– తాజాగా మరో యువతితో ప్రేమాయణం
– నిందితున్ని కఠినంగా శిక్షించాలి : బాధితులు
నవతెలంగాణ కాశీబుగ్గ
గ్రేటర్ వరంగల్ 14 డివిజన్ సుందరయ్య నగర్‌కు చెందిన మద్ది రాజేష్(26) హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పని చేస్తూ ఒకరికి తెలియకుండా మరొకరిని ఇలా ముగ్గురిని వివాహం చేసుకుని వేరువేరుగా కాపురాలు పెట్టాడు. కాగా, ఇప్పుడు మరో యువతితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. దాంతో మోసపోయామని తెలిసిన బాధిత మహిళలు, వారి కుటుంబ సభ్యులు రాజేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం సుందరయ్య నగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధిత మహిళ తల్లిదండ్రులు నిడిగొండ సునిత, శ్యాంసుందర్ మాట్లాడారు. సుందరయ్య నగర్‌కు చెందిన రాజేష్ హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పని చేస్తూ 2022 ఫిబ్రవరిలో నగరంలోని చార్‌బౌలి ప్రాంతానికి చెందిన సుమప్రియను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆమెపై మోజు తీరిన తర్వాత అదే ఏడాది మే నెలలో హైదరాబాద్‌కు చెందిన శ్రావణిని రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెతో కొన్నాళ్లు కాపురం చేసిన రాజేష్.. సుందరయ్య నగర్‌కు వచ్చి అదే ప్రాంతానికి చెందిన నిడిగొండ సారికతో ప్రేమాయణం సాగించి 2024 ఫిబ్రవరిలో హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో మూడో వివాహం చేసుకున్నాడు. మూడు పెండ్లిండ్లు చేసుకున్న రాజేష్.. తెలివిగా ముగ్గురిని వేరువేరుగా మూడు చోట్ల అద్దెకు ఉంచాడు. తాజాగా ఇప్పుడు కరుణ అనే అమ్మాయితో తిరుగుతుండటంతో సుమప్రియ, సారిక తల్లిదండ్రులు ఆరా తీయగా రాజేష్ గతంలో చేసుకున్న పెండ్లిండ్ల గురించి తెలిసింది. సోమవారం సుందరయ్య నగర్‌కు వచ్చిన రాజేష్‌ను సారిక తల్లిదండ్రులు నిలదీయగా వారి కండ్లు కప్పి అక్కడనుండి పరారయ్యాడు. దాంతో రాజేష్‌పై ఇంతేజర్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సారిక తల్లిదండ్రులు సునిత, శ్యామ్ తెలిపారు. ప్రేమ, పెండ్లిండ్ల పేరుతో అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న రాజేష్‌పై కఠిన చర్యలు తీసుకొని మరో అమ్మాయికి అన్యాయం జరగకుండా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు.