ఆ ఇద్దరూ చింతనాపరులు ప్రకతిని, పాటను ప్రేమించారు.
రాజ్యాన్ని, రాజ్యహింసను నిరసించిన వాళ్లే.. దొరలను దొర గడీలను ఎదిరించిన వాళ్లే.. జన్మంతా జనం కోసం పరితపించిన వాళ్లే.. వాళ్లను ప్రజల నుంచి దూరం చేసేందుకు జైలు గోడలు మొలిచాయి. పాటల పరుగుకు పగ్గాలు వేసినా.. సంకెళ్లు తొడిగినా… జైలు గోడలు మాకడ్డుకాదని నిరూపించిన నికార్సైన ప్రజా కళాకారులు కామ్రేడ్ సుద్దాల హనుమంతు, అరుణోదయ నాగన్న.
వారి పాటలను, వాళ్ల జీవితా లను, ఈ సమాజంతో సంభాషిస్తు న్నారు. మాటలను ఆపవచ్చు కానీ.. పాటను ఆపగలరా? అని ప్రశ్నిస్తున్నా రు. తెలంగాణలో పాట ఒక ఆయుధం, దాన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. మనం ఇప్పుడు వాళ్ల గొంతుకను విందాం! వాళఓ్ల కవనముతో కరచాలనం చేద్దాం! కవి, కళాకారుడు, రచయిత జీవించే రచించే స్వేచ్ఛ కోసం ఉద్యమించాల్సిన నేటి ఈ తరుణంలో….
”చీకటి రోజుల్లో …గానాలు ఉండవా..?
ఉండకేం.. చీకటి రోజుల గురించే గానాలు” అన్న బ్రేక్ట్ మాటలు రుజువు పరిచిన వాళ్లు విప్లవాన్నే కలగని, విప్లవాన్నే గానం చేసిన వారు చావు అంచుకుపోయినా పాటను ప్రాణంగా బతికినవారు విప్లవ సాంస్కతిక రథానికి కాడెడ్లయి కదం తొక్కిన వారు, విప్లవనావకు చుక్కానై సాంస్కతిక సైనికులుగా సాగుతున్న వారు, విప్లవం ఎంత సున్నితమైందో, ఎంతో సహజమైందో, ఎంత అనివార్యమైందో.. అనుభ వించినవారు. విప్లవ ప్రతిఘాతకులు ఎంతటికైనా తెగిస్తారని ముందే గ్రహించిన వారు వాళ్లకు తగిలిన గాయాలే.. గేయాలై, పల్లవులై ప్రజల్లో నేటికీ పాటలై ప్రతిధ్వనిస్తున్నాయి.
వాళ్ల జీవితం ”ముండ్లకంపపై ఆరేసుకున్న అంగవస్త్రం లాంటి అనుభవ పుటలను కదిపితే.. ప్రజాపాటల పరిమళాలు కోకోల్లలుగా వెదజల్లు తాయి, ఎదలను ఆకర్షిస్తాయి. వలల్లోంచి, మగ్గాల్లోంచి, సుత్తి కొడవళ్ల నుంచి, నాగేటి చాళ్ల నుంచి, మూల మూలల్లోంచి, అణచివేతల్లోంచి ఆర్తితో.. ఆత్మీయంగా పొంగి వచ్చే పాల బుగ్గల తడి, ఆరని పల్లె భాషతో గుండె ఘోషను వినిపిస్తున్నాయి. అందుకే వాళ్లు ప్రజాపాటలకు సంతకమయ్యారు. మరణము లేని పాటలు నేటికీ ప్రజల నోళ్లల్లో నానుతూనే ఉన్నాయి. తన పాటల వారసత్వాన్ని నేటికీ కొద్ది మంది అయినా కొనసాగిస్తున్నారు. అందులో నాగన్న ఒకరు.
ప్రజా పాటల యుద్ధంలా.. సుద్దాల హను మంతు వారసుడిగా.. పాలబుగ్గల జీతగాడుగా.. అరుణోదయ నాగన్న చిన్ననాటి నుండే వారి పాటలు వింటూ పెరిగాడు. సుద్దాల హను మంతు ఎన్ని కళలలో ఆరితేరిన వారో… అన్ని కళలను నాగన్న కూడా అబ్బినాయి. బుర్రకథ, యక్షగా నాలు, పల్లెసుద్దులు, వీధి నాటకా లను విరివిగా ప్రదర్శించారు. చిన్ననాటి నుండి కళల మీద ప్రీతి, పేదరికపు బాధ, పుట్టింది నిరుపేద గీత కార్మిక కుటుంబం, తాతల నాటి నుండి కల్లుగీత వత్తి, వ్యవసాయకూలి తప్ప సంపాదించిన ఆస్తులు లేవు. లక్ష్మమ్మ, పాపయ్యలకు పరకాల నాగయ్య జన్మించాడు. చిన్ననాటి నుండే చిల్లిగవ్వ లేదు. రెండు రెక్కలు, రెండు మేకల్ని మేపుకుం టూ.. తాడి చెట్లెక్కుతూ..పొట్టనింపుకునే జీవితం.
ఆ సమయంలోనే ఆకాశంలో సగంనువ్వు, సగం నేను అన్నట్లుగా లక్ష్మితో నాగన్న వివాహం జరిగింది. కొడుకు అజరు, పాటమ్మ ఒడిలోనే పెరిగాడు. ప్రజలే పాలుపట్టారు. ప్రజలే పెంచి పెద్ద చేశారు. నిరంతరం సభలు, సమావేశాలు, వెంటాడే పొలీసుల భయంబడిలో బతికాడు. నాగన్న ఎప్పుడూ బడికి పోయి చదువుకున్నది లేదు. తండ్రి భాగోతం కళాకారుడు. పాటల వారసత్వం నాగన్న, లక్ష్మి ఇరువురు చరణమైతే.. పల్లవిగా అజరు ముగ్గురు జనం పాటలను పల్లవిస్తూ.. కలవరించేవారు. పార్టీ కోసం, ప్రజల కోసం తప్పా చింతన లేని చిన్నకుటీరం. నేటికీ గ్రామ పునాదుల్లో కులం పునాదులు బలంగా ఉన్న ఊరు. ఆది రెడ్డీ, దొరల ఆధిపత్యం. గౌండ్లోలు కూడా రెడ్ల పక్కన బంతి భోజనాలు కలిసి చేస్తార్రా! అంటూ కన్నెర్ర చేసి, గళ్ళాపట్టి, బంతి భోజనం నుండి బజారుకీడ్చుండు. ఆ సంఘటన సలసల మసిలే కసితో.. కండ్లెర్రజేసిండు. అప్పుడే.. ఎర్రజెండా రెపరెపలు తన గుండెకు హత్తుకున్నాయి. ఆ జెండా నీడలోనే.. కంఠానికి పదును పెట్టుకున్నాడు. కంఠానికి తన రాగానికి ఎక్కడో .. ఏదో చైతన్యం తగిలి భగ్గున మండినట్లనిపించింది అప్పుడే.. నాగన్న నీ గొంతులో గోదారిలోయ పాటలతో పసిపాపలను సైతం ఊయల లూగించింది.
కూలికి పోయిన చోటల్లా తన పాటకు తోటి కూలీలే కోరస్ ఇచ్చే వాళ్లు. ఇలా కోరస్ ఇచ్చిన కూలీలే కొడవళ్లు పట్టుకొని పోరు నడిపిన సంఘటనలు చూసినప్పుడు పాటకుండే పవర్ తెలిసింది. ఆ పాటనే ఆయుధంగా మలుచు కున్నాడు. ఆ పాటలను రాజ్యం వెంటాడింది. పోలీసుల నిఘా.. కనబడితే కాల్చివేతలు, అప్పుడు నాగన్నమీద నిషేధం, పాట మీద నిషేధం, అడుగడుగున నిర్బంధం, దుష్ప్రచారం, ఏమాత్రం పొసగని గాలి వాదనలు, కల్పిత ఆధారాలతో ప్రజా గొంతులను పగబట్టడం నాటి నుండి నేటి వరకు జరుగుతున్నవే.. ఇన్ని గాయాలను గొంతులో మోస్తున్న కవి, గాయకుడు నాగన్నను చూసినప్పుడు ‘పాట కోసం ఉరికంబాన్ని ముద్దాడిన కెన్సారోవివా’లా కనిపిస్తాడు. ఒక యోగిలా.. విరాగిలా.. సాధువులా.. సమర యోధునిలా.. బతకడం ఎందరికీ సాధ్యమవు తుంది? వీటన్నింటినీ భూషణంలా ధరించిన నిర్వేశపు నిత్యఅన్వేషి అరుణోదయ నాగన్న. కమ్యూనిజానికి కంఠాన్ని ధారబోసినవాడు, అవమానాలను అవార్డుగా స్వీకరించినవాడు, అమరుల త్యాగాన్ని కర్ణభేరిలో కరగబోసినవాడు, గోదారిలోయను గొంతులు ఒంపుకున్నవాడు, అన్నిరకాల ఆధిపత్యాలను ప్రశ్నిస్తున్నవాడు. సమ సమాజాన్ని స్వప్నిస్తున్నవాడు, కంపగూటిలో కాకిలా బతుకుతూ.. కోకిల గొంతును ఆవిష్కరించిన వారు. నూతన లోకాన్ని నిరంతరం ఆలపిస్తున్న వాడు, నాగన్న జీవితం ఒక పాటతోనో, ఒక పాఠ్యాంశంతోనో కొలువలేము. అతనిది ఒక సుదీర్ఘ పోరాట చరిత్ర. అతని నిరాడంబరత, నిబద్ధత, ఆచరణాత్మకత ఈ తరం సామాజిక విప్లవకారులకు ఆదర్శం.
నాగన్నను ఎప్పుడు కదిలించినా…
నా రోజులు వస్తాయి,
నా కన్నీళ్లు ఇంద్రధనస్సులవుతాయి
నాజ్ఞాపకాలే చరిత్ర లవుతాయి
మా బాధలే ప్రజల గాధలావుతాయి
అన్న భరోసాతోనే బతుకుతున్నాడు. ఒక రోజు అర్ధరాత్రి తానున్న తాటికమ్మల గుడిసెను సైతం కూల్చేసినా.. గుట్టుచప్పుడు కాకుండా గూడెం గుండెలోనే నేటికీ తలదాచుకుంటున్నాడు తప్ప సర్కారుకు సాగిలపడి డబుల్ బెడ్ రూమ్ అడగలేదు. చీకట్లను చీల్చుకొని వెలుగులోకి వచ్చిన పార్టీ బలహీనపడినా నమ్ముకున్న సైద్ధాంతిక స్థైర్యం, ఉద్యమ నిమగత, అమరుల ఆశయాల కోసం యావత్తు జీవితాన్ని త్యాగం చేసిన సాంస్కతిక సేనాని.
ఆటపాటలతోనే .. విశాల సాంస్కతిక ఉద్య మాన్ని నిర్మించాల్సిన తరుణంలో.. సుద్దాల హను మంతు జానకమ్మల జాతీయ పురస్కారం అందుకో వడం నాకు గొప్ప సందర్భంగా భావిస్తున్నాననీ, సలాంలు కొట్టే సర్కార్ అవార్డు కాదిది..! ప్రజాయుద్ధ కవి సుద్దాల హనుమంతు అవార్డు అంటే ”నా తండ్రులే ఎదిరించిన నాటి శత్రువే నేటికీ నీచంగా హీనంగా పీల్చిపిప్పి చేస్తుంటే” ఆ వీర తెలంగాణ వారసత్వాన్ని పుణికి పుచ్చు కోవడమేనని అన్నారు..
ప్రజాపాటలే ప్రజా చైతన్యానికి ఆచరణకు గీటురాయి. నియంతృత్వానికి ఏకైక సమాధానం కళా కారులంతా కలిసి నడవడమే ఇప్పుడు సరైన సమయం. సుద్దాల హనుమంతుకిచ్చే నిజమైన నివాళి.
(నేడు సుద్దాల హనుమంతు, జానకమ్మల జాతీయ అవార్డు అరుణోదయ నాగన్నకు అందజేస్తున్న సందర్భంగా)
భూపతి వెంకటేశ్వర్లు
9490098343