– ప్రగతిశీల కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల నాన్ టీచింగ్, వర్కర్స్ అసోసియేషన్ నాయకుల డిమాండ్
నవతెలంగాణ – ముషీరాబాద్
కేజీబీవీ నాన్ టీచింగ్ సిబ్బంది వేతనాలు పెంచాలని ప్రగతిశీల కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల నాన్ టీచింగ్, వర్కర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. పోగ్రెసివ్ కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ అసోసియేషన్ (ఐఎన్టీయూ అనుబంధం) రాష్ట్ర కమిటీ సమావేశం శనివారం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ ఎల్ పద్మ అధ్యక్షతన విద్యానగర్‌లోని మార్క్స్ భవన్ లో జరిగింది. ఈ సమావేశంలో కేజీబీవీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అరుణ కుమార్, ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సూర్యం పాల్గొని మాట్లాడుతూ… రాష్ట్రంలో ఉన్న 476 కేజీబీవీ పాఠశాలల్లో, 300 కళాశాలల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్ తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెరిగిన ధరలకు వచ్చే వేతనం ఏ కోసాన సరిపోడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేజీబీవీ నాన్ టీచింగ్ అండ్ వర్కర్స్ కుబేసిక్ పే ను నిర్ణయించి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. పని భారం వల్ల అనేక పాఠశాలలో నాన్ టీచింగ్ సిబ్బంది ఉద్యోగాలు వదిలేసుకుని వెళ్తున్నారని, దానివల్ల ఉన్న వాళ్ళ పై భారం పెరిగిందన్నారు. తక్షణమే ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని, కళాశాలలుగా అప్‌గ్రేడ్ అయిన చోట కొత్త నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేజీబీవీలో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత లేదని ఈ సమస్యలను సంబంధిత శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. సిబ్బందికి మెడికల్ ఇస్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, రెగ్యులరైజ్ చేయాలని కోరారు.
మహిళా విద్యాభివద్ధి కోసమై ఏర్పరచిన ఈ పాఠశాలలు మరింత మంచి ఫలితాలు సాధించాలంటే, అందులో పనిచేస్తున్న సిబ్బందికి మంచి వేతనాలు ఉండాలని గుర్తు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు అరుణ, ఏ. అశోక్ సహాయ కార్యదర్శిలు షాహిడా, సైదమ్మ, లక్ష్మి, ఆర్గనైజింగ్ కార్యదర్శి రాధా నాగమ్మ , కోశాధికారి లక్ష్మీనరసమ్మ, వివిధ జిల్లాల రాష్ట్ర కమిటీ సభ్యులు నాగమణి, నరసమ్మ, హసీనా, వీరమణి మౌనిక, బాలమణి, పార్వతమ్మ, శాంతి, యాదమ్మ, సాంబశివుడు, అంజనమ్మ, జంగమ్మ, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.