– అంబేద్కర్ రాజ్యాంగంపై సంఫ్ పరివార్ అక్కసు
– దానిని తిరగరాసేందుకు ప్రయత్నం
– అందుకే మూడింట రెండొంతుల మెజారిటీ కోసం తంటాలు
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా 370 స్థానాలు, కూటమిగా 400 స్థానాలు గెలుచుకుంటామని బీజేపీ నేతలు జోస్యం చెబుతున్నారు. అయితే సెఫాలజిస్టుల విశ్లేషణ ఆధారంగా కమలనాధులు ఈ అంచనాలు వేయడం లేదు. కేవలం రాజకీయ కారణాలతోనే ఈ విధంగా ప్రచారం చేసుకుంటున్నారు.
‘400కు పైమాటే’ అనే నినాదాన్ని కర్నాటకకు చెందిన బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే సమర్ధించుకున్నారు. ఆ సంఖ్యకు చేరుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన చెప్పారు. రాజ్యాంగాన్ని సవరించాలని పార్టీ భావిస్తోందని, అలా చేయాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమని తెలిపారు. ‘ఈసారి 400 కంటే ఎక్కువ స్థానాలు గెలవాలని మోడీ చెప్పారు. 400 స్థానాలు ఎందుకు గెలవాలి? ప్రస్తుతం లోక్‌సభలో మాకు మూడింట రెండు వంతుల మెజారిటీ ఉంది.
అయితే రాజ్యసభలో మాకు అంత బలం లేదు. అక్కడ మాకు మెజారిటీ తక్కువగా ఉంది. అదీకాక రాష్ట్ర ప్రభుత్వాలలో కూడా మాకు కావాల్సిన మెజారిటీ లేదు’ అని చెప్పుకొచ్చారు. రాజ్యాంగ సవరణ చేయాలన్నా, రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలను మార్చాలన్నా ప్రస్తుతం ఉన్న మెజారిటీ సరిపోదని ఆయన గుర్తు చేశారు. అణచివేతల నుండి హిందువులను కాపాడడానికి రాజ్యాంగాన్ని తిరగరాయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
అయితే హెగ్డే ప్రకటనతో ఏకీభవించడం లేదని, దానిని తాము సమర్ధించడం లేదని బీజేపీ నాయకత్వం చెబుతోంది. రాబోయే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ నిరాకరించే అవకాశం ఉన్నదని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ కారణంతోనే ఆయనకు మొండిచేయి చూపుతారా లేదా అనే విషయాన్ని అటుంచితే ఒక విషయం మాత్రం సుస్పష్టంగా ఉంది. అలాంటి ప్రకటనలపై బీజేపీ ఎన్నడూ విముఖత ప్రదర్శించలేదు. 2017లో కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా హెగ్డే ఇదే విషయాన్ని చెప్పారు. అయినా ఆయనకు 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టిక్కెట్ ఇచ్చారు.
రహస్య అజెండాలో భాగమే : రాహుల్
రాజ్యాంగాన్ని మార్చాలంటే తమకు 400 స్థానాలు కావాలంటూ బీజేపీ ఎంపీ బహిరంగంగా చేసిన ప్రకటన ప్రధాని నరేంద్ర మోడీ, సంఫ్‌ు పరివార్ రహస్య అజెండాలో భాగమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. మోడీ, బీజేపీల అంతిమ లక్ష్యం బాబా సాహెబ్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడ మేనని ఆరోపించారు. వారు న్యాయాన్ని, సమానత్వాన్ని, పౌర హక్కులను, ప్రజాస్వామ్యాన్ని ద్వేషి స్తారని తెలిపారు. సమాజాన్ని విభ జించడం, భావ ప్రకటనా స్వేచ్ఛను పరిమితం చేయడం, స్వతంత్ర సంస్థలను అణచివేయడం ద్వారా గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థను సంకుచిత నియంతృత్వంగా మార్చాలని ప్రయత్నిస్తు న్నారని, ప్రతిపక్షాన్ని నిర్మూలించాలని కుట్ర పన్నుతున్నారని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్యాంగంపై ఆర్‌ఎస్‌ఎస్ అక్కసు
భారత ప్రజాస్వామ్య విలువలను కాలరాసేందుకు బీజేపీ రెండంచెల వ్యూహాన్ని అమలు చేస్తోంది. బీజేపీ మాతృసంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్ మొదటి నుండీ రాజ్యాంగ హక్కులను వ్యతిరేకిస్తూనే ఉంది. 1998లో ఎన్డీఏలో భాగంగా బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు అది చేసిన మొట్టమొదటి పనుల్లో ఒకటి…రాజ్యాంగ సమీక్ష కోసం కమిటీని నియమించడం. అయితే వెంకటా చలయ్య కమిషన్ నివేదికను అమలు చేయలేదు. రాజ్యాంగాన్ని సవరించేందుకు జరుపుతున్న ప్రయత్నాలపై తీవ్ర ప్రతిఘటన ఎదురు కావడంతో దాని అమలును పక్కన పెట్టారు.
2000వ సంవత్సరంలో ఆర్‌ఎస్‌ఎస్ అధిపతిగా కె.సుదర్శన్ నియమితులైనప్పుడు భారత రాజ్యాంగం పశ్చిమ దేశాల విలువలపై ఆధారపడిందని, కాబట్టి దానిని మత గ్రంథాల ఆధారంగా తిరగరాయాలని చెప్పారు. ‘ఈ రాజ్యాంగం వల్ల దేశ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. దీనిని 1935వ సంవత్సరపు భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా రాశారు. కాబట్టి రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేయడానికి పోరాడే విషయంలో మనం ఏ మాత్రం సిగ్గు పడకూడదు’ అని అన్నారు.
అంతా నాటకమే
2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజ్యాంగ ఉపోద్ఘాతం, రాజ్యాంగంలో లౌకికతత్వం, సోషలిస్ట్ అనే పదాల వినియోగం వివాదాస్పద అంశాలుగా మారాయి. దేశానికి నూతన రాజ్యాంగం అవసరమని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చీఫ్ వివేక్ దేవ్‌రారు అభిప్రాయం వ్యక్తం చేసి ఎక్కువ కాలం కాలేదు. అప్పుడు కూడా ప్రధాని మోడీ ఆయన వ్యాఖ్యలతో అధికారికంగా విభేదించారు. బీజేపీ నేతల నుండి, ప్రభుత్వ అధికారుల నుండి ఇలాంటి వివాదాస్పద ప్రకటనలు వస్తుంటే మరోవైపు వాటితో తమకేమీ సంబంధం లేదని బీజేపీ నుండి లేదా దాని నేతృత్వంలోని ప్రభుత్వం నుండి వివరణలు వస్తున్నాయి. అయితే ఇదంతా నాటకమేనని విమర్శకులు అంటున్నారు.
స్వేచ్ఛకు విఘాతం
దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఆచూకీ కన్పించడం లేదు. ప్రధాన స్రవంతి మీడియా ఇప్పటికే ప్రభుత్వ అనుకూల కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. అది సర్కారు వాణిగా మారిపోయింది. ప్రముఖ టీవీ ఛానల్స్, వార్తా పత్రికలు ప్రభుత్వ బాకాలుగా తయారయ్యాయి. స్వతంత్ర గళాల పరిధి తక్కువగా ఉండడంతో అవి తమ అభిప్రాయా లను పూర్తి స్థాయిలో వినిపించ లేకపోతున్నాయి. ఇక దేశంలో మత స్వేచ్ఛకు కూడా విఘాతం కలుగుతోంది. అనేక అంతర్జాతీయ సూచికలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఏ మత జాతీయతావాద సంస్థ అయినా ప్రజాస్వామిక స్వేచ్ఛలను వ్యతిరేకిస్తుంది. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ కూటమి ఇందుకు మినహా యింపు కాదు. ఆ దిశగానే రాజ్యాంగాన్ని తిరగ రాయాలని ఆ కూటమి భావిస్తోంది. పాకిస్తాన్, శ్రీలంకలో ప్రజాస్యామ్యం ఏ విధంగా అణచి వేతకు గురవుతోందో మన దేశంలో కూడా అలాగే జరుగుతోంది. మన దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని బీజేపీ వృద్ధ నేత ఎల్‌కే అద్వానీ వ్యాఖ్యానించి ఎక్కువ కాలం కాలేదు. దేశంలోని ప్రజాస్వామ్య అంగాలన్నీ హిందూ జాతీయ తావాదులకు దాసోహమయ్యాయి. మైనారిటీల ప్రజాస్వామిక హక్కులకు భంగం కలిగించేందుకు, సమాజంలోని బలహీన వర్గాలపై దాడి చేసేందుకు పాలకులు తమకు పూర్తి అధికారం కట్టబెట్టారని వారు జబ్బలు చరుచుకుంటున్నారు.
బీజేపీ చేసిందేమిటి?
బీజేపీ అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు గడిచాయి. ఈ కాలంలో రాజ్యాంగంలోని ముఖ్యమైన విలువలైన ప్రజాస్వామ్యం, సమానత్వం కోసం ఆ పార్టీ చేసిందేమిటి? ప్రజాస్వామ్య వ్యవస్థకు చెందిన మూల స్తంభాలను, ఈడీ, సీబీఐ, ఐటీ, ఈసీ వంటి రాజ్యాంగ సంస్థలను ప్రభుత్వం తన చెప్పుచేతల్లో ఉంచుకుంది. ఆ ప్రభుత్వంలో సైతం కేవలం ఒకే ఒక వ్యక్తి హవా నడుస్తోంది. న్యాయ వ్యవస్థను వివిధ స్థాయిల్లో వేర్వేరు యంత్రాంగాలు బలహీనపరుస్తున్నాయి. హక్కుల కార్యకర్త ఖయిద్ నిర్బంధమే దీనికి ఉదాహరణ. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ గత నాలుగు సంవత్సరాలుగా విచారణకు కూడా రాలేదు.