టి డయాగస్టిక్‌ సెంటర్ల సేవలను పూర్తిగా వినియోగించుకోవాలి

– ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన టి డయాగస్టిక్‌ సెంటర్‌ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. గురువారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలోని టి డయాగస్టిక్‌ సెంటర్‌లో 25 శాతం మాత్రమే సేవలందిస్తున్నదని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టెస్టులు చేసేందుకు కూడా ఇబ్బందులున్నాయని చెప్పారు. అక్కడి నుంచి నమూనాలను పంపించడం కూడా ఇబ్బందిగా ఉంటోందన్నారు. తక్షణమే పరీక్షలు చేసేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని సూచించారు. రాష్ట్రంలో దాదాపు ఏడు లక్షల మందికి ఈహెచ్‌ఎస్‌ ఉందనీ, మోడల్‌ స్కూళ్లు, గురుకుల తదితర ఉపాధ్యాయులు 40 వేల మంది వరకుంటారనీ, వారికి కూడా వర్తింపజేయాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ టి డయాగస్టిక్‌ సెంటర్లను బలోపేతం చేస్తామని తెలిపారు. మోడల్‌ స్కూళ్లు, గురుకుల ఉపాధ్యాయులకు ఈహెచ్‌ఎస్‌ వర్తింపజేసే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.