– మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మేడిగడ్డలో కుంగిన మూడు పిల్లర్లను భూతద్దంలో చూపి, గత ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాలని కాంగ్రెస్ భావిస్తున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. దీనిపై మాజీ మంత్రి హరీశ్‌రావు సమాధానాలకు బిత్తరపోయిన కాంగ్రెస్ పెద్దలు అసెంబ్లీలో ఆయన ప్రసంగానికి అడుగడుగునా ఆటంకాలు సృష్టించారని తెలిపారు. ఆదివారంనాడిక్కడి తెలంగాణ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 72 రోజుల కాంగ్రెస్ పాలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప, కొత్తగా ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు సరిపడా కేటాయింపులు బడ్జెట్‌లో లేవనీ, దీనితో గ్యారంటీల అమలు సాధ్యం కాదని చెప్పకనే చెప్పేశారని ఆరోపించారు. తొమ్మిదేండ్ల తర్వాత రాష్ట్రంలో తిరిగి కరెంటు కోతలు మొదలయ్యాయనీ, రైతుబంధును మూడెకరాల రైతులకు మాత్రమే ఇచ్చారని చెప్పారు. రైతుభరోసా అమలు చేస్తారో లేదో స్పష్టత ఇవ్వాలన్నారు. కాళేశ్వరంపై అత్యన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ల సరఫరా విషయంలో స్పష్టత లేదనీ, వాటిని అమలుచేస్తారో లేదో చెప్పాలని కోరారు. ఆలేరు మెడికల్ కళాశాలను కొడంగల్‌కు తరలించడం పద్దతికాదనీ, చేతనైతే కొత్త మెడికల్ కళాశాలను అక్కడ పెట్టుకోవాలని సూచించారు. వరి ధాన్యంపై క్వింటాలుకు రూ.500 బోనస్ కచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మెన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.