సృష్టి రహస్యం!

సృష్టి రహస్యం!నిద్దట్లో దుప్పట్లో విత్తనం చెట్టవుతున్న కల
విత్తనం దాచాక, భూమిలో ఏం జరుగుతుంది
మాయా మర్మమా? సష్టి రహస్యమదే!
విత్తనం నాటిన మర్నాడు సూర్యుడు మా
పశువుల కొట్టం పైనుండి ఇంట్లోకి తొంగి
చూసాడో లేదో బాణంలా కొట్టంలోకి పరిగెత్తి చూశాను
విత్తనం పాతిన నేల ఏమీ మాట్లాడ్డం లేదు
మౌనంగా ఉంది నా లేత మనసుకు నిరాశ వేసింది
కొట్టం పక్కనే రాజుగాడి పెరట్లో బొప్పాయి
చెట్టు విరక్కాసేసింది! ఆ విత్తనం వాడే ఇచ్చాడు
మా అరుగు గోడల మీద గొంగళి పురుగులు
గూడు కట్టుకుని కొద్దికాలం అజ్ఞాతవాసం
తర్వాత సీతాకోక చిలుకల్లా పట్టాలు పుచ్చుకుని
ఎగిరిపోడం నాకు తెల్సు! అదీ ఓ రహస్యమే!
సూర్యుడు నేనూ, ఎన్ని రోజులో తెలీదు
ముఖాముఖి తలపడి, నా విత్తనం నేలపై రోజూ
నీళ్ళు పోయడం కూడా ఐన తర్వాత విత్తనం
దాగిన చోట ఒక బంగారు ఉదయం, మట్టికి
పచ్చటి రెండు రెమ్మల గొడుగు పుట్టింది!
ఆ ఉద్విగ క్షణాలు మనసును బరువెక్కించి
కాసేపు విహంగంలా గాల్లో తిప్పాయి…
చూస్తే ఆ మొక్క ఊపిరి గట్టిగా వదిలితే ఎగిరి
పోతుందేమోనన్నంత సున్నితంగా నిలుచుంది మట్టిపై…
ఎంతటి మహాకాయుడైనా, మహావక్షమైనా
ముందు పుట్టేది ఇలాగే అని తెలిసి ఆశ్చర్య
మేసింది కానీ ఆ మట్టి లోపల, నీరు విత్తనం
కలిసి ఏం జరిగింది ఈ పచ్చప్రాణి ఎక్కడి నుండి ఊడిపడింది?
అదే నా చిట్టి బుర్రకి అందని సష్టి రహస్యం కామోసు!
( బాలల దినోత్సవం )
– భీమవరపు పురుషోత్తమ్‌, 9949800253