– ఇజ్రాయిల్ సైన్యం తీరుపై విమర్శలు
గాజా : హమాస్ బంధించిన ఇజ్రాయిల్‌కు చెందిన ముగ్గురు తమకు సహాయం అందించాలంటూ తెల్ల జెండా ఊపుతున్నా పట్టించుకోకుండా ఇజ్రాయిల్ సైన్యం కాల్చివేసింది. సొంత ప్రజలనే కాల్చివేసిన ఇజ్రాయిల్ సైన్యం దుశ్యర్యపై తీవ్ర విమర్శలు రావడంతో తాజాగా వివరణనిచ్చింది. ఉత్తర గాజాలోని షిజాయాప్రాంతంలో ఈ నెల 15న జరిగిన ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు ఇజ్రాయిల్ సైన్యం పేర్కొంది. ‘బిస్లమక్ బ్రిగేడ్ 17వ బెటాలియన్‌కు చెందిన సైనికుడు హమాస్ సభ్యులుగా భ్రమించి ముగ్గురిని కాల్చివేశాడు. ఆ కాల్పుల్లో తొలుత ఇద్దరు మరణించగా.. మూడో వ్యక్తి సమీప భవనంలోకి పారిపోయాడు. వెంటనే కాల్పులు ఆపాలని అక్కడే ఉన్న కమాండర్ సైనికులను ఆదేశించాడు. ఆ వ్యక్తి ఎవరనేది గుర్తించాలని చెప్పాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ భవనం నుంచి ‘సహాయం చేయండి. వారు నాపై కాల్పులు జరుపుతున్నారు’ అని హిబ్రూ భాషలో అరుపులు వినిపించాయి. కాల్పులు నిలిపేయాలని కమాండర్ మరోసారి ఆదేశాలు జారీ చేశాడు. ఆ తర్వాత మూడో వ్యక్తి భవనం నుంచి బయటకు వచ్చి, సైన్యం దిశగా వచ్చే ప్రయత్నం చేశాడు. పక్కన ట్యాంక్ నుంచి చప్పుడు వస్తుండటంతో కమాండర్ ఆదేశాలు సైనికులకు వినిపించలేదు. దాంతో అక్కడున్న ఇద్దరు సైనికులు ఆ మూడో బందీపై కాల్పులు జరిపారని’ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ దర్యాప్తు తెలిపింది. ఆ ముగ్గురు బందీల ఒంటిపై చొక్కాలు లేవని, బలగాలకు దగ్గరగా వస్తున్నప్పుడు వారిలో ఒకరు తెల్ల జెండాను ఊపారని, బలగాలకు వారు సరిగా కనిపించకపోవడమే కాల్పులకు దారితీసిందని పేర్కొంది.
దక్షిణ గాజాపై దాడులు ఉధృతం
ఇజ్రాయిల్ పాలస్తీనాపై దాడులను ఉధృతం చేసింది. ఇప్పటికే గాజా జనాభాలో 85 శాతం (సుమారు 23 లక్షలు) మంది నిరాశ్రయులయ్యారు. దక్షిణ గాజాపై వైమానిక, భూతల దాడులను తీవ్రతరం చేసినట్లు శుక్రవారం ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్) తెలిపింది. దీంతో నివాసాలను వీడిన వేలాది మంది పాలస్తీనియన్లు రఫా సరిహద్దుకు చేరుకున్నారని, ఈ ప్రాంతమంతా రద్దీగా మారిందని ఐక్యరాజ్యసమితి (యుఎన్) తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 1.20కి ఇజ్రాయిల్ డమాస్కస్ సమీపంలోని పలు ప్రాంతాలపై వైమానిక దాడులు జరిపిందని సిరియాకి చెందిన సనా న్యూస్ ఏజన్సీ తెలిపింది. డమాస్కస్ విమానాశ్రయంపై దాడి జరిగిందని బ్రిటన్‌కి చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ నివేదిక తెలిపింది. ఇటీవల దాడుల కారణంగా రెండు నెలల పాటు విమానాశ్రయంలో నిలిచిపోయిన సేవలు గురువారం తిరిగి ప్రారంభమయ్యాయని, అదే రోజు దాడి జరిగిందని పేర్కొంది. డమాస్కస్ గ్రామీణ ప్రాంతంలోని సిరియన్ ఎయిర్ డిఫెన్స్ శిబిరం, దక్షిణ ప్రావిన్స్ ఆఫ్ స్వీడియాలోని సైనిక శిబిరాలపై దాడులు జరిగినట్లు తెలిపింది. ఈ దాడుల్లో ఇద్దరు సైనికులు గాయపడినట్లు ప్రకటించింది.