గోనెసంచుల కొరత వెంటనే పరిష్కరించాలి

– తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్న నిర్వాహకులు
– 15 రోజులైనా రైతుల దగ్గర ధాన్యం కొనడం లేదు
– రాశుల దగ్గర రైతుల పడి గాపులు
– వ్యకాస నాయకుడు సత్యం
నవతెలంగాణ-యాచారం
ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర విపరీతంగా గోనె సంచుల కొరతతో రైతులంతా తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు సిహెచ్‌ సత్యం ఆరోపించారు. మంగళవారం యాచారం మండల పరిధిలోని చింతపట్ల ధాన్యం కొనుగోలు దగ్గర రైతులతో మాట్లాడారు. అనంతరం సత్యం మాట్లాడుతూ రైతులు ఆరు గాలం కష్టపడి పంటను పండించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం రాశుల దగ్గర రైతులంతా పడి కాపులు కాస్తున్నారని తెలిపారు. తరుగు పేరుతో నిర్వా హకులు రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ధా న్యం కొనుగోలు కేంద్రాల దగ్గర నిర్వాహకులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. పదిహేను రోజుల నుంచి రైతుల దగ్గర ధాన్యం తీసుకోవడంలో కొనుగోలు నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. వానవొస్తే రైతుల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. ఇప్ప టికైనా ధాన్యం కొనుగోలు నిర్వాహకులు రైతులకు సరిపడా గోనెసంచులను అందించి ప్రభుత్వ నిబంధనలు మేరకు ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.