– 10న ఖమ్మం 3 టౌన్‌లో జిల్లా విస్తృతస్థాయి సమావేశాన్ని జయప్రదం చేయండి
– తెలంగాణ గిరిజన సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఎం.ధర్మనాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం
నవతెలంగాణ-ఖమ్మం
రాష్ట్రంలో అన్ని రకాలుగా వెనకబడ్డ గిరిజనుల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలపై దృష్టి సారించాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు యం.ధర్మానాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య వీరభద్రం విజ్ఞప్తి చేశారు. తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కమిటీ సమావేశం ఆన్‌లైన్‌లో జిల్లా అధ్యక్షులు బాణోతు బాలాజీ అధ్యక్షతన జరిగినది. గిరిజన తండాలో ప్రాథమిక పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించి తగిన స్థాయిలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థులకు ఆశ్రమ పాఠశాలలో ఇంగ్లీష్ విద్య అందించాలని కోరారు. గురుకులల్లో దరఖాస్తు చేసుకున్న ప్రతి గిరిజన విద్యార్థులకు సీట్లు ఇవ్వాలని, విద్యా సంస్థలో ఉన్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమ పాఠశాలలో గత సంవత్సరం గిరిజన సంఘం చేసిన సర్వేలో అనేక సమస్యలు వెలుగులో వచ్చాయని వాటిని గత ప్రభుత్వం పరిష్కరించలేదని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్య అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైందని నకిలీ విత్తనాలు అరికట్టి గిరిజన రైతులకు పూర్తిస్థాయి సబ్సిడీలో విత్తనాలు సరఫరా చేయాలని, గిరిజన తండాలో అంటురోగాలు వ్యాప్తించకుండా వైద్యం ప్రతి గిరిజనుడికి అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఈనెల 10న గిరిజన సంఘం జిల్లా విస్తృత సమావేశం ఖమ్మం 3 టౌన్ ప్రాంతంలో జరుగుతుందని సభ్యులందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు భూక్యా శ్రీనివాస్ నాయక్, బానోతు బన్సిలాల్ భూక్యా కృష్ణ నాయక్, అజ్మీరా శోభన్ నాయక్, బాధావత్ శ్రీను, తేజావత్ కృష్ణ కాంత్, బానోతు హరిచంద్, మూడ్ గన్యా నాయక్, గుగులోత్ వీరు నాయక్, పాల్గొన్నారు.