అనగనగా ఓ కోతుందా? కోతికి ఒక్క తోకుందా? గెంతుతూ దుముకుతూ ఉరికిందా? ఒళ్లే తెలియక ఎగిరిందా? ఎగిరి ఎగిరి పడిపోయిందా? తోకను ముల్లు గుచ్చిందా? గుచ్చితే ముల్లు నొచ్చిందా? నొచ్చిన తోకను ఎత్తి పట్టుకుని అటూ ఇటూ ఎటో పరుగెత్తిందా? మనుషుడొక్కడు కనపడెనా? తోకను చూపుతూ ఉరికిందా? పదేపదే మరి మూల్గిందా? మనుషుడు కత్తిని తీశాడా, తోకను పట్టుకు చూశాడా, ముల్లును తాను కనిపెట్టాడా, కత్తిని దానికి పెట్టాడా, పెకిలించాలని చూశాడా? కత్తి సర్రుమని అందో లేదో తోక టక్కుమని తెగిపోయిందా?
తోక తెగిందని లబోదిబోమని కోతందా? కోతికి కోపం వచ్చిందా, కల్లు తాగినది కోతయిందా? తోకిస్తావా; కత్తిస్తావా తేల్చర భడవా? ఏదో ఒకటి చెయ్యకపోతే రక్కుత, కొరుకుత, ప్రాణం తీస్తా అందా. కరవడానికై దూకిందా? ఇంతే సంగతి అయిపోతుంది. ఇక్కడే ప్రాణం తోడేస్తుంది. కత్తే కదా పోనీ పోతే అనుకున్నాడా? కత్తిని విసిరి జంపయ్యాడా. మనుషుడు ‘ఎస్నేప’య్యాడా? తోక పోయినా, కత్తి దొరికె కదా! చూస్తా చూస్తా సంగతి చెప్తా… వదిలేదేలేదెవ్వరినీ.
ఇల్లూ ఊరూ వాడా, చెట్టూ పుట్టా, నదులూ నీళ్లూ అన్నీ నేనే చుట్టేస్తా. ఎవరికీ సుఖమే లేకుండా, వేరెవరికీ శాంతే లేకుండా అందరి పని నే పడతాగా అంటూ పగతో రగిలిందా.
తోకకు బదులుగా చిక్కిన కత్తిని చేతను బట్టి పాదయాత్రనే చేసిందా? కోతికి కొబ్బరి దొరికిందా? ఇలాగిలాగని అనుకుందా? కలిసీ మెలిసీ వుంటారా? అన్నదమ్ములని అంటారా? లౌకిక రాజ్యం కలయేరా. ఇక కల్సి వుండడం కల్లేరా. మనిషి మనిషిలో అగ్గి రగలదా? సాటి మనిషిపై ద్వేషం పెంచి మనిషిని మనిషికి దూరం చేస్తా. మీలో మీరే కొట్టుకు చస్తే తోక తెగిందని బాధే పోదా. మతాల పేరిట మారణహోమం, కులాల పేరిట కుళ్లూ కుతంత్రం జరిపిస్తాగా, ఏకత్వం ఇక మరిపిస్తాగా. దొరికిన కత్తితో ముక్కలు కోస్తా. భవితవ్యమే చీకటి చేస్తా అన్నది.
కోతది. తోకలేనిదీ కెలికే రకమది. అన్నిటినీ ఇక అడ్డేమున్నది. ముందుగ నాయక మన్యుల బుర్రను తొలిచీ ప్రజాసేవ అను ముసుగే తొడిగీ, స్వార్థమన్న ‘జహరది’ నింపి బేధాలను కొండంతలు చేసి ఎవరికి వారే వేరై పోయే స్వంతలాభమే అంతయు చేసి అంతటితో సరిపోదేమోనని వ్యవస్థలన్నిటి పనిపట్టాలని, ప్రజాస్వామ్యమను ఘన సౌధానికి పునాది రాళ్లను పెకిలించాలని ఇకిలించిందా.
బంధాలన్నీ తెంపేసిందా. తండ్రీ కొడుకులు, కొడుకులు తండ్రులు కొట్టుకు చస్తే, తమవారెవరో పరాయివారెవరో తేడా లేక ఒకరిని ఒకరు కోసుకు చస్తే సంతోషంగా ఊయలలూగి, డబ్బుకోసమై నానాగడ్డీ తినే మనుషులను కల్తీ చేసే ప్రాణాల్తీసే దగాకోరులను వ్యవహర్తలను, విద్యా వైద్యం వ్యాపారంతో కోట్లు గడించే మోసగాళ్లను ఎన్నో రకముల కేటుగాళ్లను తయారు చేసి తమాషా చూసెను.
కోతది, తోకలేనిదది. అబద్దాల ఫ్యాక్టరీ పెట్టి వాట్సప్ అను వైరసు లేపి కుక్కలు చింపిన విస్తరి చేసె. దేశాన్నే ఇక ముక్కలు చేసె. చరిత అన్నదే మాయం చేసె. మాయలాడిగా మారినదా కోతది. రంగూ రూపూ ఎప్పటికప్పుడు మార్చీ మారీ ఆక్టోపస్‌లా, డైనసారులా బకాసురునిలా నానా యాగీ చేసిందా? మాన ప్రాణములు దోచిందా? ఇలాగ దారి తప్పితే మనుషులు, కాలుష్యం అది కాటేసీ, మనుషులందరూ శాంతీ సహనం సోదర భావం, పరోపకారం మరిచీ మానవత్వమది. మంట కలిస్తే ఏకమయ్యేనిక. ఏమవునో మరి, చీకటి నుంచి బయటకు రారా వెలుతురు కోసం కళ్లు తెరవరా. నెత్తుటి ధారలు స్రవిస్తే వచ్చిన స్వాతంత్య్రానికి విలువనీయరా. సురాజ్యమది స్థాపించగలేరా? మాటలు కోటలు దాటే మనుషులు. మాటల మత్తును చల్లే మనుషులు, మాటల మనసులు విరిచే మనుషులు. ఎంతోకాలం నిలవరు, మిగలరు. తరతరాల మన సంస్కృతి చెదరదు. ప్రపంచమంతా ఒకే కుటుంబం. మంచీ మమతా మానవతా; మన మాటా బాటా అన్నది మారదు.
వచ్చే పోయే మనుషుల కోసం రంగులు మార్చే, తలలే మార్చే మన’నేమార్చే’ వారల మోసం సాగనీయమని కలిసి అందరూ కలిసికట్టుగా సంకల్పిస్తే ఒక్క తాటిపై నడిచేస్తే కదా శాంతీ సౌఖ్యం సౌభ్రాతృత్వం అన్నవి. పూచీ కాచీ ప్రపంచానికే మార్గం చూపే ప్రజాస్వామ్యమది. పదిలంగుండదా? మనిషి మనుగడకు అండగనుండదా? తోక తెగిన ఆ కోతిని తెచ్చీ, తల తిరిగిన ఆ కోతికి ఇచ్చి ముల్లే తీసి తోకను కోతికి అతికించి వదిలేస్తే, మరి సరిచేస్తే సరి! దాని దారినది పోతుందా? మన దారే మనకుంటుందా? రహదారే మనముందుందా?
– చింతపట్ల సుదర్శన్
9299809212