కాంట్రాక్ట్‌ అధ్యాపకుల సర్వీసు క్రమబద్ధీకరించాలి

కాంట్రాక్ట్‌ అధ్యాపకుల సర్వీసు క్రమబద్ధీకరించాలి– ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల సమస్యలు పరిష్కరించాలి
– సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి వినతి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల సమస్యలు పరిష్కరించి, కాంట్రాక్ట్‌ అధ్యాపకుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ఎమ్మెల్సీ ఏ నర్సిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ గెజిటెడ్‌ జూనియర్‌ లెక్చరర్స్‌ (475) సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ వీ శ్రీనివాస్‌, డాక్టర్‌ కుప్పిశెట్టి సురేష్‌లు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలోని 412 ప్రభుత్వ జూనియర్‌ కళాశాల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలనీ, ప్రతినెలా స్కాలర్‌షిప్పులు విద్యార్థులకు అందేలా చూడాలని కోరారు. రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33కి పెరిగినందున ఇంటర్‌ విద్యను బలోపేతం చేస్తూ, జిల్లా ఇంటర్‌ విద్యా పర్యవేక్షకుల పోస్టులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో ఖాళీగా ఉన్న నాన్‌ టీచింగ్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలనీ, మరుగుదొడ్లు, ప్రహరీగోడల నిర్మాణం చేపట్టాలని కోరారు. పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు కేపీ శోభన్‌బాబు, మహిళా కార్యదర్శులు సంగీత, విశాలాక్షి పాల్గొన్నారు.