– జిల్లా వ్యవసాయ అధికారిణి ముండ్లపాటి విజయనిర్మల
నవతెలంగాణ – బోనకల్
రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన రసీదులను పంట కాలం పూర్తయ్యేవరకు భద్రపరుచుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ముండ్లపాటి విజయనిర్మల కోరారు. మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో పత్తి, జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట పంటలను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా క్షేత్ర సందర్శనలో రైతులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. పత్తి సాగుకి నేలలో తగిన పదును వున్నప్పుడు మాత్రమే విత్తనాలను విత్తుకోవాలన్నారు. 60 మి.మీ వర్షపాతం నమోదు అయినప్పుడే పత్తి సాగుకి నేల అనుకూలంగా ఉంటుందన్నారు. అదేవిధంగా విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు తప్పకుండా రశీదు పొందాలన్నారు. విత్తన కొనుగోలు రశీదును, విత్తన ప్యాకెట్‌ను పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపరుచుకోవాలన్నారు. రశీదును భద్రపరుచుకోవడం ద్వారా జన్యుస్వచ్ఛత లోపాల వల్ల లేదా మొలక శాతం తక్కువైనప్పుడు తగిన పరిహారం కోరే హక్కు రైతుకు ఉంటుందన్నారు. పచ్చిరొట్ట పైర్లు జనుము, జీలుగ సాగు ద్వారా నేల సారాన్ని పెంపొందించడంతో పాటు రసాయన ఎరువులపై పెట్టె పెట్టుబడి ఖర్చు కొంతమేర తగ్గించవచ్చునన్నారు. పచ్చిరొట్ట పైర్లు సాగు ద్వారా కలుపు మొక్కల పెరుగుదలను నిరోధించి, నేల భౌతిక స్థితి మెరుగుపడి నీరు ఇంకే గుణం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సర్వసుద్ది సరితా, వ్యవసాయ విస్తరణ అధికారి బద్దల కార్తీక్, రైతులు తదితరులు పాల్గొన్నారు.