మూడోసారి ప్రధానిగా పదవీ స్వీకారం చేసిన నరేంద్రమోడీ రానున్న రోజుల్లో తన ప్రాధాన్యతలు ఏమిటో వెల్లడిస్తారని ఎదురు చూసిన దేశానికి పాత చింతకాయ పచ్చడి కబుర్లు వినిపించారు. ఇటీవల జరిగిన ఎన్డీయే ఎంపీల సమావేశంలోనూ ఇది వెల్లడైంది. కాంగ్రెస్ మీద దాడికే ఎక్కవ ప్రాధాన్యత ఇచ్చారు. కాంగ్రెస్‌కు ఇప్పుడున్న సీట్లు కూడా రావంటూ ఎన్నికల ముందు ఊరూవాడా తిరుగుతూ మాట్లాడిన పెద్దమనిషి పదేండ్లలో వంద సీట్లు కూడా తెచ్చుకోలేకపోయిం దన్నారు. సొంతంగా 370, కూటమిగా 400కు పైగా సీట్లు తెచ్చుకుంటామన్న బీజేపీ తన బలాన్ని కోల్పోయి 240కి ఎందుకు పరిమిత మైందనే చర్చ దేశంలో జరుగుతుం డగా దాన్ని తక్కువ చేసి చూపేందుకు కాంగ్రెస్ మీద దాడికి దిగటాన్ని అర్ధం చేసుకోలేనంత అమాయకంగా జనం లేరు. రామాలయ నిర్మాణాన్ని పెద్ద ఘనతగా చెప్పుకోవటమే కాదు, ప్రజాస్వామ్యం కోసం కాకుండా రాముడిని ఓడించేందుకే కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నదని, వారు గెలిస్తే రామాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తారని చెప్పిన పెద్దమనిషి మోడీ. ఈ ఎన్నికల్లో ఆ అయోధ్య రాముడు తనను బీజేపీ రక్షిస్తుందన్న నమ్మకం లేక ఆ నియోజకవర్గంలో సమాజ్‌వాది పార్టీని గెలిపించిన తీరును దైవాంశ సంభూతుడనని చెప్పుకున్న మోడీ, రామభక్తులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆ రాముడే బీజేపీని ఎందుకు ఓడించాడో అర్ధంగాక జుట్టుపీక్కుంటున్నారు. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు, అలాగే బీజేపీ రామభక్తి బండారం గురించి అయోధ్య పరిసరాల్లో తెలిసినంతగా ఇతరులకూ తెలియదు, అందుకే వారు ఓడించారు.
విధిరాత గురించి కొందరికి నమ్మకం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ముస్లింలకు దొడ్డిదారిన రిజర్వేషన్లు కల్పించేందుకు ఒబిసిల వాటా లేదా కోటా తగ్గించబోమని రాతపూర్వక హామీ ఇవ్వగలరా? అని ఇండియా కూటమిని మోడీ సవాల్ చేశారు.తన ప్రాణమున్నంత వరకు ముస్లింలకు రిజర్వేషన్లు అమలు కానివ్వనని ఎన్నికల ప్రచారంలో శపథం చేశారు. అదే మోడీ ముస్లిం రిజర్వేషన్లు అమలు జరిపి తీరుతామని ప్రతిన చేసిన చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్‌లను కుడి, ఎడమల కూర్చో పెట్టుకున్నారు. పదవి ముఖ్యం గనుక ఆ రిజర్వేషన్ల గురించి మాట్లాడకుండా నోటికి తాళం వేసుకున్నారని, తన వీరశూర ప్రతిజ్ఞను పక్కన పెట్టారని జనం అనుకుంటున్నారు. ఇది మిత్రపక్షాల సంతుష్టీ కరణ రాజకీయం కాదా? అంతేకాదు, ముస్లిం అనుకూల పార్టీల దయా దాక్షిణ్యాల మీదే మోడీ ప్రభుత్వం ఏర్పడుతున్నదని, ఎంత వారలైనా అధికారకాంత దాసులే అని లోకం కోడైకూస్తున్నది. జనం తిరస్కరించిన హిందూ త్వ, హిందూ రాజ్యస్థాపన భావనలను తలకెక్కించుకొని వీరంగం వేస్తున్నవారు, ఆ ప్రచార ప్రభావానికి లోనైన వారు వాటిని పక్కనపెట్టి జనజీవన స్రవంతిలోకి రావటం అవసరం.
ఎన్డీయే, సమిష్టి ప్రభుత్వం, తత్వం అంటూ పదే పదే ప్రసంగంలో మోడీ తన ఆచరణకు విరుద్ధమైన మాటలు చెప్పారు. తన పదేండ్ల ఏలుబడిలో ఎన్నడైనా ఎన్డీయే సమావేశాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం అనుసరించాల్సిన విధానాల గురించి భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపిన ఉదంతం ఉందా? ఇండియా కూటమి ఏర్పాటు తరువాత మొక్కుబడిగా ఒక సమావేశం జరిపారు. చంద్రబాబు 2018లో ఎన్డీయే కన్వీనర్‌గా తప్పుకున్న తరువాత ఇంతవరకు ఆ పదవికి ఎవరినీ ఎన్నుకోలేదు.నిజానికి సమిష్టితత్వం పట్ల మోడీకి చితశుద్ది ఉందా? ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి బీజేపీ పెద్దలతో ఒక మార్గదర్శక మండలి ఏర్పాటు చేసి నిరంతరం వారి సలహాలు తీసుకుంటా మంటూ హడావుడి చేశారు. అసలు ఒక్కసారైనా సదరు మండలితో కూర్చొని మోడీ సలహాలు తీసుకున్నట్లు ఒక్క వార్త కూడా లేదు.ఏపీ ఎన్నికల్లో సీట్లకోసం ముందుకు వచ్చింది తప్ప ఉమ్మడి ఎన్నికల ప్రణాళికలో భాగస్వామి కావటానికి బీజేపీ సిద్ధపడలేదు, చివరకు దాన్ని ఆవిష్కరించ టానికి కూడా తిరస్కరించిన పార్టీ అది. అవసరార్ధం వసుదేవుడు గాడిద కాళ్లు పట్టుకున్నట్లుగా మెజారిటీ లేక ఇతర భాగస్వాములను కౌగిలించుకోవటం తప్ప మోడీ ప్రసంగంలో భాగస్వామ్య పక్షాల గురించిన ప్రశంసలు హృదయంలోంచి వచ్చిన అభిమానం అని ఎవరూ అనుకోవటం లేదు. మిత్రపక్షాలను మింగివేయటం కొత్తకాదని తన రాజ్యసభ పక్షాన్నే విలీనం చేసుకున్న తీరు తెలుగు దేశానికి కొత్తగా చెప్పనవసరం లేదు. బీజేపీ, నరేంద్ర మోడీ బలహీన పడివుండవచ్చు తప్ప ఇంకా ప్రమాదకరంగా ఉన్నారన్నది ‘ఇండియా’ కూటమే కాదు, ఎన్డీయే పక్షాలు కూడా గ్రహించాలి.
– ఫీచర్స్ అండ్ పాలిటిక్స్