– ఏళ్ల తరబడి సమస్యను పరిష్కరించాలని పొన్నం దృష్టికి తీసుకెళ్లిన జాయింట్ యాక్షన్ కమిటీ వినతి
నవతెలంగాణ – దుబ్బాక రూరల్
గత పదేళ్లు పరిపాలించిన బిఆర్ఎస్ ప్రభుత్వం తిమ్మాపూర్ నుండి అందె వరకు ఉన్న రోడ్డు సమస్యను పరిష్కరించలేదని, ఈ రహదారి గుండా నిత్యం12 కిలో మీటర్ల వరకు ప్రయాణించే వాహనదారులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ, గాయాలపాలై ఆసుపత్రుల పాలవుతున్నారని వెంటనే రోడ్డు మరమ్మత్తులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు మంగళవారం రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను కోరారు. ఈ మేరకు హుస్నాబాద్ లో కలిసి తిమ్మాపూర్ నుంచి అందె వరకు అధనంగా మారిన రోడ్డును బాగు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలోని తిమ్మాపూర్ నుంచి అందె వరకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా చెడిపోయిందని, తద్వారాతిమ్మాపూర్, పద్మనాభుని పల్లి, కొండాపూర్, అందె పాటు పలు గ్రామాల ప్రజలు దుబ్బాకకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రహదారి సరిగా లేక ప్రమాదాల బారిన పడి ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చు చేసిన ప్రాణాలు దక్కించుకోలేకపోతున్నామని మంత్రికి తమ ఆవేదన వ్యక్తం చేశామన్నారు. ఏళ్లతరబడిగా అధికారులకు, గత పాలకులకు తమ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. తొందర్లోనే సమస్యను పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు గన్నెబోయిన సతీష్ గౌడ్, రాములు గౌడ్, రాజు, నవీన్, అమర్ తదితరులు ఉన్నారు.
సమస్యను పరిష్కరిస్తానని మంత్రి పొన్నం హామీ
తిమ్మాపూర్ – అందె వరకు అద్వానంగా మారిన రోడ్డు పరిస్థితిని జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు మంత్రి పొన్నం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి ఆర్ అండ్ బి జిల్లా అధికారికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే రోడ్డు నిర్మాణ ప్రక్రియకు సంబంధించిన టెండర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. టెండర్ పూర్తయ్యాక రోడ్డు పనులను ప్రారంభించాలని ఫోన్లో ఆదేశించారు.ఈ సమస్యను తొందరలోనే పరిష్కరిస్తారని జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన మంత్రి పొన్నంకు జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు గన్నెబోయిన సతీష్ గౌడ్, రాములు గౌడ్, రాజు, నవీన్, అమర్ తదితరులు ఉన్నారు.