కులగణన తీర్మానంతో రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర పుటలలో నిలిచింది

– బీసి కమిషన్ ఛైర్మన్ డా.వకుళాభరణం
నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
కృష్ణమోహన్“కుల సర్వే” తీర్మానం తో- చరిత్ర పుటలలో “రాష్ట్ర ప్రభుత్వం, కుల సర్వే తో తీరనున్న బీసీల చిరకాల డిమాండ్ అని , కుల సర్వేతో.. బలహీన వర్గాల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని లక్ష్మీ నారసింహ్మున్ని వేడుకున్నానని బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రం లో సామాజిక, ఆర్ధిక కుల సర్వే ను చేపట్టడానికి ప్రభుత్వం కార్యాచరణకు సిద్దం కావడం పట్ల రాష్ట్ర బీసి కమిషన్ చైర్మన్  డా.వకుళాభరణం కృష్ణమోహన్ హర్షం  వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బలహీన వర్గాల ప్రజలందరి, జనాభా లెక్కలను శాస్త్రీయంగా చేపట్టడానికి వీలుగా, ఇటీవల ప్రభుత్వం శాసనసభ లో తీర్మానం ప్రవేశపెట్టి, ఏకగ్రీవంగా ఆమోదంపచేసుకోవడం ఒక “చారిత్రాత్మక ప్రక్రియ“ గా ఆయన కొనియాడారు. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కి, బీసి సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆయన ధన్యవాదాలు, అభినందనలు తెలియచేశారు. బుధవారం నాడు సాయంత్రం  డా.వకుళాభరణం కృష్ణమోహన్, కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ లక్ష్మి నారసింహ స్వామి సన్నిధిలో, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయన రాక సందర్భంగా జిల్లా రెవిన్యూ అధికారులు  అమరనాద్, వెంకటేశ్వర్లు, బీసి సంక్షేమ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అర్చక స్వాములు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లన్ దిగాన్ లక్ష్మి నరసింహా చార్యులు, కాండూరి వెంకటా చార్యులు, అర్చక బృందం వేదాశీర్వచనాలు ఇచ్చారు, ఆలయ అధికారులు స్వామి వారి శేష వస్త్రం, లడ్డు ప్రసాదం అందచేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల పాత్రికేయులతో ఆయన కాసేపు మాట్లాడారు. బలహీన వర్గాలు ప్రధానంగా చాలా ఏళ్ళుగా బీసీలు, తమను లెక్కలు తీసి తదననుగుణంగా అన్ని రంగాలలో తమ వాటాను కోరుకుంటున్నారని అన్నారు. ఇన్నాళ్ళకు  రేవంత్ రెడ్డి  ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయించి, కార్యాచరణను    మొదలుపెట్టడం గొప్ప శుభారంభం అన్నారు. విద్యార్ధి దశ నుండి ఒక ఉద్యమ నాయకుడిగా, నేడు బీసి కమిషన్ చైర్మన్ గా అనేక వేదికలలో “బీసి కుల గణన” డిమాండ్ ను బలంగా వినిపించానన్నారు. కాగా తాను  ప్రస్తుతం చట్టబద్దమైన హోదాలో ఉన్న, ఈ సమయం లో ప్రభుత్వం ఇంతటి మహత్తరమైన నిర్ణయం తీసుకోవడం ఒక అపూర్వ ఘట్టం గా తన జీవితంలో మిగులుతుందన్నారు. ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే ఈ కుల సర్వే కు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా చూడాలని, లక్ష్మీ నారసింహ్మున్ని ప్రార్దించినట్లు తెలిపారు. ఈ సర్వే పూర్తై గణాంకాలు, సమాచారం ప్రభుత్వం అందుబాటులోకి వస్తే, బలహీనవర్గాలు ఆశించిన రీతిలో అభివృద్ది లోకి రావదానికి మార్గం సుగమం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.