ఛత్తీస్‌గఢ్‌లో సంపన్న ఎమ్మెల్యేలు 72 మంది కోటీశ్వరులే

ఛత్తీస్‌గఢ్‌లో సంపన్న ఎమ్మెల్యేలు 72 మంది కోటీశ్వరులే– బీజేపీ నుంచి అత్యధికంగా 43 మంది
– కాంగ్రెస్‌ నుంచి 29 మంది
– ఏడీఆర్‌-ఛత్తీస్‌గఢ్‌ ఎలక్షన్‌ వాచ్‌ నివేదిక
రారుపూర్‌ : ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర అసెంబ్లీ కోటీశ్వరులైన సభ్యులతో కొలువుదీర నున్నది. అసెంబ్లీకి ఎన్నికైన 90 మంది ఎమ్మెల్యేల్లో 72 మంది (80 శాతం మంది) కోటీశ్వరులే ఉన్నారు. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌), ఛత్తీస్‌గఢ్‌ ఎలక్షన్‌ వాచ్‌ విశ్లేషణలో ఇది వెల్లడైంది. దీని ప్రకారం.. కోటీశ్వరుల జాబితాలో బీజేపీ నుంచే అత్యధికంగా 43 మంది కోటీశ్వరులు ఉండటం గమనార్హం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోటీశ్వరుల సంఖ్య 68గా ఉండగా.. అది 72కు పెరిగింది. ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గానూ 54 నియోజకవర్గాల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమవుతున్న విషయం విదితమే. ఈ 54 మందిలో 43 మంది(80 శాతం మంది) ఒక్కొక్కరు రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆస్తులను కలిగి ఉన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 35 మంది ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్షంగా ఏర్పడిన కాంగ్రెస్‌లో 29 మంది (83 శాతం మంది) కోటీశ్వరులు కావటం గమనార్హం.
సగటు ఆస్తులు రూ.5.25 కోట్లు
2018 అసెంబ్లీ ఎన్నికలలో ప్రతి ఎమ్మెల్యే ఆస్తుల సగటు రూ.11.63 కోట్లుగా ఉంటే అది ఈసారి రూ.5.25 కోట్లుగా ఉన్నది. రూ.33.86 కోట్ల ఆస్తులతో కోటీశ్వరుల క్లబ్‌లో బీజేపీకి ఎమ్మెల్యే (ఈయన మొదటిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు) భవన్‌ బోహ్రా (పండరియా స్థానం) అగ్రస్థానంలో ఉన్నారు. రూ.33.38 కోట్ల ఆస్తులతో తాజా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు భూపేష్‌ బఘెల్‌ (పటాన్‌ నియోజకవర్గం) తర్వాతి స్థానంలో ఉన్నారు. బీజేపీకి చెందిన అమర్‌ అగర్వాల్‌ (బిలాస్‌పూర్‌ స్థానం) రూ.27 కోట్లకు పైగా ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు. చంద్రాపూర్‌ కు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రామ్‌కుమార్‌ యాదవ్‌(రూ.10 లక్షలు), బీజేపీ ఎమ్మెల్యేలు రామ్‌కుమార్‌ టోప్పో (రూ.13.12 లక్షలు), అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రస్తుత ఎంపీ గోమతి సాయి (రూ.15.47 లక్షలు)లు అత్యల్ప ఆస్తులున్న ఎమ్మెల్యేల జాబితాలో అట్టడుగున ఉన్నారు.
విద్యార్హతలు ఇలా..
90 మంది ఎమ్మెల్యేలలో 33 మంది (37 శాతం) 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉత్తీర్ణులైనట్టు ప్రకటించారని నివేదిక పేర్కొన్నది. అలాగే, 54 మంది ఎమ్మెల్యేలలో గరిష్టంగా 60 శాతం మంది గ్రాడ్యుయేట్‌ డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ అర్హతలు కలిగి ఉన్నారు. మరో ఇద్దరు డిప్లొమాలు కలిగి ఉండగా, ఒక ఎమ్మెల్యే తనను తాను కేవలం ”అక్షరాస్యుడు” అని ప్రకటించుకున్నారు.
గెలుపొందిన ఎమ్మెల్యేల్లో 44 మంది (49 శాతం) తమ వయస్సు 25- 50 సంవత్సరాల మధ్య ఉన్నదని ప్రకటించుకోగా.. 46 మంది (51 శాతం) 51-80 సంవత్సరాల మధ్య ఉన్నట్టు వివరించారు. అహివారా (ఎస్సీ) స్థానం నుంచి ఎన్నికైన బీజేపీకి చెందిన దోమన్‌లాల్‌ కోర్సేవాడ (75) కొత్తగా ఎన్నికైన అసెంబ్లీలో అధిక వయసున్న ఎమ్మెల్యేగా కాగా.. కాంగ్రెస్‌కు చెందిన బిలాయిగఢ్‌ (ఎస్సీ) శాసనసభ్యురాలు కవితా ప్రాణ్‌ లహ్రే (30) అందరికంటే పిన్న వయస్కులు కావటం గమనార్హం.