చర్చిలు మసీదుల కింద ఆలయాలున్నా యంటూ సరికొత్త వివాదాలు లేవనెత్తడంపై ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ చేసిన ప్రసంగాన్ని ఎవరైనా ఎలా అర్థం చేసుకోగలుగుతారు? చర్చిలు మసీదుల కింద ఆలయాలున్నాయంటూ కొత్త వివాదాలు లేవనెత్తడం సరికాదంటూ ఆయన డిసెంబర్ 19న పూనేలో మాట్లాడారు. రామమందిరం అనేది హిందువుల విశ్వాసానికి సంబంధించిన అంశమని ఆయన అన్నారు. అయోధ్యలో హిందువుల విశ్వాసానికి సంబంధించిన అంశమైన రామమందిర నిర్మాణం మరిన్ని వివాదాలకు దారితీయరాదని చెప్పారు. ”ప్రతిరోజూ ఒక కొత్త విషయం (వివాదం) రగిలించబడుతున్నది. దీన్ని ఎలా అనుమతించగలం? ఇది కొనసాగకూడదు” అని ఆయన ముగింపులో అన్నారు.
ఈ వ్యాఖ్యలపై పరిపరివిధాల వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ఆలయాలను ధ్వంసం చేసి ఆ స్థానంలో మసీదులు నిర్మించడం ద్వారా చరిత్రలో జరిగిన తప్పుల పట్ల ఆరెస్సెస్ వైఖరిలో ముఖ్యమైన మార్పు వచ్చినట్టుగా కొందరు భావించారు. అలాటి వివాదాల విషయంలో ఆరెస్సెస్ అసలైన వైఖరిని కప్పిపుచ్చేందుకు మార్పు వచ్చినట్లుగా చేస్తున్న ప్రయత్నంగా మరికొందరు భావించారు.
ఆ వైఖరి నిజంగా మారిందా?
మోహన్ భగవత్ ప్రసంగాన్ని బట్టి ఆరెస్సెస్ ప్రకటిత వైఖరిలో నిజంగా తలకిందులుగా మార్పు వచ్చినట్టుగా అనుకుంటే అది అమాయకత్వమే. భగవత్ నిజంగా ఏం చెప్పారంటే అర్థం చేసుకోవడానికి ఏవైనా ఆధారాలు కావాలంటే మనం 2020లో ఆయన చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసుకోవాలి. నాగపూర్‌లో సంఫ్‌ు కార్యకర్తల శిక్షణా తరగతుల్లో మాట్లాడుతూ ప్రతి మసీదు కిందా ఒక శివలింగాన్ని కనుగొని కొత్త వివాదం లేవనెత్తే ధోరణిని ఆయన విమర్శించారు. ఒక నిర్దిష్ట పరిస్థితుల్లో కొన్ని చారిత్రిక అవశ్యకతల వల్ల ఆరెస్సెస్ రామజన్మభూమి ఆందోళనలో చేరిందని ఆయన వివరించారు. మనం ఆ పని పూర్తి చేశాం. ఇక మరిన్ని ఆందోళనలు చేపట్టాలని మనం కోరుకోవడం లేదు’ అన్నారు. అనంతరం ఆయన గ్యానవాపి మసీదు- కాశీ విశ్వనాథ ఆలయం వివాదం గురించి వివరించారు. ఇందుకు సంబంధించి అన్ని వైపుల వారూ ఒక చోట కూర్చుని పరిష్కారం వెతకాలనీ లేదంటే న్యాయవ్యవస్థ అత్యున్నతమైనది గనక కోర్టు నిర్ణయాన్ని ఆమోదించాలనీ పేర్కొన్నారు. ఇస్లాం ఆక్రమణదారులతో భారత్‌కు వచ్చి ఆలయాలను ధ్వంసం చేసిన చారిత్రక నేపథ్యంలో గ్యానవాపి మసీదు వివాదాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చారు.
అయోధ్య, కాశీ, మధుర మందిరం/మసీదు వివాదాలు హిందువులకు అనుకూలంగా పరిష్కరించబడాలనేది బీజేపీ, ఆరెస్సెస్ వైఖరి. ఇదే జరిగితే మిగిలిన వివాదాలను చేపట్టనవసరం వుండదు. మోహన్ భగవత్ ప్రసంగం ఆంతర్యం ఏమంటే బాబరీమసీదు విధ్వంసానికి దారితీసిన ఆందోళనలో ఆరెస్సెస్ పాల్గొన్నది గనక అది విలక్షణమైనది. గ్యానవాపి మసీదు వివాదం కూడా ప్రాధాన్యత కలిగిందే గానీ దానికోసం ఆందోళన అవసరం లేదు. దాన్ని హిందువులు ముస్లిముల మధ్య పరస్పర ఆమోదంతో లేదంటే ఒక కోర్టు నిర్ణయంతో పరిష్కరించాలి. మధురలో ఈద్గా మైదాన్ కృష్ణమందిరం తగాదాకూ ఇదే వర్తిస్తుంది.
నిజంగా జరుగుతున్నదేమిటి?
మోహన్ భగవత్ ప్రస్తుత ప్రసంగం ఆనాటి ప్రసంగం పరిధిలోనే వుంది. రామమందిర ఉద్యమం దానికదే విభిన్నమైందని ఆయన చెబుతున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగిపోయింది గనక మరిన్ని ఆందోళనలు వుండకూడదు. వారణాసి మధుర వివాదాలకు సంబంధించి కోర్టులో వాజ్యాలు నడుస్తున్నాయి. అవి కాకుండా ఇతర చోట్ల మసీదు/మందిరం వివాదాలు వద్దని ఆరెస్సెస్ అధినేత అంటున్నారు. అయితే భగవత్ బోధిస్తున్న దానికి వాస్తవంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్నదానికి మధ్య లోతైన గండి వుంది.
ప్రతి మసీదులోనూ శివలింగాన్ని వెతకాల్సిన పనిలేదని 2020లో ఆయన ప్రసంగం చేసిన తర్వాత వివిధ రాష్ట్రాలలో వివిధ మసీదుల మత స్వభావాన్ని గురించి అనేక లీగల్ వివాదాలు లేవనెత్తబడ్డాయి. దాదాపు 17 వాజ్యాలు నడుస్తున్నాయి. సంబాల్ షాహిఇమామ్ జామా మసీదు గురించీ, అజ్మీర్‌లో షరీఫ్ దర్గా గురించిన వాజ్యాలు… వాటిలో తాజాగా వేసినవే.
భగవత్ ఆంతర్యం ఆర్గనైజర్ సంకేతం
మతపరమైన విభజన రగిలించడం ద్వారా ఎవరూ ‘హిందువుల నాయకుడు’ కాలేరని మోహన్ భగవత్ అన్నారు. ఈ విధంగా చెప్పడం ద్వారా ఆయన రెచ్చగొట్టే కార్యక్రమాలకు పాల్పడవద్దని ఆరెస్సెస్ వెలుపల వున్న చెదురుమదురు వర్గాలను హెచ్చరిస్తున్నారన్నమాట. న్యాయవ్యవస్థలో కొన్ని వర్గాలు మత ప్రదేశాల వివాదాలపై వాజ్యాలను అనుమతిస్తున్నారని భగవత్‌కు తెలుసు. ఇందుకు సంబంధించిన 1991 ప్రార్థనా స్థలాల చట్టం నిబంధనలను విరుద్ధంగా వారు ఉల్లంఘిస్తున్నారు. ఈ న్యాయప్రక్రియ ద్వారా కాశీ మధుర వివాదాలు హిందువులకు అనుకూలంగా పరిష్కారమవుతాయని ఆయన ఆశిస్తున్నారు. న్యాయప్రక్రియపై ఆయన నమ్మకం నిరాధారమేమీ కాదు. ఎందుకంటే అప్పటి ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గ్యానవాపి మసీదు సర్వేను కొనసాగించడానికి అనుమతినిచ్చారని భగవత్‌కు తెలుసు.
ఒక పథకం లేకుండా దేశమంతా మందిరం మసీదు వివాదాలు రగిలించే చిత్తానుసార చర్యలు మోహన్ భగవత్ కోరుకోవడం లేదు. అవి సంబాల్‌లో జరిగినట్టుగా హింసాకాండకు అల్లర్లకు దారితీస్తాయి. చాపకిందనీరులా పాలిస్తూ హిందూత్వ ఎజెండాను ఒక వ్యూహాత్మక రీతిలో ముందుకు తీసుకుపోయేపని ఆర్‌ఎస్‌ఎస్ మోడీ ప్రభుత్వానికి అప్పగించింది. ప్రభుత్వ వ్యవస్థల్లో అనేకం అంతకంతకూ ఎక్కువగా ఆర్‌ఎస్‌ఎస్ పట్టులోకి వస్తుండడంతో వారణాసి మధుర స్థలాలు శాంతియుతంగా చట్టబద్దమైన పద్ధతిలో స్వాధీనం చేసుకోవడం సాధ్యమయ్యేట్టు కనిపిస్తుంది. సరైన పథకం లేని అరాచక చర్యలు ప్రతికూలంగా పరిణమిస్తాయి. ఇక్కడ భగవత్ మౌలిక హిందూత్వ ఎజెండా దెబ్బతినకుండా కార్యాచరణ పథకం రూపొందిస్తున్నారు. ప్రస్తుతానికి మొదట అనుకున్న మూడింటికే కట్టుబడి వుండింది. హిందూత్వ రాజ్యం కుదుటపడిన తర్వాత మిగిలిన ‘చారిత్రక తప్పులు’ సరిదిద్దవచ్చు. ‘నాగరిక న్యాయం కోసం సమరం’ వదలిపెట్టడం లేదని ఆర్‌ఎస్‌ఎస్ అధికార పత్రిక ‘ఆర్గనైజర్’ తాజా సంచిక చూస్తే అర్థమవుతుంది. సంబాల్ గుడిని పున:స్వాధీనం చేసుకోవడమే ముఖచిత్రంగా ప్రచురించింది. పచ్చి రెండునాల్కల ధోరణి/ద్వంద్వనీతి ఇదే.
సుప్రీం కోర్టుకే సాధ్యం
ఈ కారణంగానే 1991 ప్రార్థనా స్థలాల చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ సుప్రీం కోర్టుముందున్న కేసు కీలకంగా మారుతుంది. అలాటి వివాదాలపై అన్ని దిగువ కోర్టుల ముందున్న చట్టపరమైన తగాదాలపై కోర్టు స్టే విధించింది. ఈ రిట్ పిటిషన్లపై నాలుగు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటి వరకూ ప్రభుత్వం ఆ పని చేయకుండా దాటవేస్తున్నది. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందనే దాన్నిబట్టి ఈ విషయంలో బిజెపి -ఆర్‌ఎస్‌ఎస్ వ్యూహం అర్థం చేసుకునే ఆధారం దొరుకుతుంది. ప్రార్థనా స్థలాల చట్టం చెల్లుబాటును సమర్థించడమే గాక గట్టిగా అమలులో పెట్టడం ద్వారా సుప్రీం కోర్టు మాత్రమే దీన్ని మొగ్గలోనే తుంచి వేయగలుగుతుంది.
(డిసెంబర్ 25వ తేదీ సంపాదకీయం)