గాలి బీభత్సం… లేచిన ఇండ్ల పైకప్పులు

– పిడుగుపాటుకు దుక్కిటావు మృతి
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి మండలంలో ఆదివారం సాయంత్రం గాలి దుమారం బీభత్సాన్ని సృష్టించింది. విపరీతమైన గాలితో పేదల ఇండ్ల పైన కప్పులు లేచి ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులు వర్షార్పణం అయ్యాయి. దీంతో వారు ఇతర ఇండ్లలలో తలదాచుకోవల్సి వచ్చింది. కారేపల్లికి చెందిన గుంజ సతీష్‌-రాణి దంపతులు బార్భర్‌, టైలరింగ్‌ వృత్తితో జీవనం సాగిస్తున్నారు. గాలిదుమారానికి వారి రేకుల ఇల్లు పైకప్పు లేచి పోయి ఇంట్లో సామాన్లు వర్షానికి తడిసి పడైపోయాయి. కారేపల్లిలోని బట్టు చంద్రకళ ఇంటి రేకుల లేచిపోయాయి. ఒంటరి మహిళ అయిన చంద్రకళ ఇల్లు రేకులు గాలికి పోవటంతో ఇంట్లో ఉన్న సామాన్లు తడిసిపోయాయి. రావోజీతండాకు చెందిన మాలోతు లక్ష్మి ఇంటి కప్పు గాలికి లేచిపోయి నిరాశ్రురాలైంది. గాలికి మామిడి తోటలలో కాయలు రాలి పోవటంతో రైతులు అవస్ధలు పడుతున్నారు.
పిడుగుపాటుకు దుక్కిటావు మృతి
పిడుగుపాటు దుక్కిటావు మృతి చెందిన ఘటన కారేపల్లి మండలం బొక్కలతండాలో జరిగింది. ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావటంతో ఆ సమయంలో చేనులో మేస్తున్న దుక్కిటావుపై పిడుగు పడింది. దీంతో బొక్కలతండాకు చెందిన అజ్మీర బుచ్చాకు చెందిన ఆవు అక్కడికక్కడే మృతి చెందింది.
బాధితులను ఆదుకోవాలి : సీపీఐ(ఎం)
గాలిదూమారం, వర్షభీభత్సానికి గురైన ఇండ్లు కోల్పొయిన, పశువులు మృతువాత పడ్డ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి కే.నరేంద్ర, నాయకులు వల్లభినేని మురళిలు డిమాండ్‌ చేశారు. ఇండ్లు కోల్పోయిన వారికి డబల్‌ ఇండ్లు ఇవ్వటంతో పాటు పరిహారం ఇవ్వాలన్నారు. దుక్కిటావు మృతి చెందిన రైతుకు పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.