మద్దతు ధరల హక్కు : మభ్య ప్రచారం, వాస్తవాలు

The right to support prices is a false propaganda factమద్దతు ధరల హక్కుకై దేశ రైతాంగం ఎన్నో సంవత్సరాలుగా ఆందోళనలు చేస్తున్నది. మోడీ ప్రభు త్వం ”2014లో మోడీ స్వయంగా చేసిన వాగ్దానాన్ని” అమలు చేయాలనేది వీరి ప్రధాన డిమాండ్‌. రైతులు కోరుతున్నట్లుగా మద్దతు ధరల హక్కు కల్పిస్తే, పడే ఆర్థికభారం దేశ ఆర్థిక వ్యవస్థ భరించలేదని, ఆస్తవ్యస్థంగా మారుతుందని మభ్య ప్రచారం చేయబడుతోంది. ఈ ప్రచారం లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రొఫెసర్‌ అశోక్‌ గులాటి, ప్రజాస్వామ్యవాదిగా చెప్పుకుంటున్న జయప్రకాష్‌నారాయణ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకడుగు ముందుకు వేసి జయప్రకాష్‌ నారాయణ మద్దతు ధరల హక్కు కల్పన వల్ల రైతులకు కలిగే మేలుకంటే కీడే చాలా ఎక్కువగా ఉంటుందని ప్రచారం చేస్తు న్నారు. ఇలాంటి ప్రచారం రైతుల్లో ఒక విధమైన భయ వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో, మద్దతు ధరల గురించి స్పష్టమైన అవగాహన అవసరం. ఇది మన దేశానికి, దేశ ఆహార భద్రతకు, దేశ పురోగా భివృద్ధికి చాలా ముఖ్యం.
పెరిగిన మద్దతు ధరల ప్రాధాన్యత
మద్దతు ధరల వ్యవస్థ హరితవిప్లవ కాలం 1966 -67 ప్రాంతంలో ఒడిదుడుకులు లేకుండా వ్యవసా యోత్పత్తి కొనసాగడానికి ఉద్దేశించబడింది. 1990 వరకు అనుసరించిన స్వయం పోష కత్వ విధానాల కాలంలో వ్యవసాయోత్పత్తిలో మద్దతు ధరల ప్రాధాన్యతను రైతులు ఎక్కువగా పట్టించుకోలేదు.1990వ దశకం నుండి కొల్లగొట్టే స్వభావం గల సరళీకరణ ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన తర్వాత వ్యవసా యోత్పత్తిలో పెట్టుబడులు, ఉపకరణాల ఖర్చులు ఒకవైపు పెరుగుతూ పోతుండగా, రెండో వైపు పూర్తి ఉత్పత్తి ఖర్చులను కూడా రాబట్టుకోలేని స్థితి, రుణభారాలతో భరించలేని లక్షలాది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తు న్నాం. ఇది చాలా బాధాకరం. రైతుల సంక్షో భ పరిస్థితుల నివారణకు, సంక్షోభ నివారణకు తగిన సూచనలు చేయడానికి హరిత విప్లవ అధ్యులు డాక్టర్‌ స్వామినాథన్‌ ఉత్పత్తి ఖర్చు జోడించి రైతులకు కుటుంబ నిర్వాహణ కోసం అందాల్సిన ఆదాయాన్ని నిర్దేశించింది. సమగ్ర ఉత్పత్తి ఖర్చు సి2ం 50 శాతం కలిపి మద్దతు ధర నిర్ణయించాలన్న సూత్రం. దీనిలో ”50 శాతం” రైతు కుటుంబాల మనుగడకు దక్కాల్సిన ఆదాయం. దీని పరిమాణం మీదనే రైతు కుటుంబ బాగోగులు ఆధారపడతాయి. రైతులు రెండు రకాల ఆస్థిరత్వాలను ఎదుర్కొంటున్నారు. వాతావరణ ఒడిదు డుకుల వల్ల మొదటిదికాగా, మార్కెట్‌ ధరల హెచ్చు తగ్గుదల వల్ల తమ ఆదాయాన్ని పోందలేకపోవడం రెండవది. పంట ఉత్పత్తిలోని ఒడిదుడుకులను తట్టుకో వడానికి పంటల బీమా ఉద్దేశించబడింది. మార్కెట్‌ ఒడిదుడుకులకు రక్షణగా మద్దతు ధరల హక్కు కోరుతున్నారు.
1.మద్దతు ధరలు ఇప్పుడు కొద్దిమందికే అందు తున్నాయి.(10-20 శాతం).దేశ విస్తార ప్రాంతంలో మద్దతు ధరలు అందడం లేదు.
ఈ విషయాన్ని కేంద్ర ధరల నిర్ణయక కమిషన్‌ కూడా గుర్తిస్తోంది. ఆసలు మద్దతు ధరలు అందించని ప్రాంతాలకు కూడా విస్తరించాలని సూచిస్తుంది. కానీ, అమలుకు నోచుకోవడం లేదు. అయితే, వ్యవసాయో త్పత్తుల కొనుగోలు, నిర్వాహణలో మార్కెట్‌ల వైఫల్యం వల్ల మద్దతు ధరలు పొందడానికి రైతులు మార్కెట్లను నమ్మడం లేదు. ప్రభుత్వానే విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుల డిమాండ్‌ను అర్థం చేసుకోవాలి.
2. మద్దతు ధరల హక్కు అమలు ఖర్చు భారీగా ఉంటుందని, ఈ ప్రభావం ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తుందనే ప్రచారం.
ఇప్పుడు మద్దతు ధర నిర్ణయిస్తున్న 23 పంటలకు హక్కును కల్పించాలంటే రూ.10-15 లక్షల కోట్ల భారం ఆర్థిక వ్యవస్థపై పడుతుందని, ఆర్థిక వ్యవస్థ విచ్ఛినం అవుతుందని ప్రభుత్వం ఇతర సంక్షేమ కార్య క్రమాలను కొనసాగించలేదని ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవం దీనికి భిన్నంగా ఉంది. ఎంతో అంతర్జా తీయ విశ్వసనీయత గల క్రైసిల్‌ సంస్థ భారత దేశంలో మద్దతు ధరల హక్కు అమలు చేయడానికి 2022- 23 పంటల ఆధారంగా మొత్తం వ్యవసాయోత్పత్తి విలువ దాదాపు రూ.15 లక్షల కోట్లుగా ఉంటుందని, అమ్మకానికి వచ్చే ఉత్పత్తుల్ని మార్కెట్‌లో కొనడానికి రూ. 7-8 లక్షల కోట్లు పెట్టుబడి (రివాల్వింగ్‌ ఫండ్‌) అవసరమవుతుందని, నికరంగా ఖర్చు దాదాపు రూ. 21 వేల కోట్లు అవుతుందని అంచనా వేసింది.
మార్కెట్‌, మద్దతు ధరల వ్యత్యాసాన్ని (భావాంతర్‌ భావ్‌ పథకం) ప్రయివేటు మార్కెట్‌ల ద్వారా రైతులకు చెల్లింపచేస్తే ప్రభుత్వంపై పడే ఖర్చు దాదాపు రూ.50 వేల కోట్ల కన్న మించదని ఇతరులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ ఇప్పుడు రూ.47 లక్షల కోట్లు. ఇటువంటి ఆర్థిక వ్యవస్థలో రూ.50 వేల కోట్ల ఖర్చును భరించడం అంత కష్ట మేమి కాదు. కావాల్సింది రాజకీయ ‘సంక ల్పం’. అయితే, పాలకలు ఇలా ఎందుకు నిర్ణయించలేకపోతున్నారు? అనేది ఆలోచించాలి. దీనికి ప్రధాన కారణం కేంద్ర పాలకుల ఏ పార్టీకి చెందినప్పటికీ డబ్ల్యూటిఓ నియమ నిబంధనల ప్రకారం వ్యవ సాయరంగాన్ని కార్పొరేటీకరించే ప్రయత్నం. ఈ విధానాలకు కట్టుబడ్డ మోడీ ప్రభుత్వం మద్దతు ధరల హక్కు కల్పించ డానికి సిద్ధంగా లేదు.

ఈ విషయంలో చేసిన వాగ్దానాన్ని అమలు చేసే నైతికతను ఉంచుకోవాలని భావించడం లేదు.
3. ఏ మద్దతు ధరలు లేని వ్యవసాయోత్పత్తులు వేగంగా పెరుగుతున్నాయి. ఉదాహరణకు వార్షి కంగా పౌల్ట్రీ రంగం 9 శాతం, చేపలు 7-8 శాతం, పాలు 5-6 శాతం పెరుగుతున్నాయి. కానీ, మద్దతు ధరలు ఉన్న ఏ పంటల ఉత్పత్తి మేర పెరగడం లేదు. 3-4 శాతం మధ్యనే ఈ పెరుగుదల ఉంది. (అశోక్‌ గులాటి).
ఈ రంగాల్లోని రైతుల స్థితిని అశోక్‌ గులారటి వారు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని భావించాల్సి వస్తుంది. పౌల్ట్రీ రంగంలో ఆసలు రైతులే లేరు. ఉత్ప త్తి, నిర్వహణ, అమ్మకాలు మొత్తం కార్పొరేట్‌ చేతుల్లో కొనసాగుతున్నాయి. పెట్టుబడి కూడా పెద్దఎత్తున అవ సరమౌతుంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి ఇలా కాదు. 86 శాతం పైగా కమతాలు ఐదెకరాల కన్న తక్కువగా ఉండే చిన్న-సన్నకారు రైతులవే. వీరికి కూలీలుగా తప్ప పౌల్ట్రీ రంగంలో మరో స్థానమేమి లేదు. ఇలాంటి కార్పొరేటీకరణ జరిగితే ఇప్పుడు భూమి కలిగిన రైతులంతా కార్పొరేట్‌ కూలీలుగా మారాల్సి వస్తుంది. దీనిని రైతులు అంగీకరించడంలేరు.
పాల ఉత్పత్తిలో ప్రధానంగా చిన్న-సన్నకారు రైతులే ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల వీటి ఉత్పత్తి, సాంకేతిక మద్దతు, సేకరణ, శుద్ది ప్రక్రియలు, అమ్మ కాలు ప్రధానంగా బలమైన సహకర రంగంలో కొనసా గుతున్నాయి. ప్రయివేటు రంగం ఇది, సహకార రంగంతో పోటిపడాల్సి వస్తుంది. అయితే ఉత్పత్తి దారు లకు నిర్ణయించిన ధర వస్తునప్పటికీ ఉత్పత్తి ఖర్చులను పూర్తిగా రాబట్టు కోలేకపోతున్నారు. తెలంగాణలో ఇప్పుడు లీటరు రూ.5లు సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. చేపల రంగంలో చేపలు పట్టేవారి ఆర్థిక, సామాజిక స్థితి మన చిన్నకారు రైతుల కన్నా మెరుగ్గా ఏమీ లేదు. వ్యవసాయోత్పత్తి పెరిగినంత మాత్రాన దానిమీద ఆధారపడే వారి జీవితాలు కూడా మెరుగు పడతాయని ప్రస్తుత పరిస్థితుల్లో భావించలేం. ఇలా లేనందువలనే రైతులు మద్దతు ధరల హక్కును డిమాండ్‌ చేస్తున్నారు. వీరు మార్కెట్‌లను విశ్వసించడం లేదు.
4.మద్దతు ధరల హక్కు రైతులకు మేలు చేసే దానికన్న కీడే ఎక్కువగా చేస్తుంది. దీనికి బదులుగా ఉత్పత్తి-వినియోగదారుల మధ్య తుల్యత (లెవల్‌ ఫ్లేయింగ్‌ ఫీల్డ్‌) కల్పించాలి. మద్దతు ధర హక్కుకు బదులు ఇతర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలి. (జయప్రకాశ్‌ నారాయణ).
రైతులు ఊహలోకంలో జీవించడం లేదు. నిజ ఆర్థిక వ్యవస్థలో జీవిస్తున్నారు. గిట్టుబాటు ధరలను కల్పించడంలో ప్రయివేటు మార్కెట్‌ల వైఫల్యం వలనే ప్రభుత్వం నుండి మద్దతు ధరల హక్కును డిమాండ్‌ చేస్తున్నారు. మద్దతు ధరలు నిర్ణ యంలో ఉత్పత్తి ఖర్చులతోపాటు ఆర్థిక వ్యవస్థ, సామాజిక పరిస్థి తులపై చూపగల ప్రభావం, అంతర్జాతీయ మార్కెట్‌ ధరల పరిస్థితుల లాంటి అంశాలను మద్దతు ధరల సూచించే సమయంలో పరిగణన లోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశిస్తుంది. అందువల్ల, ఆర్థిక వ్యవస్థపై మద్దతు ధరల హక్కు తీవ్ర దుష్ప్రభావం కలిగి ఉంటుందనే ప్రచారం వాస్తవం లేదు.
జయప్రకాశ్‌ నారాయణ వాదన నర్మగర్భంగా కార్పొరేట్‌లకు అనుకూలంగా ఉంటుంది. వారి రాజ కీయ ప్రస్థానం కార్పొరేట్‌ల పైనాన్స్‌తో (డెమోక్రోటిక్‌ ఫౌండేషన్‌ అనే పేరుతో ఉన్న అమెరికన్‌- ఇండియన్‌ కార్పొరేట్లు ఆర్థిక సహాయంతో) ప్రభుత్వయేతర సంస్థగా (ఎన్‌జిఓ) లోక్‌ సత్తా ప్రారంభమై రాజకీయ రూపుదిద్దుకుంది. ఈ నేపథ్యంలో, వీరి అభిప్రాయాల్ని అర్థం చేసుకోవాలి.
5. రైతులు ఎన్నికల సందర్భంలోనే ఆందోళన చేస్తున్నారు?దీని రాజకీయ అంతర్గతం అర్థం చేసుకోవాలి.
ఇది పూర్తిగా ఆవాస్తవం. కేవలం అధికారం చెలాయిస్తున్న వారికి మద్దతుగా ఈ మభ్య ప్రచారం జరుగుతుంది. కొల్లగొట్టే స్వభావం గల ఆర్థిక సరళీ కరణ విధానాలతో, రుణ భారాలతో రైతుల ఆత్మహ త్యలు ప్రారంభమైనప్పటి నుండి ఏదో ఒక రూపంలో ఎన్నికలకు సంబంధం లేకుండా రైతులు దేశమంతా ఆందోళన చేస్తున్నారు. అయితే, ఈ ఆందోళన దేశమంతా ఒకే విధంగా లేదు. ఇదే వేరు ముఖ్యాంశం. మిగతా రాష్ట్రాలో అంత తీవ్రంగా ఉండకపోవచ్చు. వీరెవరు ఒక రాజకీయ పార్టీని ఓడించి రాజ్యాధికారం చేబట్టాలని ఆందోళన చేయడం లేదు. వీరి ఆందో ళనలు ”చేసిన వాగ్దానాల అమలు కోసమే”. అందువల్ల, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల ముందు రైతులు ఆందోళన చేస్తున్నారనేది పూర్తిగా ఆవాస్తవం. రైతులు తమ వృత్తి మనుగడకోసం, రుణ భారాల నుండి బయట పడి రాజ్యాంగం అంధించిన హక్కు లను ఇతర పౌరులతో సమానంగా అనుభవించడానికి మాత్రమే ఆందోళన చేస్తున్నారు. అందువల్ల, మద్దతు ధరలకు హక్కు కల్పించడానికి అడ్డుపడే విధంగా చేస్తున్న మభ్య ప్రచారాల్ని అర్థం చేసుకోవాలి. దేశంలో సగం పైగా జనాభాకు (54 శాతం పైగా) ఉపాధిని, కుటుంబాలను, దేశ ప్రజల ఆహార భద్రతను, దేశ స్వాతంత్య్రాన్ని రక్షిస్తూ పరాయీకరణను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా పోరాడుతున్న రైతు ఉద్యమానికి మద్దతునివ్వడం నిజమైన దేశభక్తికి ప్రతీక.
అరిబండి ప్రసాద్‌ రావు
9490098903