యూనివర్సిటీ ప్రొఫెసర్ల పదవీవిరమణ వయసు పెంచాలి..

The retirement age of university professors should be increased.– యూనివర్సిటీలలో బోధనతోపాటు పరిశోధనలో వెనుకబాటే..
– డాక్టర్. ఏ పున్నయ్య  అధ్యక్షులు తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టూ టా )..
నవతెలంగాణ – డిచ్ పల్లి
రాష్ట్రంలోని యూనివర్సిటీ ల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 60 నుంచి 65 సంవత్సరాలకు పెంచాలని తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్  అధ్యక్షులు  డాక్టర్ ఏ పున్నయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ మేరకు తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టీ.యాదగిరి రావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి ల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏ పున్నయ్య మాట్లాడుతూ నేడు తెలంగాణ రాష్ట్రంలోని  ఉన్నత విద్యాశాఖ పరిధిలో 12 వర్సిటీలున్నాయని  వాటిలో 2,817మంది ప్రొఫెసర్ల మంజూరు పోస్టులకు గాను కేవలం 757 మంది  మాత్రమే పనిచేయడంతో, యూనివర్సిటీ లలో బోధనతోపాటు  పరిశోధనలో  వెనుకబడినాయన్నారు.నేటి వరకు వివిధ యూనివర్సిటీ లో 2,060 ప్రొఫెసర్  పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. అంటే 75 శాతం ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ,ఇక ప్రతినెలా ఉస్మానియా, జేఎన్‌టీయూహెచ్, కాకతీయ,  తెలంగాణ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ లో ఇద్దరు ముగ్గురి చొప్పున పదవీ విరమణ పొందుతున్నారని, ఫలితంగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీ లో న్యాక్ గ్రేడ్  అర్హత కోల్పోనున్నాయన్నారు.
న్యాక్ గ్రేడ్ అర్హత కోల్పోవడంతో యూనివర్సిటీలకు  యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిధులు కూడా  అందక యూనివర్సిటీ లన్ని నిర్వీర్యం అవుతాయన్నారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందనంత దూరం అవుతుందని పేర్కొన్నారు.గత ప్రభుత్వం  పంపిన కామన్‌ యూనివర్సిటీ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లును వెనక్కితీసుకొని,  ఈ ప్రభుత్వం కొత్త కమిషన్‌ ఏర్పాటుకు మరింత సమయం పడుతుందని, కావున అనివార్యంగా ప్రొఫెసర్ లో పదవి విరమణ వయస్సు  పెంచనట్లయితే భవిష్యత్తులో యూనివర్సిటీ ల్లో అన్ని ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండే పరిస్థితి సమీపిస్తుందన్నారు.గత ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61కి పెంచారని,దాంతో వర్సిటీల్లోని బోధనేతర ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు ఆమేరకు పెరిగిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం యూనివర్సిటీ లపట్ల  అనుసరించిన  వివక్ష కారణంగా యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు అరవై ఏళ్లకే ఉద్యోగ విరమణ పొందుతున్నారని కేంద్రీయ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు పదవీ విరమణ  వయస్సు తో సమానంగా రాష్ట్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ల వయస్సు పెంచాలని డిమాండ్ చేశారు.మరోవైపు  వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ల వయస్సును గత ప్రభుత్వమే 65 కి పెంచిందని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోనూ ప్రొఫెసర్ల వయస్సు 65కు పెంచారని, మన పక్క రాష్ట్రమైన  ఆంధ్రప్రదేశ్‌లోనూ 65కు చేసినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో  మాత్రం 60 సంవత్సరాలే ఉండటంతో వర్సిటీలు కునారిల్లుతున్నాయన్నారు.ఈ నేపథ్యంలో  తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ తక్షణమే ప్రొఫెసర్ల పదవీ విరమణ  వయస్సు ను 65 సంవత్సరాల వరకు పెంచాలని  తెలంగాణ  యూనివర్సిటీ  టీచర్స్ అసోసియేషన్  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని ఏ పున్నయ్య పేర్కొన్నారు.ఈ   కార్యక్రమంలో ఉపాధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ రెడ్డి,  కోశాధికారి డాక్టర్ అడికే నాగరాజ్ , డాక్టర్ వాసం చంద్రశేఖర్, ప్రొఫెసర్ అరుణ, ప్రొఫెసర్ అపర్ణ, ప్రొఫెసర్ సిహెచ్ ఆరతి, డాక్టర్ బాలకిషన్, డాక్టర్ అబ్దుల్ ఖావి,డాక్టర్  కిరణ్మయి, డాక్టర్ ప్రవీణ్ మామిడాల,డాక్టర్ ప్రసన్న శీలా, డాక్టర్ నీలిమ, డాక్టర్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.