ఆర్కపల్లి వాగుపై వంతెన నిర్మించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన సర్పంచ్‌

– వంతెన నిర్మాణానికి హామీనిచ్చిన ఎమ్మెల్యే కసిరెడ్డి
నవతెలంగాణ-మాడ్గుల
వాగుపై వంతెన నిర్మాణం లేక దశాబ్దాల కాలంగా గ్రామ ప్రజలమంత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆర్కపల్లి సర్పంచ్‌ ఏర్పుల జంగయ్య ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డిని కోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అంద జేశారు. ఈ సందర్భంగా ఆర్కపల్లి గ్రామానికి నాగార్జునసాగర్‌ హైవే మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నదని గ్రామానికి చెందిన దాదాపు 100 కుటుంబాలకు పైగా వ్యవసాయ భూములు రహదారి సమీపాన ఉండటంతో వాగు దాటలేక రైతులు, కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వాగు దాటలేక రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాన్ని చేరుకోవడానికి వింజమూరు గేటు, సుద్ధపల్లి, ఆసిరెడ్డిపల్లి మీదుగా 15 కిలో మీటర్ల దూరం ప్రయాణించి చేరుకోవాల్సి వస్తుందని ఎమ్మెల్యేకు వివరించారు. గతంలో నాగార్జునసాగర్‌ హైవే నుంచి రవణంపల్లి మీదుగా ఆర్కపల్లి వరకు రోడ్డు నిర్మాణం చేపట్టారని బ్రిడ్జి నిర్మాణం చేపట్టలేదని పలుమార్లు సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధుల దష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదన్నారు. రైతులు ప్రజల ఇబ్బందులను దష్టిలో పెట్టుకుని, వంతెన నిర్మాణం చేపట్టి ఇబ్బందులు తొలగించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే :- ఆర్కపల్లి వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్టు సర్పంచ్‌ జంగయ్య తెలిపారు. వెంటనే సంబంధిత ఏఈతో ఫోన్లో మాట్లాడి వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి ఇష్ట్మెట్‌ వేయాలని ఆదేశించినట్టు జంగయ్య తెలిపారు.