ఫలితాలు నిరాశపర్చాయి

ఫలితాలు నిరాశపర్చాయి– ఫినిక్స్‌ మాదిరి పుంజుకుంటాం : కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
లోక్‌సభ ఎన్నికలఫలితాలు తమ పార్టీనీ తీవ్రంగా నిరాశపరిచాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్‌ చేశారు. మళ్లీ త్వరలోనే బీఆర్‌ఎస్‌ పుంజుకుంటుదని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీని స్థాపించిన 24 ఏండ్ల సుదీర్ఘప్రస్థానంలో ఎన్నో రకాల ఎత్తుపల్లాలను చూశామని గుర్తు చేశారు. అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొన్న అనుభవం తమ పార్టీకి ఉందన్నారు. బీఆర్‌ఎస్‌గా తమకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటానికి మించిన గౌరవం, విజయం మరేది లేదని తెలిపారు. గతంలోనూ ఇలాంటి ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ ప్రజాదరణతో బీఆర్‌ఎస్‌ పుంజుకున్న సందర్భాలెన్నో ఉన్నాయని వివరించారు. తెలంగాణను సాధించటంతో పాటు ఒక ప్రాంతీయ పార్టీగా రెండుసార్లు అద్భుతమైన మెజార్టీతో 2014లో 63 సీట్లు, 2018 లో 88 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుత శాసనసభలోనూ మూడో వంతు సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్‌ కొనసాగుతోందని గుర్తు చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతోనే ఓటమి పాలయ్యామని వాపోయారు. ఫలితాలు నిరాశ కలిగించినప్పటికీ లోక్‌ సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు ఎంతో శ్రమించారనీ, వారందరికీ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితుల్లో కుంగిపోయేది లేదనీ, ఎప్పటి లాగే ప్రజాసమస్యలపై పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై తెలంగాణ ప్రయోజనాల కోసం అటు కేంద్రంపైనా పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని తెలిపారు.