– జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్
– ప్రజా సమస్యలు సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కరించాలి
– గిరిజన సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి
నవతెలంగాణ – సిరిసిల్ల
సంక్షేమ పథకాల అమలులో అధికారుల పాత్ర కీలకం అని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హూస్సెన్ అన్నారు. గురువారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హూస్సెన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు ముందుగా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చిన జాతీయ ఎస్ టి కమిషన్ సభ్యులను జిల్లా కలెక్టర్ సాదరంగా స్వాగతించారు. జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను, విద్య, వైద్యం సంక్షేమ రంగంలో ఎస్టీ వర్గాల ప్రజలకు అందిస్తున్న సదుపాయాలను జిల్లా కలెక్టర్ వివరించారు.
జిల్లాలోని ఎస్టి ప్రజలకు తమ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలను ముఖ్య ప్రణాళిక అధికారి, జిల్లా సంక్షేమ అధికారి, విద్యా శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్, ఎక్సైజ్, డి.అర్.డి. ఓ .పంచాయతీ, శాఖల అధికారులు ,రుణాల పై లీడ్ బ్యాంకు మేనేజర్ వివరించారు. ఈ సందర్భంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హూస్సెన్ మాట్లాడుతూ.. గిరిజనుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా కృషి చేసేందుకు ఎస్టి కమిషన్ పనిచేస్తుందని, గిరిజనులకు ఇబ్బందులు కలిగితే ఎంత వారినైనా శిక్షించే అధికారం కమిషన్ కు ఉందని అన్నారు. ప్రజా సమస్యలను సంబంధిత అధికారులు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. ఇక నుంచి కమిషన్ ప్రతి మూడు నెలలకు ఒకసారి క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తుందని, దేశవ్యాప్తంగా వ్యక్తిగతంగా పర్యటిస్తూ గిరిజనుల జీవితాలు పురోగతి కలిగించేందుకు కృషి చేస్తామని అన్నారు. గిరిజన సంక్షేమ వసతి గృహాల స్థితిగతులపై సమీక్షించిన కమిషన్ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుందని, అవసరమైన చిన్న చిన్న మరమ్మత్తులు కింది స్థాయిలో చేసుకోవాలని అన్నారు. పంచాయతీరాజ్ శాఖ పై సమీక్షిస్తూ గిరిజనులు అధికంగా ఉన్న గ్రామాలలో సిసి రోడ్ల నిర్మాణం అవసరమైన ట్రైనింగులు, గ్రామీణ యోజన పథకం కింద చేపట్టాలని సూచించారు. గిరిజనులకు హక్కుగా రావాల్సిన పోడు పట్టా భూములు అర్హత మేరకు పకడ్బందీగా సర్వే నిర్వహించి పంపిణీ చేయాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. అనంతరం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుల జిల్లా అధికారులు, ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జనార్దన్ ,సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు రమేష్, రాజేశ్వర్ ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.