ఛత్తీస్‌గడ్‌లో 36 మందిని కాల్చి చంపడం దుర్మార్గం : మాస్‌లైన్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఛత్తీస్‌గడ్‌లో ఎన్‌కౌంటర్‌ పేరుతో 36 మందిని పోలీసులు కాల్చిచంపిన మృత్యుకాండను సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ ఖండించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నారాయణపూర్‌ దంతెవాడ సరిహద్దు నేందురు తులతులి అడవుల్లో మావోయిస్టులు సమావేశం అయినట్టు సమాచారంతో కూంబింగ్‌ చేసి ఎన్‌కౌంటర్‌ పేరుతో కాల్చేశారని, ఇది దుర్మార్గపు చర్య అని విమర్శించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించినట్టు కగార్‌ ఆపరేషన్‌ ఎన్‌కౌంటర్‌గా స్పష్టమవుతున్నదని పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో 180 మందికిపైగా బూటకపు ఎన్‌కౌంటర్‌ చేశారని తెలిపారు. చట్టప్రకారం అరెస్టు చేయకుండా, విచారణ ద్వారా శిక్షించకుండా ఇలా చంపడం రాజ్యాంగ వ్యతిరేకమని విమర్శిం చారు. ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్‌ చేశారు. చట్ట వ్యతిరేక చర్యలను రాజ్యాంగబద్ధంగా శిక్షించాలని కోరారు. రాజ్యం ఇలా మూకుమ్మడి హత్యాకాండకు పూనుకోవడం దుర్మార్గపు చర్య అని విమర్శించారు.