– కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, ఫౌండేషన్ చైర్మెన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
– ఫౌండేషన్ ఆధ్వర్యంలో 11 రోజులు కొనసాగిన కంటి వైద్య శిబిరం
– 2500 మందికి కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ
– 150 మందికి కంటి శుక్లాల సర్జరీ, 1600 మందికి కంటి అద్దాలు పంపిణీ
నవతెలంగాణ-ఆమనగల్
కల్వకుర్తి నియోజకవర్గంలోని పేద ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ఐక్యత ఫౌండేషన్ సేవలు కొనసాగుతాయని ఫౌండేషన్ చైర్మెన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. వివిధ రకాల కంటి జబ్బులతో బాధపడుతున్న వారికోసం ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో 11 రోజులుగా కొనసాగుతున్న కంటి వైద్య శిబిరం సోమ వారం ముగిసింది. నియోజకవర్గంలోని వెల్దండ సమీపంలో నిర్వహించిన ఈవైద్య శిబిరం ముగింపు సమావేశంలో ఫౌండేషన్ చైర్మెన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ ప్రాంతంలో ఉన్న నిరుపేద కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని తన ఫౌండేషన్ సేవలు కొనసాగుతాయని అన్నారు. ఈనెల 19 వ తేదీ నుంచి ప్రారంభమైన కంటి వైద్య శిబిరం నిర్విరామంగా 11 రోజుల పాటు కొనసాగినట్టు ఆయన వెల్లడించారు. ఈ వైద్య శిబిరంలో వివిధ రకాల కంటి జబ్బులతో బాధపడుతున్న 2500 మందికి పైగా పరీక్షలు నిర్వహించి వారికి కావలసిన మందులను ఉచితంగా అంద జేసినట్టు ఆయన తెలిపారు. అదేవిధంగా కంటి శుక్లాలతో బాధపడుతున్న 150 మందికి కంటి శుక్లాల సర్జరీ చేయించినట్టు ఆయన చెప్పారు. దృష్టి లోపం ఉన్న 1600 మందికి ఉచితంగా కంటి అద్దాలను అంద జేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. కంటి ఆపరేషన్లు అవసరమైన 260 మందిని శంకర నేత్రాలయ చెన్నై బేస్ హాస్పిటల్ కు రెఫర్ చేసినట్లు ఆయన తెలిపారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వైద్య శిబిరం విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
-ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులు మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యం కోసం ఇంత పెద్ద ఎత్తున వైద్య శిబిరాన్ని నిర్వహించి కంటి జబ్బులతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్య సేవలు అందించిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సేవలను అభినందించారు. అనంతరం ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ గౌడ్, ఫౌండేషన్ సభ్యులు రచ్చ శ్రీరాములు, నరేందర్ గౌడ్, కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మల్లయ్య, రమేష్ నాయక్, కొండల్, యూసఫ్, రఘు, కొండల్ రెడ్డి, హసన్, గణేష్, మల్లేష్, శేఖర్, శ్రీపతి, లాలు, శ్రీను, మహేష్, కళ్యాణ్, భాస్కర్, మల్లేష్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.