నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ను లాటరీ ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు వెంటనే స్వాధీనపరచాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సయ్యద్ హశం, పట్టణ కార్యదర్శి ఎండి సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం దొడ్డి కొమురయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. 2017లో రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ పట్టణానికి 552 ఇండ్లు నిర్మాణం చేపట్టారని వారు తెలిపారు. డ్రైనేజీ, విద్యుత్తు మంచినీటి సదుపాయం అంతర్గత రోడ్ల నిర్మాణం లేకపోవడంతో లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేసినప్పటికీ స్వాధీనం చేయడంలో విఫలమయిందని ఆరోపించారు. 2023 ఫిబ్రవరి 22న డ్రా ద్వారా ఎంపిక చేసి నేటికీ 17 నెలలు పూర్తి అయినప్పటికీ లబ్ధిదారులకు స్వాధీనపరచడంలో గత ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైనా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సరికాదని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉండడం వలన ఉపయోగంలో లేక శిథిలావస్థకు చేరి ప్రజాధనం దుర్యోగం అవుతుందని, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విధులు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి విచారణ చేసి అర్హత కలిగిన పేదలను గుర్తించి వారి లో నుండి లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. అట్టి లబ్ధిదారులకు ప్రభుత్వం వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించి స్వాధీన పరచాలని డిమాండ్ చేశారు. లేనియెడల లబ్ధిదారులతో కలిసి కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కుంభం కృష్ణారెడ్డి, అద్దంకి నరసింహ, సలివొజు సైదాచారి తదితరులు పాల్గొన్నారు.