వాతావరణ న్యాయం సూత్ర పరిధిలోనే పరిష్కారం వుండాలి

– కాప్‌ 29 చర్చల్లో భారత్‌ డిమాండ్‌
– సంపన్న దేశాలు ముందుకొచ్చి పేద దేశాల ఇబ్బందులను తగ్గించాలని సూచన
బాకూ : పేద, వర్ధమాన దేశాల్లో వాతావరణ మార్పులపై చేపట్టే కార్యాచరణకు మద్దతునిచ్చే కొత్త వాతావరణ నిధి ఏర్పాటనేది ‘వాతావరణ న్యాయం’ అనే సూత్రం పరిధిలోనే కనుగొనాల్సి వుంటుందని భారత్‌ పేర్కొంది. పేద దేశాల ఇబ్బందులను తగ్గించే విషయంలో సంపన్న దేశాలు నాయకత్వ పాత్రను చేపట్టాలని డిమాండ్‌ చేసింది. వర్ధమాన దేశాలకూ తగిన కార్బన్‌ వాటాను ఇవ్వాలని కోరింది. ఈ మేరకు బాకూలో జరుగుతున్న కాప్‌ 29 చర్చల్లో భారత్‌ వైఖరిని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్‌ సింగ్‌ స్పష్టం చేశారు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు ఏకపక్షంగా తీసుకునే నియంత్రిత వాణిజ్య చర్యలు వర్ధమాన దేశాల్లో వాతావరణ కార్యాచరణకు అవరోధం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు కొత్తగా ఏర్పాటు చేయబోయే ఆర్థిక నిధి (ఎన్‌సిక్యుజి)ని వాతావరణ న్యాయం సిద్ధాంతం ప్రాతిపదికనే కనుగొనాలని ఆయన పేర్కొన్నారు. వర్ధమాన దేశాల అవసరాలు, ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని విస్పష్టమైన రీతిలో బహృత్తరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. తద్వారా సుస్థిర అభివృద్ధికి, దారిద్య్ర నిర్మూలనకు వారి నిబద్ధతను ప్రకటించాలన్నారు. పేద దేశాల్లో వాతావరణ కాంక్షలను పెంపొందించేందుకు హరిత సాంకేతికతలు, నిధులు ఉచితంగా అందించడం తప్పనిసరని మంత్రి పేర్కొన్నారు. ఇందుకు విరుద్ధంగా, కొన్ని సంపన్న దేశాలు ఏకపక్షంగా చర్యలు తీసుకుంటూ వాతావరణ కార్యాచరణను మరింత క్లిష్టతరం చేస్తున్నాయని విమర్శించారు. ఇలా తలెత్తినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం తామున్నామని చెప్పారు. ఇటువంటపుడు పేద, వర్ధమాన దేశాలకు సాంకేతికతలు, నిధులు అందించే విషయంలో ఎలాంటి అడ్డంకులు, అవరోధాలు వుండరాదని, వాటన్నింటినీ ఛేదించుకోవడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. గ్లోబల్‌ వార్మింగ్‌ 1.5 డిగ్రీల సెల్సియస్‌ కన్నా పెంచరాదని గగ్గోలు పెట్టినా ప్రస్తుతం ప్రపంచం దాన్ని అధిగమిస్తోందని అన్నారు. అందువల్ల సంపన్న దేశాలు తమ లక్ష్య సాధన కోసం చర్యలు తీసుకోవడమే కాకుండా వర్ధమాన దేశాలు కూడా అభివృద్ధి చెందేందుకు వీలుగా తగిన మొత్తంలో కర్బన ఉద్గారాల వాటాను అందచేయాల్సి వుందని చెప్పారు.