– మద్యం మత్తులో దారుణం
నవతెలంగాణ – బోనకల్
మద్యం మత్తులో భార్యను కొడుతుండగా అడ్డొచ్చిన తల్లిని తనయుడు హత్య చేసిన ఘటన ఖమ్మం జిల్లా బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన తాటికొండ పాపయ్య కూతురు మంజు ఇటీవల ప్రసవించింది. కాగా, శనివారం మంజుకి 21వ రోజును పాపయ్య కుటుంబ సభ్యులు జరిపారు. ఈ సమయంలో పాపయ్య మద్యం మత్తులో ఉన్నాడు. రాత్రి పది గంటల సమయంలో భార్య మణితో గొడవ పడి కొట్టాడు. దాంతో అతని తల్లి మార్తమ్మ (70) కోడలిని కొట్టొద్దని అడ్డుపోయింది. మద్యం మత్తులో మరింత రెచ్చిపోయిన పాపయ్య.. తల్లి గొంతు పట్టి గోడకి అదిమి పైకి లేపాడు. ఆ వెంటనే కింద పడేసి కొట్టాడు. ఆ సమయంలో అడ్డువచ్చిన కుమారుడిని, భార్యను కూడా కొట్టాడు. దాంతో వారు భయంతో దూరంగా ఉండిపోయారు. ఓ అర్ధగంట అనంతరం మార్తమ్మ దగ్గరికి వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే ఆర్‌ఎంపీని పిలిపించి పరీక్షించగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు గుర్తించారు. ఆ తర్వాత పాపయ్య స్వయంగా పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి తన తల్లిని తన కుమారుడు, భార్య హత్య చేశారని తనకు రక్షణ కావాలని ఫోన్ చేశాడు. వెంటనే స్పందించిన బోనకల్ ఎస్‌ఐ కడగండ్ల మధుబాబు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమార్తె శాంతి కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు పాపయ్యపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ కొడగండ్ల మధుబాబు తెలిపారు.పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బ్రాహ్మణపల్లి తీసుకువచ్చారు. అయితే పాపయ్య పోలీసులు అదుపులోనే ఉన్నాడు. తల్లికి తలకొరివి పెట్టవలసి రావటంతో పోలీసుల బందోబస్తు మధ్యనే ఆదివారం బ్రాహ్మణపల్లిలో తల్లికి తలకొరివి పెట్టాడు.