అదే తడబాటు

The same hesitation– మారని భారత బ్యాటర్ల తీరు
-185కే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్‌
– ఆదుకున్న రిషబ్‌ పంత్‌, జడేజా
– ఆసీస్‌తో సిడ్నీ టెస్టు తొలి రోజు
క్యాలెండర్‌లో ఏడాది మారింది. కానీ గ్రౌండ్‌లో మనోళ్ల ఆట మారలేదు. సిడ్నీ పచ్చిక పిచ్‌పై టీమ్‌ ఇండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఆసీస్‌ పేస్‌ ప్రతాపానికి దాసోహం అయ్యారు. రిషబ్‌ పంత్‌ (40), రవీంద్ర జడేజా (26) మినహా జట్టులో మరో బ్యాటర్‌ పరుగుల వేటలో రాణించలేదు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ లేకుండానే సిడ్నీ సవాల్‌కు సిద్ధమైన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు కుప్పకూలింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 9/1తో ఆడుతోంది.
నవతెలంగాణ-సిడ్నీ

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ ఆఖరు టెస్టు తొలి రోజు టీమ్‌ ఇండియా చతికిల పడింది. పేసర్లకు అనుకూలించే పచ్చిక పిచ్‌పై తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 185 పరుగులకే కుప్పకూలింది. వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ (40, 98 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (26, 95 బంతుల్లో 3 ఫోర్లు), కెప్టెన్‌, టెయిలెండర్‌ జశ్‌ప్రీత్‌ బుమ్రా (22, 17 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) భారత్‌కు ఆ మాత్రం స్కోరు అందించారు. విరాట్‌ కోహ్లి (17), కెఎల్‌ రాహుల్‌ (4), యశస్వి జైస్వాల్‌ (10), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (0), వాషిగ్టన్‌ సుందర్‌ (14), శుభ్‌మన్‌ గిల్‌ (20) నిరాశపరిచారు. ఆసీస్‌ పేసర్లు స్కాట్‌ బొలాండ్‌ (4/31), మిచెల్‌ స్టార్క్‌ (3/49) నిప్పులు చెరిగారు. జశ్‌ప్రీత్‌ బుమ్రా (1/7) మెరుపులతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 9 పరుగులకే ఓ వికెట్‌ కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగుల లోటుతో ఆస్ట్రేలియా రెండో రోజు బ్యాటింగ్‌కు రానుంది.
టాప్‌ విఫలం
టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు ఆశించిన ఆరంభం లభించలేదు. ఓపెనర్‌ కెఎల్‌ రాహుల్‌ (4) ఆదిలోనే వికెట్‌ కోల్పోయాడు. ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (10)ను బొలాండ్‌ స్లిప్స్‌లో పట్టేశాడు. 17 పరుగులకే భారత్‌ ఓపెనర్లను కోల్పోయింది. శుభ్‌మన్‌ గిల్‌ (20, 64 బంతుల్లో 2 ఫోర్లు), విరాట్‌ కోహ్లి (17, 69 బంతుల్లో) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డారు. ఆసీస్‌ పేసర్లను ఆచితూచి ఎదుర్కొన్న ఈ జోడీ.. దూకుడుగా ఆడే ప్రయత్నం చేయలేదు. నాథన్‌ లయాన్‌ మాయజాలంతో గిల్‌ డిఫెన్స్‌ను ఛేదించగా.. విరాట్‌ కోహ్లిని బొలాండ్‌ స్లిప్స్‌లో సాగనంపాడు. గతంలో మాదిరిగానే కోహ్లి స్లిప్స్‌లో క్యాచౌట్‌గా నిష్క్రమించాడు. నిజానికి, ఎదుర్కొన్న తొలి బంతికే కోహ్లి అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. స్లిప్స్‌లో క్యాచ్‌ను ఆసీస్‌ జారవిడటంతో కోహ్లి బతికిపోయాడు. ఒక్కో పరుగే జోడిస్తూ కోహ్లి నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉండగా.. బొలాండ్‌ ఊరించే బంతితో వికెట్‌ పడగొట్టాడు. అప్పటికి భారత్‌ స్కోరు 31.3 ఓవర్లలో 72/4.
పంత్‌, జడేజా ప్రతిఘటన
శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి 40 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన విరాట్‌ కోహ్లి.. లంచ్‌ విరామం తర్వాత రిషబ్‌ పంత్‌తో కలిసి 15 పరుగులు జోడించాడు. ఆ తర్వాత పంత్‌తో జతకట్టిన రవీంద్ర జడేజా (26) ఆసీస్‌ బౌలర్లకు వికెట్‌ నిరాకరించాడు. పంత్‌, జడేజా జోడీ 25 ఓవర్ల పాటు ప్రతిఘటించింది. పంత్‌ సహజశైలికి భిన్నంగా బ్యాటింగ్‌ చేశాడు. 98 బంతుల్లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 40 పరుగులే చేశాడు. జడేజా సైతం వికెట్‌కే ప్రాధాన్యత ఇచ్చాడు. 95 బంతుల్లో మూడు ఫోర్లతో 26 పరుగులే చేశాడు. టీ విరామ సమయానికి భారత్‌ నాలుగు వికెట్లే కోల్పోయింది. లోయర్‌ ఆర్డర్‌ ఫామ్‌లో ఉండటంతో భారత్‌ మెరుగైన స్కోరు చేయగలదమే దీమా మొదలైంది.
పేక మేడలా పడ్డారు
మెల్‌బోర్న్‌ టెస్టులో భారత్‌ డ్రా చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ చివరి సెషన్లో ఏకంగా ఏడు వికెట్లు చేజార్చుకుని కోరి మీరీ ఓటమి చెందింది. సిడ్నీలోనూ అదే కథ పునరావృతం అయ్యింది. చివరి ఆరు వికెట్లను భారత్‌ 22.2 ఓవర్లలోనే కోల్పోయింది. పంత్‌ నిష్క్రమణతో మొదలైన పతనం.. ఎక్కడా ఆగలేదు. నితీశ్‌ కుమార్‌ రెడ్డి (0), వాషింగ్టన్‌ సుందర్‌ (14), ప్రసిద్‌ కృష్ణ (3) నిరాశపరిచారు. టెయిలెండర్లలో కెప్టెన్‌ జశ్‌ప్రీత్‌ బుమ్రా (22, 17 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) విలువైన పరుగులు జోడించాడు. మహ్మద్‌ సిరాజ్‌ (3 నాటౌట్‌) అజేయంగా నిలిచాడు. 72.2 ఓవర్లలో భారత్‌ 185 పరుగులకు కుప్పకూలింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్‌ బొలాండ్‌ (4/31), మిచెల్‌ స్టార్క్‌ (3/49) రాణించారు.
బుమ్రా మొదలెట్టాడు
బ్యాట్‌తో ఆదుకున్న జశ్‌ప్రీత్‌ బుమ్రా.. బంతితో వేట మొదలెట్టాడు. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లోనే ఆసీస్‌ ఓపెనర్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. తొలి రోజు ఆటలో చివరి బంతికి ఉస్మాన్‌ ఖవాజా (2) రెండో స్లిప్స్‌లో దొరకబుచ్చుకున్నాడు. దీంతో 9 పరుగులకే ఆసీస్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. యువ ఓపెనర్‌ శామ్‌ కాన్‌స్టాస్‌ (7 నాటౌట్‌, 8 బంతుల్లో 1 ఫోర్‌) ఓ ఫోర్‌తో దూకుడు చూపించాడు. తొలి రోజు 3 ఓవర్లలో ఆస్ట్రేలియా 9 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో మరో 176 పరుగుల వెనుకంజలో నిలిచింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి శామ్‌ కాన్‌స్టాస్‌ అజేయంగా నిలిచాడు. తొలి రోజు 75.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది.
స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : యశస్వి జైస్వాల్‌ (సి) వెబ్‌స్టర్‌ (బి) బొలాండ్‌ 10, కెఎల్‌ రాహుల్‌ (సి) కాన్‌స్టాస్‌ (బి) స్టార్క్‌ 4, శుభ్‌మన్‌ గిల్‌ (సి) స్మిత్‌ (బి) లయాన్‌ 20, విరాట్‌ కోహ్లి (సి) వెబ్‌స్టర్‌ (బి) బొలాండ్‌ 17, రిషబ్‌ పంత (సి) కమిన్స్‌ (బి) బొలాండ్‌ 40, రవీంద్ర జడేజా (ఎల్బీ) స్టార్క్‌ 26, నితీశ్‌ కుమార్‌ రెడ్డి (సి) స్మిత్‌ (బి) బొలాండ్‌ 0, వాషింగ్టన్‌ సుందర్‌ (సి) అలెక్స్‌ (బి) కమిన్స్‌ 14, ప్రసిద్‌ కృష్ణ (సి) కాన్‌స్టాస్‌ (బి) స్టార్క్‌ 3, జశ్‌ప్రీత్‌ బుమ్రా నాటౌట్‌ 3, ఎక్స్‌ట్రాలు : 26, మొత్తం : (72.2 ఓవర్లలో ఆలౌట్‌) 185.
వికెట్ల పతనం : 1-11, 2-17, 3-57, 4-72, 5-120, 6-120, 7-134, 8-148, 9-168, 10-185.
బౌలింగ్‌ : మిచెల్‌ స్టార్క్‌ 18-5-49-3, పాట్‌ కమిన్స్‌ 15.2-4-37-2, స్కాట్‌ బొలాండ్‌ 20-8-31-4, బ్యూ వెబ్‌స్టర్‌ 13-4-29-0, నాథన్‌ లయాన్‌ 6-2-19-1.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ : శామ్‌ కాన్‌స్టాస్‌ నాటౌట్‌ 7, ఉస్మాన్‌ ఖవాజా (సి) రాహుల్‌ (బి) బుమ్రా 2, ఎక్స్‌ట్రాలు : 0, మొత్తం : (3 ఓవర్లలో ఓ వికెట్‌) 9.
వికెట్ల పతనం : 1-9.
బౌలింగ్‌ : జశ్‌ప్రీత్‌ బుమ్రా 2-0-7-1, మహ్మద్‌ సిరాజ్‌ 1-0-2-0.
హిట్‌మ్యాన్‌పై వేటు
ఊహించిందే జరిగింది. చీఫ్‌ కోచ్‌ గౌతం గంభీర్‌ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఫామ్‌లో లేని కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై వేటు పడింది. సిడ్నీ టెస్టుకు రోహిత్‌ శర్మను పక్కనపెట్టిన గంభీర్‌.. బుమ్రాకు కెప్టెన్సీ పగ్గాలు అందించాడు. టాస్‌కు ముందు ఇరు జట్లు పంచుకున్న టీమ్‌ షీట్‌లో సైతం రోహిత్‌ శర్మ పేరు కనిపించలేదు. సాధారణంగా, జట్టులోని అందరి పేర్లను టీమ్‌ షీట్‌లో పొందుపరుస్తారు. రోహిత్‌ శర్మ పేరు లేకపోవటంతో.. అతడు చివరి టెస్టు జట్టులో అధికారికంగా భాగం కాదు. భారత్‌ తర్వాత టెస్టు ఈ ఏడాది జూన్‌లో ఆడాల్సి ఉంది. దీంతో రోహిత్‌ శర్మ ఐదు రోజుల ఆటలో ఆఖరు మ్యాచ్‌ ఆడేసినట్టేనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తాజా బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో రోహిత్‌ శర్మ తేలిపోయాడు. పెర్త్‌ టెస్టులో ఆడని రోహిత్‌.. ఆడిలైడ్‌లో నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. బుమ్రా సారథ్యంలో భారత్‌.. రోహిత్‌ కెప్టెన్సీలో కంటే మెరుగ్గా కనిపించిందని వ్యాఖ్యాతలు సైతం విమర్శలు చేశారు. చీఫ్‌ కోచ్‌ గౌతం గంభీర్‌ వ్యూహం ప్రకారం జట్టు ప్రణాళికలను రోహిత్‌ మైదానంలో అమలు చేయలేదని మరో ఆరోపణ. మూడు టెస్టుల్లో కలిపి 31 పరుగులే చేసిన రోహిత్‌ శర్మ తీవ్ర ఒత్తిడిలో పడ్డాడు. సిడ్నీ టెస్టు ముంగిట ప్రాక్టీస్‌ సెషన్లోనూ సాధన చేయలేదు. భారత్‌కు వైట్‌బాల్‌లో చిరస్మరణీయ విజయాలు అందించిన హిట్‌మ్యాన్‌ను జట్టు మేనేజ్‌మెంట్‌ మరింత మెరుగైన రీతిలో చూడాల్సిందని మాజీలు అభిప్రాయపడ్డారు.