హృదయ శబ్దసముద్రం

The sound of the heartసబ్బని వారి మొట్ట మొదటి కవితా సంపుటి ‘మౌన సముద్రం’ .దీనిని వారు వారి తండ్రికి అంకితం చేశారు. దీనికి ముందుమాట రాసినటువంటి డాక్టర్‌ ఎన్‌.గోపి ఇలా అంటారు. ”లక్ష్మీనారాయణా! ‘మౌనసముద్రం’ అన్నావు కాని, అది నిజంగా శబ్దసముద్రం! నీ హదయ శబ్ధసముద్రం” అని.
అది చాలా వాస్తవమైన విషయం. నిజంగానే వారు ‘మౌన సముద్రం ‘ కవితా సంపుటిలో శబ్దాన్ని గలగలా పారించారు. ఈ కవితా సంపుటిలో మొత్తం 50 కవితలు ఉన్నాయి. టైటిల్‌ కవిత ‘మౌన సముద్రం’లో ఒక విరోధాభాసాభివ్యక్తి కనిపిస్తుంది. మౌనాన్ని, సముద్రాన్ని, జీవితాన్ని కలిపి తననే ఒక ‘మౌన సముద్రం’ గా చెబుతున్నట్టు ఈ టైటిల్‌లో కనిపిస్తుంది.
‘మౌన సముద్రం’ అనే కవితలో సబ్బని వారు మంచి మనుషులను కోరుకుంటున్న టువంటి కవిగా మనకు కనిపిస్తారు. జీవితం గురించి, సమాజంలో మనుషుల స్వభావాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని గూర్చి ఈ ‘మౌన సముద్రం’ అనే కవిత ద్వారా అర్థం చేయించారు. కవిత కొన్ని భాగాలు చూస్తే ”దేవతలు లేరిక్కడ / అంతా మానవులు దానవులే / కాలాన్ని కవ్వం చేసి / బతుకు సముద్రాన్ని చిలకాల్సిందే” అని అభివర్ణించారు. పత్తిపాక మోహన్‌ సబ్బనిని ‘మౌన సముద్రం’ కవి అంటారు. నిజంగానే సబ్బని ఇప్పటివరకు రాసిన ఆరు కవితా సంపుటాల్లో ‘మౌన సముద్రం’ మైలురాయి లాంటిది.
ఇక ‘ఉదయం’ అనే మరో కవితలో వారు ”ఉదయం ఒక ఆశాకిరణం/ ఆశల పొదరిల్లును అవనిపై వెదజల్లడానికి / కాలం నిచ్చెనపై నిలుచుండి గమ్యాన్ని చేరడానికి /ఉదయం రేపటి జీవితానికి సోపానం.” అంటారు. ప్రతి మనిషికి రేపటి ఉదయం మీద ఒక ఆశ ఉంటుంది. అలా ఉదయాన్ని ఈ కవి ఆశను నెరవేర్చుకునే ఒక సాధనంగా ఒక ఆశావాహ దక్పథంతో చూస్తున్నారు.
ఇక ”కవి నువ్వు ఆత్మహత్య చేసుకో !” అనే ఇంకో బలమైన కవిత రాశారు వారు. కవి ఎలా ఉండాలి, ఎంత ఆదర్శవంతుడై ఉండాలి, తను రాసేది ఒకటి చేసేది ఒకటిలా ఉండకూడదు అని చెపుతూ ఒక మాట వాడారు ”కవీ కాసుల కోసం చూస్తూ నువ్వు కవిత్వం రాయకు” అని. విశాల ప్రాతిపదికన కవిత్వం రాయడం గొప్ప ప్రయోజనం కలది అని చెబుతూ కేవలం పేరు కోసం, కీర్తి కోసం కవిత్వం రాయకు అని హితవు పలుకుతూ, అంత కన్నా గొప్ప విలువలు ఉన్నాయని గుర్తు చేస్తూ నువ్వు అలా కానపుడు అది ‘ఆత్మహత్య సాదశ్యం’ అని కవిని హెచ్చరించాడు.
సబ్బని రాసిన ఇంకో కవిత ”ఎక్కడ జనులు మునులై సంచరిస్తారో” టాగోర్‌ రాసిన ‘Where the Mind is Without Fear’ అనే కవితను పోలి ఉంటుంది. టాగోర్‌ వలెనే సబ్బని కూడా ‘ఎక్కడ మానవుడు మహనీయుడై మనిషై బతికి నిలుస్తాడో అక్కడ నన్ను పుట్టించు తండ్రీ !/ అలాంటి సమాజంలో నన్ను బ్రతుకనీయి తండ్రీ!’ అని దేవుడితో నివేదన చేస్తున్నాడు.
వారు ఈ కవితా సంపుటిలో ‘మనసు’ తత్త్వాన్ని వివరిస్తూ మరో మంచి కవిత రాశారు.
మనసు ‘మనోవాల్మీకం నీలినీడల్లో రెండు అగ్ని గోళాల్లా కనలిపోతుంది / మనసేకాని మనసు వేయి వెన్నెల సముద్రాలవుతుంది/ వేయి బాధల అగాధాల లోయలౌతుంది /కన్నీటి ప్రవాహంలో కడిగివేయబడుతుంది’ అంటారు. అంటే మనసుపడే వేదనను, మనసుపడే సంతోషాన్ని మనసుతత్వాన్ని పరిపరివిధా లుగా విడమర్చి చెప్పినటువంటి కవిత ఇది.
కవిత్వానికి వస్తువు ఈ విశ్వంలో ఏదైనా కావచ్చు, ఇప్పుడు యుధ్ధం ఒక భయంకర మైన పదం. యుద్ధం వల్ల నష్టపోయేది, కష్ట పడేది సామాన్యులేనని, వారి దుఃఖాన్ని ఎవరూ తీర్చలేరని చెపుతూ, సబ్బని వారు ”గల్ఫ్‌ వార్‌” మీద ఒక కవిత రాశారు యుద్ధ నీతిని, యుద్ధ ఫలితాల గురించి చెపుతూ, యుద్ధానికి కారకులైన దేశాల నాయకులని ఉద్దేశిస్తూ. ”ఎవరెన్నయినా చెప్పనీయండి /కనలిపోయి గుండె పొరల్లోంచి పెల్లుబికి వచ్చిన హాహాకారపు ఆర్తిని మీరు వినలేరు/ రక్తానికి, కన్నీటికి విలువ కట్టలేరు / డాలర్ల కంచెలు కట్టి మానవత్వాన్ని పూయించలేరు” అంటారు. సబ్బని కవితలు అన్నీ విలక్షణమైనవి, విభిన్నమైన వస్తువులతో కూడుకున్నవి. వారు ‘గోడలు’ అని మానవ జీవితానికి అన్వహిస్తూ చాలా మంచి కవిత వ్రాశారు. ఈ వస్తువు కొత్తగా అనిపిస్తుంది. ”మన హదయాలకు కవాటాలుంటాయి/ మన మనస్సుల్లోనే మెలిక లుంటాయి/ అసలు మనలోనే గోడలుంటాయి/ కాని గోడలకు గోడలేముంటాయి” అని రాస్తూ మనలోని గోడలను తొలగించుకుంటే సమాజం బాగుపడుతుందని గుర్తు చేస్తారు.
”వేట” అనే చిన్న కవితలో నేటి కాలపు దుస్థితిని ఎండగడుతూ ఒక కవిత రాశారు.
”కుందేళ్ళను, లేళ్లను, పులులు వేటాడేవి / పులుల్ని, లేళ్లను మనిషి వేటాడేవాడు/ నేడు లేళ్లూ లేవు, పులులూ లేవు/ బతుకే అడవైపోయి /మనిషిని మనిషే వేటాడుతున్నాడు” అంటూ రాసిన ఈ వాక్యాలు మనుషుల్ని మనుషులే ఎలా వాడుకుంటున్నారు, మోసం చేస్తున్నారు, ఎలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనే విషయాన్ని గురించి తెలియజేస్తున్నాయి.
ఇలా సబ్బని ‘మౌన సముద్రం’ లో మనిషిని, మనిషి చుట్టూ ఉన్న జీవితాన్ని ప్రధాన ఇతివత్తంగా తీసుకుని రాసిన కవితలు అనేకం ఉన్నాయి. ఈ కవితా సంపుటి ద్వారా మనిషి మనిషిగా, మంచి మనిషిగా నిలబడాలని కోరుకుంటున్న కవిగా మనకు సబ్బని లక్ష్మీనారాయణ కనబడతారు.
(”మౌన సముద్రం” రజతోత్సవ ప్రచురణ వేళ వారికి అభినందనలు)
డా|| తండ హరీష్‌గౌడ్‌
8978439551