‘మిలాన్‌’ ఆరంభం

– ఇప్పటికే 20 దేశాల నుంచి విశాఖకు నౌకలు
– తీరంలో రిహార్సల్స్‌ అదుర్స్‌
విశాఖ : అంతర్జాతీయ నావికాదళ దేశాలతో రక్షణ సంబంధాలు, సముద్ర భద్రత లక్ష్యంగా తూర్పు నావికాదళం వేదికగా సోమవారం విశాఖలో మిలాన్‌-2024 ఆరంభమైంది. తొలి రోజు ప్రీ సెయిల్‌ డిస్కషన్స్‌ వంటి కార్యక్రమాలే సాగాయి. మిలాన్‌కు సంబంధించి 50 దేశాలకు ఆహ్వానాలు పంపగా, 20 దేశాల నౌకలు విశాఖ తీరానికి ఇప్పటికే చేరుకున్నాయి. సోమ, మంగళవారాల్లో అనధికారిక సన్నాహాల్లో నేవీ నిమగమైంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ నెల 21న హార్బర్‌ ఫేజ్‌ విన్యాసాలను ఐఎన్‌ఎస్‌ సముద్రిక ఆడిటోరియంలో ప్రారంభించనున్నారు. 22న ఉదయం ఎన్‌ఎస్‌టిఎల్‌లోని సముద్రిక ఆడిటోరియంలో జరిగే నేవీ వేడుకలో ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌ పాల్గొననున్నారు. ఈ నెల 23 వరకూ హార్బర్‌ ఫేజ్‌లోనే ఈ విన్యాసాలు జరగనున్నాయి. 22న సాయంత్రం ఆర్‌కె బీచ్‌లో జరగనున్న మిలాన్‌ సిటీ పరేడ్‌ వేడుకకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. తీరంలో వివిధ దేశాల నావికాదళ అధికారులు, సిబ్బంది నిర్వహించే పరేడ్‌, నౌకల విన్యాసాలను ఆయన తిలకించనున్నారు.