– కొత్త ఏడాదిలో కూడా కొనసాగించాలి: ప్రధాని మోడీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశ ప్రజలకు ప్రధాని మోడీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది దేశం ఎన్నో ఘనతలు సాధించిందని గుర్తు చేశారు. 2023లో దేశ ప్రజల్లో వికసిత్ భారత్ స్ఫూర్తి రగిలిం దన్నారు. దాన్ని కొత్త సంవత్స రంలోనూ కొనసాగి ంచాలని పిలుపునిచ్చారు. ఆదివారం ప్రసారమైన 2023 చివరి ‘మన్ కీ బాత్’లో భాగంగా సాధించిన విజయా లను ఆయన గుర్తు చేశారు. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మహిళా బిల్లుకు ఈ ఏడాదిలోనే ఆమోదం లభించిందని మోడీ గుర్తు చేశారు. భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని పేర్కొన్నారు. దీనిపై దేశ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ లేఖలు రాస్తున్నారని వెల్లడించారు. ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సును విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ప్రస్తుతం భారత్ లోని ప్రతి ప్రాంతం ఎంతో ఆత్మవిశ్వాసంతో నిండి ఉందని తెలిపారు. దేశ ప్రజల్లో వికాస, స్వయం సమృద్ధి భారత్ స్ఫూర్తి రగిలిందని చెప్పారు. 2024లోనూ దాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు ఈ ఏడాది ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు దక్కడంతో దేశం మొత్తం ఉర్రూతలూగిందని మోడీ తెలిపారు. ‘ఎలిఫెంట్ విస్పరర్స్’కు సైతం ప్రతిష్ఠాత్మక అవార్డు రావటంతో భారతీయుల ప్రతిభ వెలుగుచూసిందని వ్యాఖ్యానించారు. 2023లో భారతీయుల సృజనాత్మకతను యావత్ ప్రపంచం వీక్షించిందని తెలిపారు. ఈ ఏడాదిలో మన క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చూపారని మోడీ కొనియాడారు. ఆసియా క్రీడల్లో 107, పారా గేమ్స్ 111 పతకాలతో సత్తాచాటారని గుర్తు చేశారు. వన్డే ప్రపంచ కప్‌లో భారత క్రికెట్ జట్టు అందరి మనసులు గెలుచుకుందని ప్రశంసించారు. చంద్రయాన్-3 విజయవంతంపై చాలా మంది తనకు సందేశాలు పంపుతున్నారని మోడీ తెలిపారు. శాస్త్రవేత్తల కృషితో ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగం విజయవంతమైందని, ఇది అందరికీ గర్వకారణమని చెప్పారు.