– ప్రజా సమస్యలపై పోరాడే నాయకుడు జహంగీర్‌ను గెలిపించండి
– సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-అర్వపల్లి
ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రయివేట్‌పరం చేస్తూ, ప్రజలపై భారాలు మోపుతూ, దేశ సమైక్యత సమగ్రతను దెబ్బ తీస్తున్న బీజేపీని దేశవ్యాప్తంగా చిత్తుగా ఓడించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలని చూస్తున్న మతతత్వ బీజేపీకి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రంలోని శ్రీరామ్‌ఫంక్షన్‌హాల్‌లో సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండి.జహంగీర్‌ను గెలిపించాలని కోరుతూ బుధవారం పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెరుపల్లి మాట్లాడుతూ.. ప్రభుత్వరంగ సంస్థలు ఉంటేనే దేశం అభివృద్ధిలో ముందుకు పోతుందన్నారు. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కార్పోరేట్ శక్తులకు కారుచౌకగా అమ్ముతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగం ఉండాలంటే దేశంలో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. కేంద్రం అనుసరిస్తున్న నూతన ఆర్థిక విధానాల ఫలితంగా ధరలు విపరీతంగా పెరిగి నిత్యావసర సరుకులను సామాన్య ప్రజలు కొనలేని దుస్థితి ఏర్పడిందన్నారు. మరోపక్క ప్రశ్నించే వారిపై, ఎదిరించే వారిపై, హక్కులను అడిగేవారిపై నిర్బంధాలు.. తప్పుడు కేసులు పెడుతూ భయబ్రాంతులకు గురి చేస్తూ జైళ్లలో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీని అన్ని వర్గాల ప్రజలు ఒక్కటై ఓడించాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఓటు అడిగే నైతికహక్కు, విలువలు లేవన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా అభివృద్ధి కోసం సీపీఐ(ఎం) అనేక పోరాటాలు చేసిందన్నారు. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాలతో కొట్లాడుతున్నామని చెప్పారు. సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఎండి జహంగీర్ మాట్లాడుతూ.. ఈ నియోజకవర్గ సమస్యలపై, ప్రజల అవసరాలపై సమగ్ర అవగాహనతో ఉన్న తనను గెలిపించాలని కోరారు. అన్ని రంగాల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, పార్లమెంట్‌లో ప్రజల పక్షాన ప్రశ్నించాలన్నా అది ప్రజల పక్షాన పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థులకే సాధ్యమవుతుందని చెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మీ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కోలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, చెరుకు ఏకలక్ష్మి, ప్రజాసంఘాల రాష్ట్ర నాయకులు కోటరమేష్, జగదీష్, పిట్టలరవి, భూపతి వెంకటేశ్వర్లు, ములకలపల్లి రాములు, సోమన్న, మధు తదితరులు పాల్గొన్నారు.