కుంటలను తలపిస్తున్న ఇంద్రారెడ్డినగర్‌ రోడ్లు

Rangareddy– చినుకుపడితే రోడ్లన్నీ అధ్వానం గుంతలమయంగా రోడ్లు
– వాహనదారులు, పాదాచారులకు తీవ్ర ఇబ్బందులు
నవతెలంగాణ-శంకర్‌పల్లి
ఇటివల కురిసిన వర్షాలకు మండలంలోని మిర్జాగూడ గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన ఇంద్రారెడ్డినగర్‌కు వెళ్లే రోడ్డు గుంతలో నీళ్లు నిలిచి చిన్న కుంటలా తలపిస్తోంది. కోటి రూపాయలు మంజూరైన రోడ్డు నిర్మాణ పనులు కాంట్రాక్టర్‌ పూర్తి స్థాయిలో చేయకపోవడంతో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. చిన్న పాటి వర్షంతోనే నీరు నిల్వఉండటంతో అటు వాహన దారులు, ఇటు పాదాచార్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇంద్రారెడ్డి నగర్‌కు చెందిన గ్రామస్తులు గోపాల్‌నాయక్‌, ప్రవీణ్‌ కుమార్‌, గణేష్‌ నాయక్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే రెండు నెలల్లో వర్షాలు పడే అవకాశాలు ఉండటంతో సంబంధిత అధికారులు స్పందించి, రోడ్డు మరమ్మతులు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరారు. ఈ విషయంపై మాజీ సర్పంచ్‌ రవీందర్‌గౌడ్‌కు సమాచారం అందించినట్టు గ్రామస్తులు వెల్లడించారు. ఇప్పటికైనా సంబంధిత అధి కారులు స్పందించి ఇంద్రారెడ్డినగర్‌కు వెళ్లే రోడ్డు మరమ్మతుల పనులు వెంటనే ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.