‘నీడల దృశ్యం’ : అనుభూతుల ఊట

'నీడల దృశ్యం' : అనుభూతుల ఊటఏనుగు నరసింహారెడ్డి తెలుగు సాహిత్య లోకంలో పరిచయం అక్కరలేని పేరు. గత ముప్పై ఐదు ఏళ్లుగా రచనా వ్యాసంగం చేస్తున్న అక్షర ప్రేమికుడు. ఇప్పటి వరకు విభిన్న  ప్రక్రియల్లో 15 కు పైగా పుస్తకాలు రాసి, విశిష్టమైన పురస్కారాలు ఎన్నో అందుకోవడం వీరి ప్రతిభకు నిదర్శనం. కవితా పిపాసి అయిన ఏనుగు నరసింహారెడ్డి కలం నుండి  జాలువారిన మరో ఆణిముత్యమే ‘నీడల దశ్యం’ కవితా సంపుటి.
అనుభవాలను, అనుభూతులను అర్థవంతంగా వాక్య నిర్మాణం చేయడంలో దిట్ట. వస్తువును కవిత్వీ కరించడంలో తనకు తానే సాటి. సరళమైన భాషను ప్రయోగిస్తూనే కవిత నిర్మాణంలో గాఢతను ప్రోది చేయడంలో ఈ కవిది ప్రత్యేక శైలి. ఆయన రచనలు వివిధ భాషల్లోకి అనువదించబడి ప్రఖ్యాతిగాంచాయి.
ఏనుగు నరసింహారెడ్డి వెలువరించిన ‘నీడల దృశ్యం’ అనే కవితా సంపుటి ఎన్నో భావోద్వేగాల ఊట. చదువుతున్న కొద్దీ తెలియని అనుభూతి యేదో మనసునిండా పరచుకొని తన్మయత్వానికి గురిచేస్తుంది.
‘దేవతలు గూడా’ కవితను ఈ పుస్తకానికి ప్రారంభ కవితగా పెట్టడం సముచితంగా ఉంది. ప్రతి ఒక్కరికి తల్లి జీవితాన్ని ఇస్తే…. భార్య జీవితాన్ని నడిపిస్తుంది. పిల్లలు తనువు ముగించే వరకు తోడుంటారు. ఈ మూడు దశలను కవి అధ్యయనం చేశాడు. చేస్తున్నాడు. వారి పాత్రల్లో వారు ఒదిగి… ఎదుగుతున్న తీరును నైపుణ్యంగా చెప్పారు. ”ఊరికి దూరం కాటికి దగ్గర/ నా వైద్యానికి అంత ఖర్చోద్దురా” అని కన్నతల్లి అన్నప్పుడు…. ”వంట అసలే రానివాడివి/ హోటల్‌నైనా సరిగ్గా తిను” ఆసుపత్రి పడక మీద భార్య పలికిన మాటలు…. చదువుతుంటే పఠితల కళ్ళు జలధారలు కావాల్సిందే. ఇలా కవిత కిందికి నడుస్తున్నా కన్నీటి ఊట పెరుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. నుమాయిష్‌లో అందమైన/ అందమైన ఆటబొమ్మలను చూసి/ గంతులేసిన చిన్నపిల్లకు మన జేబు గుర్తొచ్చి/ ‘ఇప్పుడొద్దులే నాన్నా’ అని సర్దుకున్నప్పుడు/ పిల్లలే మనకన్నా ఎదిగిపోయారా అని/ కళ్లల్లో పొంగే జలపాతాన్నేమంటారు” అంటాడు కవి. ఇక చివరి పాదాలతో కవిత తారాస్థాయికి చేరుతుంది. ”అన్నిసార్లూ కష్టాలే/ మనల్ని కరగదీస్తాయని చెప్పలేం/ దేవతలుగూడా సమయానుసారంగా/ మనల్ని ఏడిపించగలగుతారు” అంటూ ముగుస్తుంది. కవిత చదవడం పూర్తయిన తర్వాత పాఠకుడు కొన్ని నిమిషాలు మౌనస్థితిలోకి వెళ్ళిపోతాడు. దేవతలుగా మారిన ఆడవారి ప్రేమానురాగాలను తలచుకుంటూ కృతజ్ఞతలు ప్రకటిస్తాడు.
కుటుంబ ఉన్నతికోసం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, జీవితాన్ని త్యాగం చేసిన మాతృమూర్తి వ్యథను ఆర్తిగా మలచిన కవిత ‘గుడ్డికొంగ’. ”నీళ్ళనూ బియ్యాన్నీ/ ఏ నిష్పత్తిలో గాలిస్తే/ రాళ్ళ బాధలను అడుగుపట్టించవచ్చో తెలిసిన/ మహా నేర్పరి ఆమె”, ”మూడు ఇటుకల అంచులోపల/ భగ్గుమనకుండా మండుతుండే/ కనిపించని జ్వాల ఆమె” అంటూ అమ్మలోని అనుభవం, నేర్పరితనంతో మొదలయ్యే ఈ కవిత ముగింపులోకొచ్చేసరికి మనసును కలుక్కుమనిపిస్తుంది. ”తలంత బలగం/ తలా ఓ దిక్కుకు తరలిపోతే/ నెలల మీద చెట్లు మార్చే/ రెక్క విరిగిన పక్షి ఆమె/ అన్ని కాలాలూ శిశిరపక్షాలే/ ఇపుడామె/ ఏ చెట్టు మీద ఎంతకాలం/ ఉండొచ్చో అర్థంకాని/ గుడ్డికొంగ”.
”నాయిన పిట్టయి/ నా వెంట తిరుగుతున్నది” అంటూ నాన్నను తడుముకుంటాడు. గొడుగుతోనూ, కవచకుండలాలతోను పోలుస్తూ… మదినిండా ఉబుకుతున్న నాన్న అనుబంధాన్ని అక్షరాల బొక్కెనతో తోడుకుంటాడీ కవి.
ఈ సంపుటిలో మరో ఆణిముత్యంలాంటి కవిత ‘సంసిద్ధం’. రేపటి జీవితానికి పొంచియున్న ప్రమాదాన్ని పసిగట్టి ముందుగానే కవి చేస్తున్న హెచ్చరిక. దిగులును దులుపుకొని, నిరాశగాయాలకు మందు రాసుకొని సమాజం తల ఎత్తుకొని ముందుకు సాగాలనే ఆకాంక్ష కొట్టొచ్చినట్లు కన్పడుతోంది.
చైతన్యాన్ని ప్రోది చేసే వెలుగురేఖ లాంటి కవిత ‘పగటిరాత్రి’. ”సెలయేటినైనా ఈదాలి/ మహా ప్రవాహమైనా ఈదాలి/ కడలినైనా ఈదాలి/ ఈది తీరాల్సిన వాడివి/ ఈదకుండా మునిగిపోవడం ముమ్మాటికీ తప్పే”. మనిషి పుట్టినది మొదలు తనువు చాలించే వరకు పోరాడకుంటే జీవించలేడు. ఎన్నో సమస్యలు, మరెన్నో అవరోధాలు అడుగడుగునా ఎదురొస్తాయి. గమనాన్ని వెనక్కి నెట్టాలని తహతహలాడ్తాయి. ఏదేమైనా ముసురుకున్న కారుచీకట్లలోంచి వెలుగురేఖను ఒడిసిపట్టాలనే తపన ఈ కవితనిండా జిగేల్‌మంటోంది.
ఇలాంటి భావనే ‘లాంగ్‌జంప్‌’ అనే కవితలోనూ గోచరిస్తుంది. ”కాలాలు మారినా నిలబడాలి/ పక్షాలు వాదాలు/ మార్చుకున్నా ఎదురీదాలి/ కొండ ఎదురైన చోట/ ఈదడం తప్పు/ ఊపిరి బిగపట్టుకొని కదా/ లాంగ్‌జంప్‌ చేయాల్సింది”. బలమైన ఆశావాదాన్ని పురికొల్పుతుంది.
నల్లచట్టాల మీద రైతులు చేసిన పోరాటాన్ని, వీరోచిత గాథల్ని ఉన్నతంగా ఆవిష్కరించిన కవిత ‘కన్నీటి మంట’.
తొవ్వలన్నీ మూసుకుపోతే/ కొత్త తొవ్వ ఒకటి వేయాల్సిందే అంటున్న ఈ కవితా సంపుటిలో వేల నాదాలున్నాయి… వేవేల నినాదాలున్నాయి. ప్రత్యేక కలల అద్ధం భళ్ళుమంటున్న ఆవేదనలున్నాయి. మరో విషయమేమిటంటే మాండలికం, నుడికారం ఈ కవి కలముకున్న అదనపు ఆకర్షణ.
”నేలను శోధిస్తాను, చరిత్రను తవ్వుతాను, అంతరంగాన్ని తరచి చూస్తాను, జీవితపు తట్టల్ని మోస్తాను. అప్పుడప్పుడు దిగులు మేఘాలు ఆవరించినా… మళ్ళీ తవ్వకంలో మునిగిపోతాను” అంటున్న ఈ కవి పాఠకులకు పదికాలాలు గుర్తుండిపోతాడు. పూలగుత్తుల పరిమళంలా కవిత్వ సువాసనలు వెదజల్లుతూనే వుంటాడు.
(ఈ నెల 27న ‘నీడల దృశ్యం’ కవితా సంపుటికి రొట్టమాకురేవు అవార్డు అందుకుంటున్న సందర్భంగా)
– రాచమళ్ళ ఉపేందర్‌, 9849277968