– ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
– మధ్యాహ్న ఉచిత భోజనం, చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-జూబ్లీహిల్స్/బేగంపేట
తమ వయసును సైతం లెక్కపెట్టకుండా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సీనియర్ సిటిజన్స్ సేవలు అనేకమందికి స్పూర్తినిస్తాయని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్‌నగర్ డివిజన్ లోని బీకేగూడ పార్క్ వద్ద శ్రీనివాస సమాజ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న మిత భోజన కార్యక్రమాన్ని, చలివేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. పలువురికి బోజనాలు వడ్డించి, తాను భోజనం చేసి ఎంతో రుచికరంగా, నాణ్యతతో వంటలు చేయించడం పట్ల నిర్వహకులను అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 13 సంవత్సరాల నుంచి ప్రతీ సంవత్సరం వేసవిలో రెండు నెలల పాటు సీనియర్ సిటిజన్స్‌తో పాటు పలువురు దాతల సహకారంతో పేదలకు ఉచితంగా భోజ నం అందిస్తూ వారి ఆకలిని తీరుస్తున్నారని ప్రశంసించారు. రోజుకు సుమారు 300 మందికి భోజనాలు సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. ఇవే కాకుండా హెల్త్ క్యాంప్ లు, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ వంటి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సనత్ నగర్ లోని సీనియర్ సిటిజన్స్ అనేకమందికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. సీనియర్ సిటిజన్స్ చేపట్టే అనేక కార్యక్రమాలకు ఇప్పటి వరకు తన సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ వచ్చానని, ఇక ముందు కూడా అదేవిధంగా తన సహాయ సహకారాలు అందిస్తానని ప్రకటించారు. సీనియర్ సిటిజన్స్ సేవా కార్యక్రమాలతో పాటు వారి ఆరోగ్యం విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, సనత్ నగర్, అమీర్ పేట డివిజన్ ల బీఆర్‌ఎస్ అద్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, హన్మంతరావు, చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ పార్ధసారధి, సీనియర్ సిటిజన్స్ సభ్యులు మాణిక్ రావ్, కష్ణారెడ్డి, సహదేవ్ గౌడ్, రాంమూర్తి, ప్రసాద్, డాక్టర్ శ్యాం సుందర్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు అశోక్ యాదవ్, కర్ణాకర్ రెడ్డి, రాజేష్ ముదిరాజ్, కూతురు నర్సింహ, ఆకుల రాజు, భూపాల్ రెడ్డి, మాధవరావు, పియూష్ గుప్తా, టిల్లు తదితరులు పాల్గొన్నారు.