నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
భారత ఆహార సంస్థ, నల్గొండ కార్యాలయంలో నూతనంగా ఉద్యోగంలో చేరిన వారిలో డిపో కేడర్ కు చెందిన పలువురిని సంస్థ హైదరాబాదు ప్రాంతీయ కార్యాలయం ఆదేశాల మేరకు సంస్థ నల్గొండ గోదాములో గురువారం క్షేత్ర స్థాయి శిక్షణకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా సంస్థ నల్గొండ డివిజనల్ మేనేజర్ సుశీల్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, ఈ బ్యాచ్ వారికి రెండు వారాల పాటు సంస్థ గోదాముల్లో సమగ్రంగా క్షేత్ర స్థాయి శిక్షణ ఇస్తామని తెలిపారు. ఆహార ధాన్యాల శాస్ర్తీయ నిర్వహణ లో డిపో కేడర్ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమన్న ఆయన, ఉద్యోగులకి డిపో ఆన్లైన్ సిస్టమ్, ప్రాక్యూర్మెంట్ నిర్వహణ వ్యవస్థ వంటి కీలక అంశాల పట్ల విశేష అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెరుగుతున్న సాంకేతికత వాడకాన్ని మరింత ఆకళింపు చేసుకుని, తద్వారా సంస్థ పురోగతికి తోడ్పడాలని ఆయన అభిలషించారు. కార్యక్రమంలో మేనేజర్ రవి కుమార్, కాసిరెడ్డి, సుకుమార్, ఉద్యోగులు రవితేజ, ఉష, ఆశ, పవన్, మౌనిక, స్వాతి, యూనియన్ ప్రతినిధి సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.