
– దుర్గంధంతో ప్రజల ఇబ్బందులు
నవతెలంగాణ – బొమ్మలరామారం
బొమ్మలరామారం మండలంలోని చీకటిమామిడి గ్రామంలో చికెన్ షాప్ యాజమానులు రహదారి పక్కనే వ్యర్థాలను పడేస్తున్నారు. మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఉన్నటువంటి పెట్రోల్ బంకు సమీపంలో చికెన్ వ్యర్థాలను కొంతకాలంగా రోడ్డు పక్కనే వేస్తుండడంతో ఆ ప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతుంది. అటువైపు వెళ్లే ప్రయాణికులు,రైతుల ఇబ్బంది పడుతున్నారు. ప్రతిరోజు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణ చేస్తున్నప్పటికీ చికెన్ షాప్ యజమానులు నిర్లక్ష్యంగా రోడ్డుపై పారబోస్తున్నారు. దీనివల్ల రోగాలు రావడమే కాకుండా రోడ్డుపై కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతుండడంతో ప్రయాణం ప్రమాదకంగా మారిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.