– రాజకీయ సాధనంగా వాడుకోవటం తగదు
– తొమ్మిదేండ్లు అధికారంలో ఉండి..చివరిదశలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టారు..
– మోడీ ప్రభుత్వ వైఫల్యాలనుంచి ప్రజల దృష్టి మళ్లించటానికే : బృందాకరత్ ఆగ్రహం
న్యూఢిల్లీ : దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లును సజీవంగా ఉంచిన మహిళా లోకానికి సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కరత్ కృతజ్ఞతలు తెలిపారు. రిజర్వేషన్ బిల్లు కోసం మూడు దశాబ్దాలుగా పోరాడుతున్నామని, అయితే ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి దీనిని ఒక సాధనంగా వాడుకోవడం దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు చివరి దశకు చేరిన వేళ ఈ బిల్లును హడావిడిగా ఆమోదించారని, ఇది 18వ లోక్‌సభ కూర్పుపై ఎలాంటి ప్రభావం చూపబోదని తెలిపారు. మహిళా బిల్లును జనగణన, నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడంతోనే ప్రభుత్వ ఆంతర్యం అర్థమైపోయిందని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై 2014 ఎన్నికల సమయంలోనే బీజేపీ హామీ ఇచ్చిందని బృందా కరత్ గుర్తు చేశారు. 2014లోనూ, ఆ తర్వాత 2019లోనూ అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ హామీని బీజేపీ పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్నికల హామీలను నెరవేర్చలేదన్న విమర్శల నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వం హడావిడిగా ఈ బిల్లును ప్రవేశపెట్టిందని తెలిపారు. బిల్లు లక్ష్యాలు, కారణాలపై ప్రభుత్వం పక్షపాతపూరితమైన ప్రకటన చేయడం అభ్యంతరకరమని చెప్పారు. ఈ ప్రకటన బీజేపీ ఎన్నికల ప్రణాళికను చదివినట్టు ఉన్నదని ఎద్దేవా చేశారు. గ్యాస్ సిలిండర్ల నుంచి మరుగుడొడ్ల వరకూ మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఏకరువు పెట్టారని బృందా కరత్ అన్నారు.