– రెండో టెస్టులో పాక్ ఓటమి
మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియాలో పాకిస్థాన్ పర్యటనకు 28 సంవత్సరాలు. ఒక్క డ్రా లేదు, ఒక్క విజయం లేదు. వరుసగా 16 టెస్టులో పరాజయాలు. ఇదీ పాక్ జట్టుకు కంగారూ గడ్డపై ఎదురైన ట్రాక్ రికార్డు. తాజాగా ఆసీస్‌తో మెల్‌బోర్న్ టెస్టులో పాకిస్థాన్ ఓటమి చెందింది. నాలుగు రోజుల్లోనే ముగిసిన టెస్టులో ఆస్ట్రేలియా 79 పరుగుల తేడాతో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. 317 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 67.2 ఓవర్లలోనే 237 పరుగులు చేసింది. షాన్ మసూద్ (60, 71 బంతుల్లో 7 ఫోర్లు), ఆఘా సల్మాన్ (50, 70 బంతుల్లో 6 ఫోర్లు), బాబర్ ఆజామ్ (41, 79 బంతుల్లో 4 ఫోర్లు) మెరిసినా.. ఆసీస్ పేసర్ల ధాటికి పాక్ నిలువలేదు. కెప్టెన్ పాట్ కమిన్స్ (5/49) ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగగా.. మిచెల్ స్టార్క్ (4/55) నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (4), ఇమామ్ ఉల్ హాక్ (12) విఫలమైనా.. మిడిల్ ఆర్డర్‌లో మసూద్, బాబర్, షకీల్ (24), మహ్మద్ రిజ్వాన్ (35)లు మెరిశారు. కానీ ఆ తర్వాత లోయర్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. ఆమర్ జమల్ (0), అఫ్రీది (0), హమ్జా (0)లు చేతులెత్తేశారు. దీంతో పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 237 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా వరుస ఇన్నింగ్స్‌ల్లో 318, 262 పరుగులు చేయగా.. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 264 పరుగులే చేసింది. మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో ఆసీస్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. పది వికెట్ల ప్రదర్శన చేసిన పాట్ కమిన్స్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు సాధించాడు. ఆసీస్, పాక్ మూడో.. డెవిడ్ వార్నర్ వీడ్కోలు టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీలో ఆరంభం కానుంది.