ఇన్సూరెన్స్ ఉద్యోగులుగా, ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయూస్ అసోసియేషన్ (ఎ.ఐ.ఐ.ఇ.ఎ ) కార్యకర్తలుగా ఎల్.ఐ.సిలో, సాధారణా బీమా సంస్థల్లో ఉద్యమాలు జరుగుతున్నప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇచ్చే నినాదాల్లో ఎ.ఐ.ఐ.ఇ.ఎ రైట్ పాత్ అంటే రైట్ పాత్ రైట్ పాత్ అంటూ నినదిస్తాము. నిజమే రైట్ పాత్ అంటే సరైన మార్గంలో మా యూనియన్ వెళ్తోందని అర్థం. సరైన మార్గంలో పోతూ మళ్లీ అదే అరుస్తారెందుకు? అని బయటివాళ్లకు ఎవరికైనా అనుమానం రావచ్చు. ఇంతకీ ఈ సరైన మార్గమంటే ఏమిటి? సరైన మార్గం ఎందుకు సరైనది? అంటే ఇంకో మార్గమేదో సరైనది కాదు అన్న అర్థాలు ఈ రైట్ పాత్ రైట్ పాత్‌లో ఉన్నాయన్న విషయం మరువరాదు. ఆ అపసవ్య మార్గాలు ప్రభుత్వాలవి కావచ్చు, మేనేజిమెంటువి కావచ్చు, లేదా ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ సంస్థల వద్ద అప్పులు తీసుకొని అవి చెప్పినట్టు తోలుబొమ్మల్లా ఆడేవారి మార్గం సరైనదిగా ఉండకపోవచ్చు. అంటే అది రాంగ్ పాత్ అన్న మాట. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.
ఒక మార్గం సరైనదో కాదో అన్నది ఎవరు తేల్చాలి, ఎందుకు తేల్చాలి అన్న ప్రశ్నలు ముఖ్యం. ప్రజలకు మేలు చేసేవైతే మంచివి అని ఒక వర్గం, కాదు కాదు పెద్దోళ్లకు మేలు చేసేవే మంచి మార్గాలని అవే మా రైట్ పాత్‌లని ఒక వర్గం చెప్పొచ్చు. అంతెందుకు ఎం.బి.యే పాఠాల్లో చేప్పే విషయం ఒకటుంది అదేమంటే ప్రభుత్వం వ్యాపారం చేసేవాళ్లకు అన్ని సౌకర్యాలు అందజేయాలి, అప్పుడు వాళ్లు బాగా లాభాలు సంపాదిస్తారు కాబట్టి ఆ తరువాత ఆ లాభాల్లో కొంత ప్రజలకు, సామాజిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారని చెబుతారు. నిజ జీవితంలో ఆ విధానం మనకు కనిపిస్తుందా? లాభాలు గడించినోళ్లు ఇంకా ఇంకా లాభాలకోసం పడగలెత్తుతున్నారు కాని ప్రజలకేం చేస్తున్నారు అన్న విషయంలో ఇంకా వెనుకే ఉన్నారు.
అదే విధానం ప్రభుత్వ రంగ సంస్థల విషయం తీసుకొని పరిశీలిద్దాం. ఈ సంస్థలు కూడా ప్రజలకు సేవ చేసుకుంటూ వ్యాపారం చేస్తున్నాయి కదా, మరి వీరికి కావలసినవన్నీ ప్రభుత్వాలు అందిస్తున్నాయా అంటే ఊహూ అన్న సమాధానమొస్తుంది. అటు లాభాలు గడిస్తున్న ప్రయివేటు సంస్థలు పన్నులు ఎగ్గొడుతుంటే, ప్రభుత్వ సంస్థలు మాత్రం తమ లాభాలపై డివిడెండును ఠంఛన్‌గా ప్రభుత్వానికి చెల్లిస్తున్నాయి. అంతేకాదు రాష్ట్రాల విద్యుత్ సంస్థలకు, మునిసిపాలిటీలకు సహాయం చేయడమే కాదు ప్రభుత్వాల చేతకానితనం వల్ల మూతపడిపోతున్న ఇతర ప్రభుత్వ సంస్థల్ని మీదేసుకుని మోస్తున్నాయి కూడా. ఎల్.ఐ.సీ ఇందులో చాలా చాలా ముందుంది. అందుకే అది చేసే పనులను రైట్ పాత్ రైట్ పాత్ అంటున్నాము, దాని వెనుకనున్న సంఘాన్ని కూడా రైట్ పాత్ రైట్ పాత్ అంటున్నాము.
‘నీ మిత్రులెవరో చెప్పు… నేను నీ గురించి చెబుతా’ అని షేక్స్‌పియర్ అన్నాడు. దేశంలో ఎవరు ఎవరికి మిత్రులో అందరికీ తెలుసు, వాళ్ల ఆస్తుల వివరాలూ తెలుసు. ప్రపంచ కుబేరుల్లో మనవాళ్లు ఎంతమంది, నిరుపేదల్లో మనవాళ్లు ఎంతమంది అన్న విషయంపై గణాంకాలు సేకరిస్తే మొత్తం తేటతెల్లమైపోతుంది. అలాగే ఎల్.ఐ.సిని జి.ఐ.సి. కంపెనీలను నిలబెడుతున్న ఎ.ఐ.ఐ.ఇ.ఎ మిత్రులు సహజంగానే బ్యాంకుల్లోనూ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న యూనియన్లు, సి.ఐ.టి.యు లాంటి వామపక్ష ట్రేడ్ యూనియన్లు, వామపక్ష పార్టీలు. వీళ్లంతా ఎప్పుడూ ప్రజల గురిచి ఆలోచించే వాళ్లే అంటే వాళ్లకు ప్రజలే మిత్రులు. ఇప్పుడు చెప్పండి షేక్స్‌పియర్ చెప్పింది నిజమా కాదా. మిత్రుల సంఖ్య తగ్గుతూ ఉన్నా పోరాటతత్వం మాత్రం తగ్గలేదన్నది వాస్తవం. ఎందుకంటే ‘పోరాడితే పోయేదేమి లేదు..బానిస సంకెళ్లు తప్ప’ అన్న సూత్రానికి కట్టుబడి ఉన్నోళ్లు మరి.
ముందే చెప్పుకున్నట్లు ఊరకే రైట్ పాత్ రైట్ పాత్ అని అరిస్తే సరిపోదని కళాజాతాలతో ప్రజల్ని సమైక్యపర చుకుంటూ ఈనెల పదమూడో తేదీ నుంచి నాలగురోజులు కళా జాతాలు జరిపి పదహారున బెంగళూరు చేరి అక్కడ 19వ తేదీ వరకు సమావేశాలు జరిపి తాము నడుస్తున్న మార్గం సరైనదేనని మరొక్కసారి ధృవపరచుకొని ముందుకు సాగుతారు. కళాజాతాల్లో, తరువాత మహాసభల్లోనూ ప్రజలకోసం ఉన్న ప్రభుత్వరంగ సంస్థల్ని ఎలా కాపాడుకోవాలి, దానికోసం తామేమి చేస్తున్నాము, ప్రజలేమి చేయాలి, నాయకులేమి చేయాలి, ప్రభుత్వాలు ఏమి చేయాలి అన్నవి నిగ్గుతేల్చి నిటారుగా నిలబడతారు. విషయాలను ప్రజల ముందుంచుతారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవా
ళ్లు మరి. అలాగే ప్రజాప్రభుత్వమని చెప్పుకునేవాళ్లు ప్రజలకోసమున్న ఈ సంస్ధల్ని ఎలా రక్షిస్తారు? భక్షించాలని చూసే ప్రయివేటువారికి అప్పజెప్పుతారా అనీ గట్టిగా ప్రశ్నిస్తారు.
ఈ జోనల్ మహాసభల తరువాత అఖిలభారత మహాసభలు. అందులో జీవిత బీమా, సాధారణ బీమా సంస్ధల ఉద్యోగులు పాల్గొంటారు. ఐదురోజులు జరిగే ఈ మహాసభల్లో తమ సంస్ధల బాగోగులే కాక అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ అంశాలేమిటి అక్కడెక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ ధరలు పెరగడమేమిటి? అమెరికా అధ్యక్ష ఎన్నికలకీ మన స్టాక్ మార్కెట్టుకీ సెన్సెక్స్‌కీ లంకె ఏమిటి? ప్రపంచీకరణ యుగంలో మనం ఎలా మారాలి, ఎందుకు మారాలీ? అన్న విషయాలన్నీ చర్చించి ఈ మూడేళ్లూ తామేమి చేశాం, మున్ముందు ఏమి చేయాలి, మనం నడుస్తున్న మార్గం సరైనదేనా, ఈ మార్గంలో తమ మిత్రులెవరు, వారి సంఖ్యను పెంచడం కూడా మన కర్తవ్యమేనన్న నిజమైన రైట్ పాత్‌ని తప్పకుండా చూపుతారు. ‘ఓ ప్రభుత్వమా నువ్వూ రైట్ పాత్‌లోకి రాకుంటే నీకు మనుగడ ఉండదు’ అని తెల్పుతారు. ప్రజాధనం ప్రజా శ్రేయస్సుకోసమేనని నినదిస్తారు
రోడ్డుకి కుడిపక్కన పోతూ రైట్ పాత్ అనుకోకండి ఎదురుగా వచ్చే వాహనాలు గుద్దుతాయి. ఎడమ పక్క నడవండి అటుగా పోయే లెఫ్ట్ వాళ్లూ మీతో వస్తారు. లెఫ్ట్ పాత్ ఎప్పుడూ రైట్ పాతే మరి!!