదాకా ఉత్కంఠ కొనసాగింది. మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మెన్‌ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ తదితరులు కూడా ఆ సీటును ఆశించినా, చివరకు కురుమ సామాజిక వర్గానికి చెందిన క్యామ మల్లేశ్‌కు ఆ సీటు దక్కటం గమనార్హం.
16 ఎంపీ స్థానాలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు…
1) మహబూబాబాద్‌ – మాలోత్‌ కవిత
2) వరంగల్‌ – డాక్టర్‌ కడియం కావ్య
3) ఖమ్మం – నామా నాగేశ్వరరావు
4) నల్లగొండ -కంచర్ల కృష్ణారెడ్డి
5) భువనగిరి -క్యామ మల్లేశ్‌
6) మహబూబ్‌నగర్‌ – మన్నె శ్రీనివాసరెడ్డి
7) నాగర్‌ కర్నూల్‌ -ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌
8) చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్‌
9) సికింద్రాబాద్‌-తీగుళ్ల పద్మారావు గౌడ్‌
10) మల్కాజిగిరి – రాగిడి లక్ష్మారెడ్డి
11) మెదక్‌ -పి.వెంకటరామిరెడ్డి
12) నిజామాబాద్‌ – బాజిరెడ్డి గోవర్దన్‌
13) జహీరాబాద్‌ – గాలి అనిల్‌ కుమార్‌
14) కరీంనగర్‌ -బోయినపల్లి వినోద్‌కుమార్‌
15) పెద్దపల్లి -కొప్పుల ఈశ్వర్‌
16) ఆదిలాబాద్‌ – ఆత్రం సక్కు