సిరీస్‌ చేజారె..!

సిరీస్‌ చేజారె..!– బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ ఆసీస్‌ సొంతం
– ఆరు వికెట్ల తేడాతో సిడ్నీలో ఘన విజయం
– 3-1తో భారత్‌పై కంగారూల సూపర్‌ విక్టరీ
బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ టీమ్‌ ఇండియా చేజారింది. దశాబ్ద కాలంగా ఆసీస్‌పై తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన భారత్‌.. కొత్త ఏడాదిని ఓటమితో మొదలెట్టింది. బుమ్రా లేని బౌలింగ్‌కు పస లేకపోవటంతో సవాల్‌తో కూడిన లక్ష్యాన్ని ఆసీస్‌ అలవోకగా ఛేదించింది. ఆరు వికెట్ల తేడాతో సిడ్నీ టెస్టులో ఘన విజయం సాధించింది. 3-1తో బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది.
నవతెలంగాణ-సిడ్నీ

ఆస్ట్రేలియా ఎట్టకేలకు సాధించింది. ఐసీసీ వన్డే, టెస్టు చాంపియన్‌గా కొనసాగుతున్న కంగారూలను సుమారు దశాబ్ద కాలంగా ఊరిస్తోన్న బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీని అందుకుంది. సిడ్నీ టెస్టులో భారత్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా.. 3-1తో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. 162 పరుగుల ఛేదనలో ఉస్మాన్‌ ఖవాజా (41, 45 బంతుల్లో 4 ఫోర్లు), ట్రావిశ్‌ హెడ్‌ (34 నాటౌట్‌, 38 బంతుల్లో 4 ఫోర్లు), బ్యూ వెబ్‌స్టర్‌ (39 నాటౌట్‌, 34 బంతుల్లో 6 ఫోర్లు) రాణించారు. 27 ఓవర్లలోనే ఆసీస్‌ లాంఛనం ముగించింది. మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టిన ఆసీస్‌ పేసర్‌ స్కాట్‌ బొలాండ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ఐదు టెస్టుల్లో 32 వికెట్లు పడగొట్టిన పేస్‌ దళపతి జశ్‌ప్రీత్‌ బుమ్రా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు అందుకున్నాడు.
అలవోకగా ఛేదన
162 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా అలవోకగా ఛేదించింది. ఓపెనర్లు ఉస్మాన్‌ ఖవాజా (41), శామ్‌ కాన్‌స్టాస్‌ (22, 17 బంతుల్లో 3 ఫోర్లు) దూకుడుగా ఆడారు. కాన్‌స్టాస్‌ కొత్త బంతిపై విరుచుకుపడ్డాడు. దీంతో ఆరుకు పైగా రన్‌రేట్‌తో ఆసీస్‌ పరుగులు పిండుకుంది. కాన్‌స్టాస్‌, మార్నస్‌ లబుషేన్‌ (6), స్టీవ్‌ స్మిత్‌ (4) వికెట్లతో యువ పేసర్‌ ప్రసిద్‌ కృష్ణ భారత శిబిరంలో కాస్త ఉత్సాహం రేపాడు. కానీ ట్రావిశ్‌ హెడ్‌ (34 నాటౌట్‌), బ్యూ వెబ్‌స్టర్‌ (39 నాటౌట్‌) భాగస్వామ్యం ఆసీస్‌ను ముందంజలో నిలిపింది. వెన్ను నొప్పితో రెండో రౌండ్‌ మధ్యాహ్నం నుంచి మైదానంలో అడుగుపెట్టని కెప్టెన్‌ జశ్‌ప్రీత్‌ బుమ్రా.. ఆసీస్‌ ఛేదనలో బంతి అందుకోలేదు. దీంతో నాయకుడిగా పేస్‌ దళం ఆసీస్‌ను ఆశించిన స్థాయిలో ఇరకాటంలో పెట్టలేదు. హెడ్‌, వెబ్‌స్టర్‌ 53 బంతుల్లోనే 58 పరుగులు జోడించి లాంఛనం ముగించింది.
బొలాండ్‌ సిక్సర్‌
ఆసీస్‌ పేసర్‌ స్కాట్‌ బొలాండ్‌ (6/45) ఆరు వికెట్లు పడగొట్టాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 157 పరుగులకే కుప్పకూలింది. ఓవర్‌నైట్‌ స్కోరు 141/6తో మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌ చివరి నాలుగు వికెట్లను 16 పరుగులకే కోల్పోయింది. రవీంద్ర జడేజా (13, 45 బంతుల్లో 2 ఫోర్లు), వాషింగ్టన్‌ సుందర్‌ (12, 43 బంతుల్లో 1 ఫోర్‌) ప్రతిఘటించలేదు. వేగంగా పరుగులు చేయటంలోనూ విఫలం అయ్యారు. సిరాజ్‌ (4), బుమ్రా (0), ప్రసిద్‌ కృష్ణ (1 నాటౌట్‌) నుంచీ మెరుపులు లేవు. దీంతో 39.5 ఓవర్లలో భారత్‌ 157 పరుగులకు కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌ నాలుగు పరుగుల ఆధిక్యంతో కలిపి.. ఆసీస్‌కు 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. విరాట్‌ కోహ్లి (6), జైస్వాల్‌ (22), రాహుల్‌ (13), జడేజా, నితీశ్‌ (4), సుందర్‌ నిరాశపరచగా.. రిషబ్‌ పంత్‌ (61) అర్థ సెంచరీతో భారత్‌ను మెరుగైన స్థితిలో నిలిపిన సంగతి తెలిసిందే.
స్కోరు వివరాలు :
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 185/10
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ : 181/10
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : 157/10
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ : శామ్‌ కాన్‌స్టాస్‌ (సి) వాషింగ్టన్‌ (బి) ప్రసిద్‌ కృష్ణ 22, ఉస్మాన్‌ ఖవాజా (సి) పంత్‌ (బి) మహ్మద్‌ సిరాజ్‌ 41, మార్నస్‌ లబుషేన్‌ (సి) జైస్వాల్‌ (బి) ప్రసిద్‌ కృష్ణ 6, స్టీవ్‌ స్మిత్‌ (సి) జైస్వాల్‌ (బి) ప్రసిద్‌ కృష్ణ 4, ట్రావిశ్‌ హెడ్‌ నాటౌట్‌ 34, బ్యూ వెబ్‌స్టర్‌ నాటౌట్‌ 39, ఎక్స్‌ట్రాలు : 16, మొత్తం : (27 ఓవర్లలో 4 వికెట్లకు) 162.
వికెట్ల పతనం : 1-39, 2-52, 3-58, 4-104.
బౌలింగ్‌ : మహ్మద్‌ సిరాజ్‌ 12-1-69-1, ప్రసిద్‌ కృష్ణ 12-0-65-3, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 2-0-10-0, వాషింగ్టన్‌ సుందర్‌ 1-0-11-0.